logo

గుంటూరు తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థి, కార్యకర్తలపై వైకాపా దాడి

గుంటూరు తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థి మస్తాన్‌వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్‌వలి కార్యకర్తలతో కలిసి  50వ డివిజన్‌లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.

Published : 07 May 2024 06:39 IST

పట్నంబజారు: గుంటూరు తూర్పు కాంగ్రెస్‌ అభ్యర్థి మస్తాన్‌వలి సహా ఆ పార్టీ కార్యకర్తలపై వైకాపా మూకలు దాడి చేశాయి. సోమవారం మస్తాన్‌వలి కార్యకర్తలతో కలిసి  50వ డివిజన్‌లోని శారదాకాలనీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఈ క్రమంలో 20వ లైనులోని ఒక ఇంటి వద్ద వైకాపాకు చెందిన నగర డిప్యూటీ మేయర్‌ బాలవజ్రబాబు అనుచరులు, వైకాపా కార్యకర్తలు కాలనీ వాసుల పేర్లు, ఫోన్‌ నంబర్లు రాసుకుంటున్నారు. వారి వద్ద చీటీలతోపాటు డబ్బులు కూడా ఉన్నాయి. దీనిని గమనించిన ్జమస్తానువలి వారి వద్దకు వెళ్లి పేర్లు, ఫోన్‌ నంబర్లు ఎందుకు రాస్తున్నారంటూ ప్రశ్నించారు. దీంతో ఇవన్నీ అడగడానికి మీరెవరంటూ ఆయనతో వైకాపా కార్యకర్తలు వాదనకు దిగారు. నిబంధనల ప్రకారం ఓటర్ల డేటా రాయకూడదంటూ మస్తాన్‌వలి పేర్కొనగా..ఇది మా రాజ్యం..మేం చెప్పిందే వేదం..అంటూ మస్తాన్‌వలిపైకి వైకాపా కార్యకర్తలు దురుసుగా దూసుకొచ్చారు. దీనిని ఎదుర్కొనేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ పార్టీ 50వ డివిజన్‌ అధ్యక్షుడు భాగ్యరాజుపై దాడి చేసి కొట్టారు. భాగ్యరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మస్తాన్‌వలిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. వైకాపా తరఫున తాను ప్రచారం చేస్తుండగా మస్తాన్‌వలి, అతని అనుచరులు నా వద్దకు వచ్చి ఇక్కడ ఏమి చేస్తున్నారురా..అంటూ తనను కులం పేరుతో దూషించారని శారదా కాలనీకి చెందిన రాజేష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని