logo

పదవిని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన

 ‘ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ప్రకృతి సంపదను నాశనం చేసి ఏకంగా 700 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వి కిలారి రోశయ్య అక్రమ సంపాదన వెనకేసుకున్నారు.

Published : 29 Apr 2024 06:31 IST

జగన్‌ మూడు రాజధానులంటే రోశయ్య వంత పాడుతున్నారు
నేనైతే రాజీనామా చేసి జగన్‌ ముఖాన కొట్టేవాణ్ని
గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌

మాట్లాడుతున్న పెమ్మసాని చంద్రశేఖర్‌, వేదికపై గళ్లా మాధవి తదితరులు

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే:  ‘ఎమ్మెల్యే పదవి అడ్డుపెట్టుకుని ప్రకృతి సంపదను నాశనం చేసి ఏకంగా 700 ఎకరాల్లో గ్రావెల్‌ తవ్వి కిలారి రోశయ్య అక్రమ సంపాదన వెనకేసుకున్నారు. అందుకే ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా జగన్‌ చెప్పినట్లు తోలుబొమ్మలా ఆడుతున్నారు. మూడు రాజధానులు కావాలని జగన్‌ చెప్పమంటే చెబుతారా.. ప్రజల బాగోగుల గురించి ఆలోచించరా.. అదే నేనైతే రాజీనామా చేసి జగన్‌ ముఖాన కొట్టేవాణ్ని’.. అని గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ మండిపడ్డారు. గుంటూరు బృందావన్‌ గార్డెన్స్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం రోడ్డులో వేములపల్లి విఠల్‌ ఆధ్వర్యంలో విశ్రాంత మున్సిపల్‌ కమిషనర్‌ దేవినేని కరుణ చంద్రబాబు అధ్యక్షతన ఆదివారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పెమ్మసాని మాట్లాడుతూ ‘రాజధాని అమరావతి వద్దు.. మూడు రాజధానులే ముద్దు’.. అని ప్రకటించిన గుంటూరు ఎంపీ వైకాపా అభ్యర్థి కిలారి రోశయ్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయిదేళ్ల జగన్‌ పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోగా ఉన్న రాజధానిని కూడా నాశనం చేశారన్నారు. అక్రమ మైనింగ్‌ ద్వారా రూ.2,300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అందుకే జగన్‌ చెప్పినదానికల్లా రోశయ్య తల ఊపుతున్నారని విమర్శించారు. ఎంపీగా ఓడిపోతారని తెలిసినా గత్యంతరం లేకే ఆయన పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మంత్రి విడదల రజిని ఒక సిస్టమాటిక్‌గా అవినీతికి పాల్పడ్డారన్నారు. చిలకలూరిపేటలో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని, అందుకే అక్కడి నుంచి పారిపోయి గుంటూరు పశ్చిమానికి వచ్చారన్నారు. గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి మాట్లాడుతూ ‘పదవి కోసం రాజకీయాల్లోకి రాలేదు. బాధ్యతగా ప్రజలకు సేవ చేసేందుకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా. అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు అందరూ కలిసికట్టుగా ఏకతాటిపైకి రావాలి. నిండు మనసుతో ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా’.. అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెదేపా నాయకులు తాళ్ల వెంకటేష్‌, రావిపాటి సాయికృష్ణ, మానం శ్రీనివాసరావు, రామినేని వెంకట్రావు, జనసేన నాయకులు ఆళ్ల హరి తదితరులు పాల్గొన్నారు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని