logo

తెదేపా ప్రచార వాహన డ్రైవర్‌పై వైకాపా దాడి

తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్‌పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది.

Published : 25 Apr 2024 05:11 IST

మంత్రి ఇంటి వద్ద గొడవ

మంత్రి విడదల రజిని ఇంటి వద్ద గొడవ పడుతున్న తెదేపా, వైకాపా నాయకులు,

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ ప్రచార వాహన డ్రైవర్‌పై కొందరు వైకాపా నాయకులు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థిని గళ్లా మాధవి ప్రచార వాహన డ్రైవర్‌ జెట్టి శ్రీనివాస్‌ శ్యామలనగర్‌ వీధుల్లో ప్రచారం నిర్వహించి ఎండగా ఉండడంతో మంత్రి రజిని కార్యాలయం సమీపంలో చెట్టు కింద నిలిపారు. దీంతో రజని అనుచరులు ఇక్కడ తెదేపా వాహనాలు ఉంచడానికి వీల్లేదని, అక్కడ నుంచి వెళ్లి పోవాలని వాదనకు దిగారు. డ్రైవర్‌ శ్రీనివాస్‌ నీడగా ఉందని రోడ్డు మీద పెట్టుకుంటే..మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటని ప్రశ్నించాడు. ఈ క్రమంలో మాటామాటా పెరగడంతో శ్రీనివాస్‌ ముఖంపై మంత్రి అనుచరులు చేతులతో దాడి చేశారు. ఈ విషయాన్ని డ్రైవర్‌ శ్రీనివాస్‌ కార్పొరేటర్‌ ఈరంటి వరప్రసాద్‌బాబుకు తెలియజేశాడు. ఆయనతో పాటు పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు అక్కడకు చేరుకున్నారు. అప్పటికే రజిని ఇంటి వద్ద ఆమె మరిది గోపి తదితరులు ఉన్నారు. డ్రైవర్‌పై దాడి ఎందుకు చేశారని కార్పొరేటర్‌ వరప్రసాద్‌ మంత్రి అనుచరులను ప్రశ్నించారు. దీనికి రెచ్చిపోయిన గోపి ఆయనతో వాదనకు దిగారు. ఇరు వర్గాల మద్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకొంది. గొడవ తోపులాట వరకూ వెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. వైకాపా నాయకులు తెదేపా ప్రచార వాహనం డ్రైవర్‌ శ్రీనివాస్‌పై దాడి చేయడమే గాక తమపై తెదేపా నాయకులు దౌర్జన్యానికి వచ్చారని ఫిర్యాదు చేశారు. ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. మరోవైపు డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లగా పోలీసులు తీసుకోలేదు. వైకాపా నాయకులు దాడి చేసిందే గాక శ్రీనివాస్‌ మద్యం తాగి ఉన్నాడని ఆరోపణలు చేసినందున పరీక్షలు చేయించమని తాము కోరినా పోలీసులు ఆపని చేయలేదని కార్పొరేటర్‌ వరప్రసాద్‌బాబు వాపోయారు. పైగా వైకాపా నాయకులు తనపై దాడి చేయకపోయినా..దాడి చేశారని తెదేపా నాయకులకు తెలియజేసినట్లు శ్రీనివాస్‌తో రాయించుకొని పోలీసులు బెదిరించి పంపారని ఆయన విమర్శించారు. పోలీసులు మంత్రి రజినికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తాము దౌర్జన్యం చేసేందుకు వెళ్లామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

డ్రైవర్‌ జెట్టి శ్రీనివాస్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు