logo

ఓట్ల వేటలో జగన్నాటకమే

పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది.

Updated : 30 Apr 2024 07:13 IST

తీవ్ర ఎండలను పట్టించుకోకుండా పింఛనుదారులపై కక్షసాధింపు
తెదేపాపై నెపం నెట్టి లబ్ధి పొందాలనే దురాలోచన
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట, న్యూస్‌టుడే, నరసరావుపేట అర్బన్‌

  • బెల్లంకొండ మండల కేంద్రానికి వెంకటాయపాలెం 22 కిలోమీటర్లు, ఎమ్మాజీ గూడెం 17 కిలోమీటర్లు దూరం. మండల కేంద్రానికి రావడానికి బస్సులుండవు. ఆటోలు కూడా రావు. ఈ గ్రామాల్లో ఉండే వృద్ధులు పింఛను తీసుకోవాలంటే బెల్లంకొండలోని బ్యాంకుకు రావాల్సిందే. ఒకవేళ అంతదూరం నుంచి వచ్చినా ఖాతాలో నగదు పడకపోతే? వారి పరిస్థితి ఏంటీ.?

  • మాచర్ల మండల కేంద్రానికి అచ్చమ్మకుంట తండా 15 కిలోమీటర్ల దూరం. దుర్గి మండల కేంద్రానికి మించాలపాడు 7 కి.మీ ఉంటుంది. ఈ రెండు గ్రామాల వారు మండల కేంద్రాలకు రావడానికి ఆటోలు కూడా ఉండవు. పింఛను తీసుకునే వృద్ధులు బ్యాంకులకు రావాలంటే అష్టకష్టాలు పడాల్సిందే. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి.

‘‘ఏప్రిల్‌లో పింఛను పంపిణీకి ఎదురైన ఇబ్బందుల దృష్ట్యా మరోసారి అలాంటివి పునరావృతం కాకుండా ఉండేలా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇంటివద్దకే పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మరోసారి ఈసీ స్పష్టం చేసింది’’

- పోలింగ్‌ తేదీ దగ్గరపడుతున్న వేళ వైకాపా ప్రభుత్వం ఎలాగైనా లబ్ధిపొందాలని తమ స్వార్థానికి పండుటాకులను తిప్పలు పెడుతోంది. పింఛనును అందుకోవడంలో ఎదురయ్యే కష్టాలు ప్రతిపక్షంపై నెట్టడానికి బ్యాంకు ఖాతాలో పింఛను నగదు జమ అంటూ కొత్త నాటకానికి తెర లేపింది.


‘‘వాలంటీర్ల ద్వారా పింఛను పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం(ఈసీ) ఆదేశించింది. అంతేకానీ ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయొద్దని చెప్పలేదు. సచివాలయ ఉద్యోగులను వినియోగించుకుని వృద్ధులకు ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే వెళ్లి అందించాలని కోరింది’’

- దీన్ని అవకాశంగా తీసుకుని వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఏప్రిల్‌ పింఛన్ల పంపిణీలో దుష్ప్రచారం చేసింది. సచివాలయాల వద్ద బారులు తీరిన పింఛనుదారుల ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడుతూ రాక్షసానందం పొందింది.


పండుటాకులపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. మొన్న పింఛన్ల కోసం సచివాలయాల చుట్టూ తిప్పి ఇబ్బందులకు గురిచేసింది. అది సరిపోలేదని ఈసారి ఏకంగా కిలోమీటర్ల దూరం వెళ్లి బ్యాంకుల నుంచి పింఛను తెచ్చుకునేలా చేస్తోంది. గత నెల కంటే ఈసారి వారి కష్టాలు రెట్టింపు కానున్నాయి. ఈనెల 30న సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛను నగదు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని కొందరికి, ఇంటికే తెచ్చి ఇస్తామని కదల్లేని వృద్ధులకు చెప్పనున్నారు.

ఎండలు మండుతున్న నేపథ్యంలో..: వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో జనం అల్లాడిపోతున్నారు. యువత సైతం  ఇంటి నుంచి బయటికి రావడానికి జంకుతోంది. అత్యవసరమై బయటికి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వం పండుటాకులకు ఇంటి వద్దే పింఛను ఇవ్వాలని సామాజికవేత్తలు, మానవతావాదులు, పింఛనుదారులు కోరుతున్నారు.


బ్యాంకుల వద్దకు వెళ్లాలంటే..

చాలామంది వృద్ధుల బ్యాంకు ఖాతాలు క్రియాశీలకంగా లేవు. కొందరికి బ్యాంకు ఖాతాలే లేవు. అయిదేళ్లుగా పింఛన్లను చేతికే అందిస్తుండడంతో బ్యాంకు ఖాతాతో వారికి పనిలేకుండా పోయింది. అంతేకాకుండా చాలామంది తమ ఖాతాలలో మినిమం బ్యాలెన్స్‌ కూడా ఉంచడం లేదు. దీంతో ఒకవేళ పింఛను నగదు జమ చేస్తే అందులో బ్యాంకు సిబ్బంది కోత విధిస్తారు. మరోవైపు గ్రామాల్లో ఉండే పండుటాకులు పట్టణాలు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద గంటలకొద్దీ బారులు తీరాల్సి వసుతంది. చాలామంది నిరక్షరాస్యులే. నగదు తీసుకోవడం వారికో పెద్ద సమస్య. మండే ఎండకు ఖర్చుపెట్టుకుని ఆటోనో, బస్సులోనో వెళ్లి తిరిగి ఇంటికి చేరడం అనేది సాధారణ విషయం కాదు. దీనికంటే సచివాలయానికి వెళ్లి తెచ్చుకోవడమే ఉత్తమం. మాచర్ల, బెల్లంకొండ, వెల్దుర్తి, బొల్లాపల్లి, దుర్గి మండలాల్లో గ్రామాలు చాలా దూరంలో ఉన్నాయి. వీరంతా మండల కేంద్రాలకు రావడం శ్రమతో కూడుకున్న వ్యవహారం. పైగా మే నెల మండుటెండలో బయటకు రావడం అంటే ప్రాణాలతో చెలగాటమే.


ఇంటింటికి వెళ్లి ఇచ్చే వెసులుబాటు ఉన్నా....

జిల్లాలో ఒక్కొక్క సచివాలయం పరిధిలో సగటున 394 పింఛన్లు ఉన్నాయి. సచివాలయాల్లో సిబ్బంది ఒక్కొక్కరు 62 చొప్పున పంపిణీ చేస్తే ప్రక్రియ పూర్తవుతుంది. సచివాలయ సిబ్బంది చరవాణిలో యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని డివైజ్‌ ద్వారా పింఛను పంపిణీ చేయవచ్చు. ఇందుకు సంబంధించిన డివైజ్‌లు అందుబాటులో ఉన్నాయి. వార్డు, గ్రామ సచివాలయం సిబ్బంది ప్రతివిభాగానికి ఒక్కొక్కరు చొప్పున అందుబాటులో ఉన్నారు. పింఛను లబ్ధిదారులు ఆయా వార్డు, గ్రామ సచివాలయాల పరిధిలోనే నివాసం ఉంటారు. వీరందరికీ ఇక్కడి సిబ్బందితో పింఛను సొమ్ము ఒకటి, రెండు రోజుల్లోనే లబ్ధిదారులకు ఇంటివద్దే వంద శాతం పంపిణీ చేసే అవకాశం ఉంది. పింఛన్ల పంపిణీపై సచివాలయ సిబ్బంది అవగాహన ఉన్నందున ఎక్కడా ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం లేదు.


అప్పుడేమో అలా..: సచివాలయాల ఉద్యోగుల ద్వారా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛను ఇచ్చే వెసులుబాటు ఉన్నా ఏప్రిల్‌లో ప్రభుత్వం లబ్ధిదారులను కష్టపెట్టింది. సకాలంలో నగదు ఇవ్వకపోవడంతో పింఛనుదారులు ఇబ్బందులుపడ్డారు.  ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందడానికి పన్నాగాలు పన్నింది.


ఎండలో బ్యాంకు వద్దకు వెళ్లాలా..
- పోపూరి చారుమతి, యడ్లపాడు

బ్యాంకు ఖాతా ఉందో లేదో తెలియదు. ఇంతవరకూ ఇంటికే తెచ్చిచ్చారు. ఇప్పుడు బ్యాంకులో వేస్తాం తెచ్చుకోండి అంటే ఎలా? ఎండలో చాలాదూరం వెళ్లి రావాలంటే కష్టం. బ్యాంకుల్లో నగదు వేసేవాళ్లు ఇంటికే తెచ్చి ఇవ్వొచ్చు కదా. వృద్ధులకు ఇంటికే తెచ్చివ్వాలి.


మమ్మల్ని ఇబ్బందిపెట్టొదు
- ముండ్రు పేరమ్మ, మాచవరం

అయిదేళ్లుగా చేతికే పింఛన్‌ ఇస్తున్నారని, బ్యాంకు ఖాతాలు మరిచిపోయాం. ఇప్పుడేమో బ్యాంకుకెళ్లి తెచ్చుకోవాలంటే ఎట్టా? మమ్మల్ని కావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.  

జిల్లాలో మొత్తం పింఛన్లు: 2,81,235
వార్డు, గ్రామ సచివాలయాలు: 538 (పింఛను పంపిణీకి అదనంగా 175 కేంద్రాలు)
సచివాలయ ఉద్యోగులు : 4503
ఒక్కొక్క సచివాలయానికి సగటు వచ్చే పింఛన్లు : 524
ఒక్కొక్క ఉద్యోగి పంపిణీ చేయాల్సిన పింఛన్లు : 62
బ్యాంకుల్లో పింఛను జమ చేసేది 2,10,007 మందికి
ఇంటికి అందజేసేది: 71,228

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని