logo

చందా.. దందా

ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు.

Published : 25 Apr 2024 05:15 IST

అప్పుడు మద్యం.. ఇప్పుడు మిర్చి వ్యాపారుల నుంచి వసూళ్లు

పట్టాభిపురం, న్యూస్‌టుడే: ఎన్నికలంటే ఖర్చులు ఎలా ఉంటాయో మీకు తెలియంది కాదు. పైగా  ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్నా..ప్రజాప్రతినిధిగా అయిదేళ్లలో మీకు ఎన్నో పనులు చేసి పెట్టా. కరోనా సమయంలో అప్పుడున్న పరిస్థితులతో మీరు వ్యాపార లావాదేవీలు నిర్వహించుకునేందుకు పాస్‌లు ఇప్పించా. అంతేగాకుండా అన్నివిధాలా మీకు సహకరించా. నేను ఎంపీగా ఎన్నికై పార్లమెంట్ మెట్లు ఎక్కితే మీకు ఎంతో అండగా ఉంటా. మీ వ్యాపార లావాదేవీలకు అధికారులు పూర్తిగా సహకరించేలా చూస్తా. గతంతో పోలిస్తే ఖర్చులు బాగా పెరిగిపోయాయి. ఈ పరిస్థితుల్లో మీరు చేతనైనంత ఆర్థిక సహకారం అందించండి. పైగా గతంలో నేను కూడా ఇదే వ్యాపారం చేశా. వ్యాపార పరంగా కూడా మీకు ఎన్నో పనులు చేసి పెట్టా. ఎవరి శక్తి మేరకు వారు చందాలు వసూలు చేసి పెట్టాల్సిందే...

...ఇది గతంలో ఎమ్మెల్యేగా ఎన్నికై ఈ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తున్న ఓ పార్టీ అభ్యర్థి మిర్చి వ్యాపారులకు చేసిన హుకుం. ఆయన ఇప్పటికే దందా చేసి మద్యం వ్యాపారుల నుంచి చందాలు వసూలు చేయగా.. తాజాగా మిర్చి వ్యాపారుల వంతు వచ్చింది.

స్థాయిని బట్టి మొత్తాలు

గుంటూరు మిర్చియార్డు నుంచి దేశ విదేశాలకు మిర్చి ఎగుమతి అవుతుంటుంది. క్రయవిక్రయాలు భారీ స్థాయిలో జరుగుతుంటాయి. వ్యాపారులకు ఆదాయం కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారుల్లో ఎవరూ నిక్కచ్చిగా వ్యాపారాలు చేసే వారు ఉండరు. ఎగుమతి వ్యాపారులైతే జీరో, కటింగ్‌, దిగుమతి వ్యాపారులైతే బిల్లు టు బిల్లు, అధిక కమీషన్‌ వసూలు చేస్తుంటారు. గతంలో ఇదే వ్యాపారంలో సిద్ధహస్తులైన సదరు ప్రజాప్రతినిధికి ఎగుమతి, దిగుమతి వ్యాపారుల చేసే అక్రమాలు, అవకతవకలపై స్పష్టమైన అవగాహన ఉండడంతో ఎంపీగా ఎన్నికైతే వాటన్నింటికీ ఎటువంటి ఢోకా ఉండదని భరోసా ఇస్తూ వసూళ్లకు తెర లేపారు. మిర్చి ఎగుమతి వ్యాపారులు 300 మంది వరకు ఉంటారు. ఇందులో బడా వ్యాపారులు, ఓ మోస్తరుగా వ్యాపారం చేసే వారు, చిన్న వ్యాపారులు ఉంటారు. ఏ స్థాయి వ్యాపారులు ఎంతెంత ఇవ్వాలో గ్రేడింగ్‌ చేసి మరీ ఎంపీ అభ్యర్థి హుకుం జారీ చేశారు. పెద్ద వ్యాపారులైతే ఒక్కొక్కరూ రూ.10 లక్షలు, మధ్యస్థంగా ఉండే వారికి రూ.5 లక్షలు, చిన్న వ్యాపారులైతే రూ.3 లక్షలు వంతున ఇవ్వాలని కోరారు. ఇక దిగుమతి లైసెన్స్‌లు 550కు పైగానే ఉన్నాయి. ఇందులో కొంత మందికి లైసెన్స్‌లు ఉండవు. లైసెన్స్‌లు ఉండి పెద్ద మొత్తంలో వ్యాపారం చేసే వారి నుంచి రూ.5 లక్షలు, చిన్న వ్యాపారులైతే రూ.3 లక్షలు, లైసెన్స్‌లు లేని వ్యాపారులకు రూ.లక్ష వరకు ఇండెంట్ పెట్టారు. ఎంపీగా గెలిస్తే పొరుగు రాష్ట్రాల్లో వ్యాపార పరంగా ఆగిపోయిన సొమ్ము కూడా వసూలు చేసి పెడతానని, గతంలో ఐపీ పెట్టిన వారి నుంచి కూడా కొంత మేరకు సొమ్ము వసూలు చేసిన విషయాన్ని గుర్తు చేసి వసూళ్లకు దిగుతున్నారు. ఈ విధంగా కోట్లాది రూపాయలకు టెండర్‌ పెట్టారు. సాధ్యమైనంత వరకు సొంత సొమ్ము ఖర్చు పెట్టకుండా చందాలపై ఎన్నికలు ముగించాలనే ఉద్దేశంతో సదరు అభ్యర్థి ఉన్నారని వ్యాపారులు వాపోతున్నారు.

సెలవలివ్వకముందే చక్కబెట్టాలని: త్వరలో మిర్చియార్డుకు వేసవి సెలవులు ప్రకటిస్తారు. ఈలోగా చందాల వసూళ్ల పర్వం తంతు ముగించేలా చూడాలని ఎగుమతి, దిగుమతి సంఘాల నాయకులను పురమాయించారు. సంఘాల నాయకుల నుంచి ఫోన్లు వస్తే ఎత్తి మాట్లాడాలంటే వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన సదరు పార్టీకి, అభ్యర్థికి అంత పెద్ద మొత్తంలో సొమ్ములు ఎక్కడ నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని, ఇప్పుడు ఈయనకు ఇచ్చిన విషయం తెలిసి...మరో పార్టీ అభ్యర్థులు అడిగితే అప్పుడు ఏమి చేయాలని ట్రేడ్‌ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు