logo

జగన్‌.. మాపై ఎందుకీ కక్ష?

భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్‌ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం.

Published : 04 May 2024 04:44 IST

పింఛన్ల పంపిణీలో ప్రభుత్వ తీరుపై పండుటాకుల ఆగ్రహం
రెండో రోజూ బ్యాంకులు, సచివాలయాల చుట్టూ ప్రదక్షిణ
మండుటెండలో తిరుగుతూ సొమ్మసిల్లిన వృద్ధులు

 

భట్టిప్రోలు మండలం తాతావారిపాలెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు స్థానిక యూనియన్‌ బ్యాంకుకి ఆటోలో వచ్చారు. ఆమె ఖాతాలో కొంతకాలంగా లావాదేవీలు జరగకపోవడంతో నగదు తీసుకోవడం. సాధ్యం కాదని బ్యాంకు అధికారులు చెప్పారు. బయట కూర్చోవటంతో కళ్లు తిరిగి పడుకుంది. 12 గంటల సమయంలో కుటుంబ సభ్యులు వచ్చి ఆమెను ఆటోలో తీసుకెళ్లారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటికే పింఛను అందించే వెసులుబాటును కాదని, అవ్వాతాతలను బ్యాంకుల వద్దకు రప్పించి ప్రభుత్వం ఇక్కట్ల పాల్జేసింది. బ్యాంకులు, సచివాలయాల చుట్టూ మండుటెండలో తిరుగుతూ వృద్ధులు  అష్టకష్టాలు పడ్డారు. ఎండకు తాళలేక సొమ్మసిల్లిపడిపోయారు. బ్యాంకుల్లో రద్దీ పెరగడంతో గేట్లు వేసి కొందరినే బయటే ఉంచడంతో వారుపడిన పాట్లు వర్ణనాతీతం. జగన్‌ రాజకీయ కుట్రకు తాము బలయ్యామని వృద్ధులు, వితంతువులు ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల్లో రద్దీ పెరగడం, కూర్చొడానికి చోటు, తాగడానికి నీరు అందుబాటులో లేకపోవడం, తీవ్రమైన  ఉక్కపోత, వేడిసెగలతో కూడిన గాలులతో వృద్ధులు అల్లాడిపోయారు.

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే- 

రేపల్లె అర్బన్‌, భట్టిప్రోలు, అద్దంకి, బాపట్ల

జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు సామాజిక భద్రత పింఛన్లను లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేసి వారందరినీ ఎండలో తిప్పారు. పండుటాకులు పింఛన్‌ సొమ్ము కోసం ఇంటి గడప దాటి బ్యాంకులు, గ్రామ, వార్డు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి పింఛన్ల సొమ్మును జిల్లాలోని లబ్ధిదారుల్లో 75 శాతం మందికి వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకెళ్లడానికి అవ్వాతాతలు బ్యాంకుల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి. గురువారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకులు, కియోస్క్‌ కేంద్రాల వద్ద అవ్వాతాతలు, వితంతువులు బ్యాంకులకెెళ్లి నగదు కోసం పడరాని పాట్లు పడ్డారు. శుక్రవారం కూడా అదే పరిస్థితి పునరావృతమైంది. వందలాది మంది బ్యాంకులకు వెళ్లటంతో సిబ్బంది పింఛన్ల సొమ్ము అందించేందుకు చాలా సమయం తీసుకున్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి నగదు జమ కాకపోవడంతో వారు గ్రామ సచివాలయాలకు వెళ్లి ఆరా తీశారు. పింఛను సొమ్ము బ్యాంకులోనే జమ చేశామని సచివాలయ సిబ్బంది చెబితే మళ్లీ బ్యాంకులకు వెళ్లారు. అక్కడ మరోసారి చూసి బ్యాంకు ఖాతా మనుగడలో లేదని, ఆధార్‌కార్డు, రెండు ఫొటోలు తీసుకొస్తే ఖాతా అప్టేట్‌ చేసిన తర్వాత నగదు తీసుకోవచ్చని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో ఉసూరుమంటూ వృద్ధులు వెనుదిగిరారు.

కొనసాగిన తప్పుడు ప్రచారం..

వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పింఛను నగదు చెల్లించడానికి చంద్రబాబునాయుడు ఆటంకాలు కలిగిస్తున్నారని, కోర్టులో కేసులు వేసి ఇబ్బందులకు గురిచేస్తున్నాడనీ గురువారం నుంచి ఫోన్లకు వాయిస్‌ రికార్డు వస్తున్నాయి. శుక్రవారం కూడా ఇవి కొనసాగాయి. కొన్నిచోట్ల రాజీనామా చేసిన వాలంటీర్లు, కొందరు వైకాపా నేతలు బ్యాంకులు, ఆయా మార్గాల్లో వృద్ధులు కనిపిస్తే తెలుగుదేశం పార్టీ కుట్ర వల్ల ఇబ్బందులు వచ్చాయని వారికి చెప్పే ప్రయత్నం చేశారు. లబ్ధిదారులు కొందరు ప్రభుత్వంలో ఉన్నది జగన్‌ కదా? ఆయన సక్రమంగా చేయలేక ఎదుటివారిపై నిందలు వేస్తారా? అని నిలదీశారు.

ఎస్‌బీఐ కాదు.. బీవోబీకి వెళ్లండి

రేపల్లె మండలం వడ్డివారిపాలెం పంచాయతీ వాకావారిపాలేనికి చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు వాకా కోటేశ్వరమ్మ వృద్ధాప్య పింఛను తీసుకునేందుకు శుక్రవారం రేపల్లె చేరుకున్నారు. స్థానిక ఎస్‌బీఐ మెయిన్‌ బ్రాంచిలో నగదు తీసుకొనేందుకు వెళితే, బ్యాంకు ఆఫ్‌ బరోడా బ్యాంకు ఖాతాలో నగదు జమ అయిందని సిబ్బంది చెప్పారు. మెట్లు దిగి నడవలేక అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. వాకావారిపాలెం నుంచి 15 కి.మీ దూరం ఆటోలో రేపల్లె వచ్చి అక్కడ నుంచి బ్యాంకుకు ఎండలో నడిచి రావడంతో వడదెబ్బకు గురై నీరసించి పోయానని వాపోయింది.

ఎండలో తిప్పడం సీఎం జగన్‌కు భావ్యమేనా?

పింఛను కోసం చీరాల నుంచి బస్సులో బాపట్ల వచ్చి సచివాలయానికి వెళ్లాను. నగదు బ్యాంకు ఖాతాలో జమ చేశామన్నారు. బ్యాంకుకు వెళ్లి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి ఉండి పాసుపుస్తకం చూపిస్తే నీ ఖాతా పని చేయడం లేదని చెప్పి ఓ కాగితం తీసుకుని మళ్లీ వచ్చే బుధవారం రావాలని సూచించారు. 80 ఏళ్ల వృద్ధురాలిని ఇలా ఎండలో తిప్పటం సీఎం జగన్‌కు భావ్యమేనా? బ్యాంకుల్లో పింఛను సొమ్ము ఎవరు వేయమన్నారు. మండుటెండలో తిప్పి మా ప్రాణాలు తీసేస్తారా.. ప్రభుత్వమే కనీసం దయ లేకుండా ఇలా ఇబ్బంది పెడితే మాలాంటి వృద్ధులు ఎవరికి చెప్పుకోవాలి.

వీరమ్మ, వృద్ధురాలు

అలసి.. సొలసి..సొమ్మసిల్లి..

అద్దంకి ఎన్టీఆర్‌నగర్‌లో నివాసం ఉంటున్న  పినపాల వెంకటరత్నం తన పింఛను గురించి పదో సచివాలయం వద్దకు వెళ్లి విచారించగా బ్యాంకు ఆఫ్‌ ఇండియాలో ఖాతా ఉన్నట్లు సూచించారు. దీంతో ఆమె బ్యాంకుకు వెళితే ఖాతా యాక్టివ్‌గా లేదని, వెంటనే రూ.100 చెల్లించి, తగు ఫారాలు నింపుకోవాలని సూచించారు. అప్పటికే మధ్యాహ్నం 12 గంటలు కావడంతో నీరసించి ఆమె పురపాలక కార్యాలయం మెట్ల వద్దకు వచ్చి సొమ్మసిల్లింది. ఆ మార్గంలో వెళ్తున్న తెలుగు యువత నేత కోనేటి అనిల్‌ గమనించి ఆమెను బ్యాంకు వద్దకు తీసుకెళ్లి తగు పత్రాలను అందించారు. శనివారం నాటికి బ్యాంకు ఖాతా మనుగడలోకి వస్తుందని,  అనంతరం నగదు డ్రా చేసుకోవచ్చని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని