logo

ఊపిరి నేనన్నావు.. ఉసురు పోసుకున్నావు!

ఆర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్‌ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్‌జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్‌నిక్‌ స్పాట్‌లా మార్చారు.

Published : 07 May 2024 07:10 IST

జగన్‌ పాలనలో అన్నదాతలకు దక్కని భరోసా
ఉమ్మడి గుంటూరులో 215 మంది ఆత్మహత్య
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మేడికొండూరు, పొన్నూరు, ప్రత్తిపాడు

ఆర్బీకేల ద్వారా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు మొదలు పంట కొనుగోలు వరకు బాధ్యత మాదే.
మా ప్రభుత్వ పాలనలో రైతులకు భరోసా లభించింది.

- రైతులకు సంబంధించి సీఎం జగన్‌ పలికిన ప్రగల్బాలు.

ర్బీకేల ద్వారా భరోసా ఇచ్చామని జగన్‌ అన్నారు.. ఆ మాటలే నిజమైతే ఇన్ని వందల మంది రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకున్నారు.. మిగ్‌జాం తుపానుతో రైతులు కుదేలైతే పంటల పరిశీలన పేరిట వేదికలు పెట్టి పిక్‌నిక్‌ స్పాట్‌లా మార్చారు.. కనీసం కమతాల్లోకి దిగి రైతులకు ఓదార్పు ఇవ్వలేకపోయారు. మార్చి 6న రైతులకు సీఎం జగన్‌ పంపిణీ చేసినా పరిహారం చెక్కులు ఇప్పటికీ నగదు పడలేదు. ఇది పరిహాసం కాదా! ఐదేళ్లలో రైతులకు పరికరాలు ఎందుకు పంపిణీ చేయలేకపోయారు. ఆర్బీకేల్లో వైకాపా ప్రజాప్రతినిధులు తిష్ఠవేసి ఎరువులు, నాణ్యమైన విత్తనాలు గద్దల్లా తన్నుకుపోతే ఎందుకు ఆపలేకపోయారు.. రైతులు వేరేదారి లేక ఆత్మహత్యలకు పాల్పడితే వారి కుటుంబాలను ఎందుకు ఓదార్చలేకపోయారు.. ఏ మొహం పెట్టుకుని ఈసారి ఓట్లడుగుతారు జగన్‌?

ఐదేళ్ల జగన్‌ పరిపాలనలో రైతుల జీవితాలు తలకిందులయ్యాయి. పెట్టుబడుల భారం పెరిగింది.. నకిలీ పురుగు ముందులు.. కౌలు రైతులకు అందని రుణాలు.. మార్కెట్‌లో దళారుల దోపిడీ.. పంటకు గిట్టుబాటు ధరలేమి.. కలిసిరాని సాగు.. వ్యవసాయం గిట్టుబాటు కాని పరిస్థితి. సాగు వ్యయం దక్కని పరిస్థితుల్లో అప్పులు తీర్చేదారి లేక.. ఆత్మాభిమానం చంపుకోలేక... బతుకు భారమై.. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గడిచిన ఐదేళ్ల పాలనలో ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సర్కారు లెక్కల ప్రకారం 215 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అనధికారికంగా ఇంకా వందల మంది బతుకుపై ఆశ కోల్పోయి ఉసురు తీసుకున్నారు.


ప్రభుత్వ సాయం అందలేదు

ఫిరంగిపురం మండలం కండ్రిక గ్రామానికి చెందిన ఏజండ్ల సాంబశివరావు (37) కౌలు రైతు. భార్య నర్మద పదేళ్ల కిందట మృతి చెందింది. పిల్లలు త్రివేణి 7, ప్రవీన్‌ 9వ తరగతి చదువుతున్నారు. 4ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప సాగు చేశారు. అకాల వర్షాలు, తెగుళ్ల కారణంగా పంటలు దెబ్బతిని రూ.5లక్షలు అప్పులయ్యాయి.2023 జనవరి 14న మనోవేదనతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం నుంచి ఇప్పటికీ వారికి సాయం అందలేదు. పిల్లల భారం వృద్ధురాలైన నాయనమ్మపై పడింది.

కూరగాయలు అమ్మి పోషిస్తున్నా

-ఏజండ్ల మంగమ్మ, మృతుడి తల్లి

పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు నెలకు మొత్తంగా రూ.10వేలు దాకా అవుతున్నాయి. మగ దిక్కు లేకపోవడంతో పగలు వ్యవసాయ కూలి పనికి వెళ్తున్నాను. సాయంత్రం గ్రామంలో తిరుగుతూ తోపుడు బండిపై కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాం.


ముడుపులకు వేధించి రైతు ఉసురు తీశారు..

పొన్నూరు మండలం ములుకుదురుకి చెందిన లుక్కా కోటేశ్వరరావు (42) 18 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశారు. పంట దిగుబడులు తగ్గి, గిట్టుబాటు ధర రాక అప్పుల భారం పెరిగింది. వీటి నుంచి బయట పడేందుకు 2022లో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన హార్వెస్టర్‌ యంత్రాన్ని రూ.25లక్షలు చెల్లించి కొన్నారు.రూ.8లక్షలు ప్రభుత్వం నుంచి రాయితీ అందాల్సి ఉంది. అదే గ్రామానికి చెందిన ఓ వైకాపా నేత రాయితీ రావాలంటే రూ.4లక్షలు ముడుపులు ఇవ్వాలని అడిగారు. రూ.2లక్షలు ఇచ్చినా మిగతాదీ ఇవ్వాల్సిందేనని వేధించారు.మనస్తాపానికి గురైన కోటేశ్వరరావు కౌలుభూమిలో ఆత్మహత్య చేసుకున్నారు.అప్పులు ఎలా తీర్చలో అర్థం కావడం లేదని భార్య వరలక్ష్మి మనోవేదనకు గురయ్యారు.

కౌలు రైతుల కన్నీటి కష్టాలు

ఉమ్మడి జిల్లాలో 60 శాతంపైగా కౌలురైతులే పంటలు సాగు చేస్తున్నారు. అసలు రైతులు కాడి పక్కన పడేసిన తరుణంలో ఆ బరువు నెత్తికెత్తుకున్న కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. కళ్లెదుటే పాడైన పంటలు, చేసిన అప్పులకు పెరుగుతున్న వడ్డీలు, ఆర్థిక సమస్యలు కౌలురైతుల్ని మనోవేదనకు గురి చేస్తున్నాయి.  ఉమ్మడి గుంటూరులో గత ఐదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న వారిలో కౌలురైతు కుటుంబాలే అధికంగా ఉన్నాయి.

పంటను తుడిచిపెడుతున్న తుపాన్లు

కృష్ణా పశ్చిమ డెల్టాలో ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో వస్తున్న తుపానులు వరి పంటకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి. ఈసారి వచ్చిన మిగ్‌జాం తుపాను వల్ల చేతికొచ్చిన పంట ఇంటికి చేరకుండానే వర్షార్పణం అయింది. పత్తి, మిర్చి, పొగాకు, శనగ పంటలు కూడా దెబ్బతిన్నాయి.


మూడు మండలాల్లో 40 వేల ఎకరాల్లో నష్టం

2023 డిసెంబరు మొదటి వారంలో కురిసిన మిగ్‌జాం తుపాను కారణంగా ప్రత్తిపాడు, పెదనందిపాడు, కాకుమాను, వట్టిచెరుకూరు మండలాల పరిధిలో 40వేల ఎకరాల్లో మిరప, వరి, శనగ, పత్తి, మినుము పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. రైతులు భారీగా పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారు. చేతికొచ్చే దశలో భారీగా పంట నష్టం జరగడంతో రైతులు అప్పుల పాలయ్యారు. పంట నష్టం అంచనాలు మొక్కుబడిగా వేసి ప్రభుత్వం చేతులు దులుపేసుకుంది. మార్చి 6న పరిహారం విడుదల చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. రూపాయి కూడా రైతుల బ్యాంకు ఖాతాల్లో పడకపోవడంతో రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.


వ్యవసాయ ఖిల్లాలో విషాదాలు

క్కడ వరి, వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పసుపు విస్తారంగా సాగు చేస్తారు. గుంటూరు మిర్చికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఏటా రూ.వేల కోట్ల విలువైన మిర్చిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. ఎగుమతుల ద్వారా వచ్చే విదేశీ మారకద్రవ్యంలో గుంటూరు జిల్లాది ప్రత్యేకస్థానం. అలాంటి జిల్లాలో అన్నదాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మిర్చి సాగుకు ఎకరాకు రూ.1.5లక్షల నుంచి రూ.2లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నారు. చీడపీడలు, తెగుళ్లు వల్ల పంట నష్టపోతే ఐదెకరాలు సాగు చేసే రైతుకు రూ.లక్షల్లో అప్పులు అవుతున్నాయి. ప్రస్తుతం గుంటూరు యార్డులో మిర్చి ధరలు క్వింటా సగటున రూ.15వేల లోపే పలుకుతోంది. గత తెదేపా ప్రభుత్వ హయాంలో మిర్చి ధర పతనమైతే రైతుకు క్వింటా రూ.1500 చొప్పున సొమ్ము అందించి రైతులను ఆదుకున్నారు. వైకాపా సర్కారు కనీసం అలాంటి ఆలోచన కూడా చేయడం లేదు. 


ప్రభుత్వ ప్రోత్సాహం కరవు

తెదేపా హయాంలో బిందు, తుంపర్ల సేద్య పరికరాలు 90శాతం రాయితీతో ఇచ్చేవారు. వైకాపా వచ్చాక వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో విధానాలు మార్చి కొందరికే పరిమితం చేసింది. వ్యక్తిగతంగా వ్యవసాయ పరికరాల రాయితీకి మంగళం పాడింది. ఆయా కంపెనీలకు సకాలంలో సొమ్ము చెల్లించకపోవడంతో వారు సరఫరా ఆపేశారు. దీంతో రైతులు వందశాతం సొమ్ము చెల్లించి బహిరంగ మార్కెట్‌లో కొనుక్కోవాల్సి వస్తోంది.


నష్టపోయినా... నమోదు చేయలేదు

- చెట్టి సాంబయ్య, రైతు, వంగిపురం, ప్రత్తిపాడు మండలం

కౌలుకు పదెకరాలు తీసుకుని మినుము పంట సాగు చేశా. దాదాపు 90క్వింటాళ్ల పంట చేతికొచ్చే దశలో తుపానుతో పొలం నీట మునిగింది. నాలుగు రోజుల పాటు వరద నీరు పొలంలో ఉంది. పూర్తిగా పంట దెబ్బతిని రూ.8లక్షల వరకు నష్టపోయా. మాపేర్లు పంట నష్టం జాబితాలో రాస్తున్నట్లు నటించారు. జాబితా చూస్తే రాయలేదని తెలిసి తహసీˆల్దారుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని