logo

ఖద్దరు అరాచకం.. ఖాకీల సలాం..

చట్టం చేసే వారు.. దాన్ని అమలు చేయాల్సిన వారు ఒక్కటై.. వికృత క్రీడ ఆడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత అయిదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అద్దం పట్టాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేసి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు.

Published : 08 May 2024 06:23 IST

అయిదేళ్లలో తెదేపా లక్ష్యంగా దాడులు
బాధితులపైనే తిరిగి కేసుల నమోదు 
అధికార పార్టీతో అంటకాగిన పోలీసులు
ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

చట్టం చేసే వారు.. దాన్ని అమలు చేయాల్సిన వారు ఒక్కటై.. వికృత క్రీడ ఆడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయో గత అయిదేళ్లలో రాష్ట్రంలో పరిస్థితులు అద్దం పట్టాయి. అధికార పక్షానికి కొమ్ముకాస్తూ ప్రతిపక్షాలను అణిచివేయడమే ధ్యేయంగా కొందరు పోలీసులు పనిచేసి అప్రతిష్ఠను మూటగట్టుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో న్యాయం నేతిబీరలో నేతి చందమే అయింది. బాధితులకు రక్షణ కల్పించి నేరాలు చేసిన వారిపై ఉక్కుపాదం మోపాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వంతపాడారు. తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేసి నరకయాతన అనుభవించేలా చేశారు. అధికార పార్టీ తప్పులను ఎత్తిచూపినా, ప్రశ్నించినా.. అలాంటి వారిపై ఇష్టారాజ్యంగా కేసులు నమోదు చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు సలాం కొట్టారు.

రెంటచింతల మండలంలో తాగునీటిని పట్టుకోవడానికి ట్యాంకర్‌ వద్దకు వెళ్తున్న మహిళ భూక్యా షామిలిబాయితో వివాదం పెట్టుకుని ఆమెపై నుంచి ట్రాక్టర్‌ పోనిచ్చాడు. అయితే ప్రమాదవశాత్తు జరిగిందని, రెంటచింతల పోలీసులు రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేశారు. ఆ డ్రైవర్‌ వైకాపా సర్పంచి వద్ద పనిచేయడంతో కేసు పక్కదారి పట్టించారు.

గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లి గ్రామంలో తెదేపా సానుభూతిపరులపై వైకాపా వర్గాలు దాడులు చేశాయి. పోలీసులు ఎటువంటి రక్షణ ఇవ్వలేకపోవడంతో వారు ఊరు విడిచి ఐదేళ్ల తర్వాత వచ్చారు.

పల్నాడు జిల్లాలో అధికార పార్టీ నేతల మెప్పు కోసం యూనిఫాం వేసుకున్న కార్యకర్తల్లా కొందరు పోలీసులు పని చేశారు. ప్రతిపక్షాలను దెబ్బతీస్తే తమకు గుర్తింపు వస్తుందన్న ధోరణిలో వ్యవహరించారు. న్యాయం చేయాల్సిన రక్షకభటులే భక్షకభటులయ్యారు. బాధితులపైనే తిరిగి కేసులు నమోదు చేసే పద్ధతి అమలు చేశారు. ప్రతిపక్షాలపై దాడులు జరిగిన సందర్భంలోనూ ఏకపక్షంగా అధికార పార్టీకి వంతపాడారు. అధికార పార్టీ నేతల చేతుల్లో గాయపడి స్టేషన్‌కు వెళితే బాధితులపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేసిన సందర్భాలు కోకొల్లలు.

పోలీసు వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న దుర్గారావు మృతదేహం వద్ద బంధువుల రోదన (పాత చిత్రం)

ఇసుక తవ్వకాలపై ప్రశ్నిస్తే..

పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ప్రశ్నించి అధికార పార్టీకి చెందిన నేత గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. పర్యావరణ నిబంధనలకు వ్యతిరేకంగా ఇసుక తవ్వకాలు జరగుతున్నాయని ధరణికోటకు చెందిన దండా నాగేంద్ర ఎన్జీటీలో కేసు వేశారు. దీంతో అతనిపై ప్రభుత్వం కక్ష కట్టి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, మద్యం అక్రమ రవాణా, వైకాపా కార్యాలయానికి నిప్పు పెట్టారని నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైల్లో పెట్టించారు.

అమరావతి మండలం ఉంగుటూరులో చెరువులో అక్రమ మట్టి తవ్వకాలు చేస్తున్నారని మాజీ సర్పంచి, సర్పంచి భర్త సోమశేఖర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కక్ష కట్టి అతనిపై వైకాపా నేతలు దాడి చేసి హత్యాయత్నం చేశారు. ఇంటిపైకి రాళ్లు విసురుతూ భయోత్పాతం సృష్టించారు. ఇంత చేసిన వైకాపా నాయకులపై చర్యల్లేవు. కేసులు కూడా నమోదు చేయలేదు. ఇలాంటి ఘటనలు గత అయిదేళ్లలో చాలా ఉన్నాయి.

రైతును జైల్లో పెట్టించారు..

2022లో శావల్యాపురం మండలం వేల్పూరులో... స్థానిక ఎంపీటీసీ లింగాశీను తండ్రి పెద్దకర్మ కార్యక్రమంలో ఎంపీ లావు, ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు పాల్గొన్నారు. ఆసమయంలో వేల్పూరు గ్రామానికి చెందిన రైతులు ధాన్యానికి మద్దతు ధర లేదని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఎంపీ లావు దృష్టికి తీసుకొచ్చారు. ఈపూరు మండలం కొండాయపాలేనికి చెందిన సొసైటీ మాజీ అధ్యక్షుడు, రైతు గడుపూడి నరేంద్ర ఇదే విషయమై ప్రశ్నించాడు. అక్కడే ఉన్న ఎమ్మెల్యే కలుగజేసుకుని రైతుపైకి చెప్పు విసరబోయి కొట్టే ప్రయత్నం చేశారు. పక్కనున్నవారు అడ్డుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఘటన జరిగిన వారంలోపే తన భద్రతా సిబ్బందిపై రైతు నరేంద్ర హత్యాయత్నం చేసినట్టు బ్రహ్మనాయుడు వినుకొండ గ్రామీణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయించి అతడిని జైల్లో పెట్టించారు. ఎంపీ లావు ఈ వ్యవహారాన్ని డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. అప్పడ్పు రూరల్‌ సీఐగా ఉన్న అశోక్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. రిశాంత్‌రెడ్డి అనే అదికారితో విచారణ చేయించారు. రైతు ఎటువంటి హత్యాయత్నం చేయకపోయినా అతనిపై ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే పోలీసులు కేసు నమోదు చేసినట్లు గుర్తించారు.

అమరావతి మండలం వైకుంఠపురం ఇసుక రీచ్‌ పరిశీలనకు వచ్చిన
న్యాయవాదులను పోలీసుల సాక్షిగా అడ్డుకుంటున్న ఎమ్మెల్యే శంకరరావు అనుచరులు


మాచర్ల నియోజకవర్గంలో..

  • వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచే పల్నాడులో అరాచక పర్వానికి తెరలేచింది. మాచర్ల పట్టణంలో 2022 డిసెంబరులో తెదేపా నేతల ఇళ్లు, వాహనాలే లక్ష్యంగా దాడులు చేసి ధ్వంసం చేశారు. తెదేపా కార్యాలయానికి నిప్పంటించి అరాచకం సృష్టించారు. ఇంత జరిగినా నామమాత్రపు కేసులతో సరిపెట్టి పోలీసులు స్వామిభక్తి చాటుకున్నారు.
  • మాచర్ల నియోజకవర్గంలో చాలామంది ఎస్సైలు ప్రజాప్రతినిధి చెప్పినట్లు నడుచుకున్నారు. ఒక ఎస్సై అయితే ఒకడుగు ముందుకేసి తెదేపాలో క్రియాశీలకంగా ఉన్న నేతలు, కార్యకర్తలను పార్టీ మారతారా? లేక కేసులు పెట్టి లోపల వేయాలా? అంటూ ఒత్తిడి తెచ్చారు. అంతేకాకుండా అతని వేధింపులు తాళలేక ఒక మత్స్యకారుడు చేపలు పట్టే వలతో ఉరేసుకుని కృష్ణానదిలో దూకాడు. పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బంధువులకు అంతకుముందు సమాచారం ఇచ్చాడు.
  • మాచర్ల నియోజకవర్గానికి ముఖద్వారంగా ఉండే మండలంలో మరో ఎస్సై కూడా అతని బాటలోనే నడిచాడు. తెదేపా వారిపై   అక్రమ కేసులు పెట్టి లోపలేయడం ఈయనకు సరదా. గతేడాది జూన్‌లో తెదేపా కారంపూడి మండల అధ్యక్షుడు ఉన్నం లక్ష్మీనారాయణను వైకాపా నాయకుడు కొడితే సాధారణ కేసుగా నమోదు చేసి, వైకాపా వారిని ప్రశ్నించారని తిరిగి తెదేపా వారిపైనే హత్యాయత్నం కేసు నమోదు చేశారు. తెదేపా బీసీ నేత గోరంట్ల నాగేశ్వర్‌ను ఒప్పిచర్లకు చెందిన వైకాపా నేత చిరుమామిళ్ల శ్రీకాంత్‌ కర్రలు, రాళ్లతో దాడిచేస్తే అతనిపై సాధారణ కేసు పెట్టారు. తెదేపా వాళ్లపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని