logo

‘మీ పిల్లలను కిడ్నాప్‌ చేశాం.. అడిగినంత ఇవ్వండి’

విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్‌ చేశాం.. అడిగినంత ముట్టచెప్పండి.. లేకుంటే వారు మీకు మిగలరు.. అని బెదిరిస్తూ సైబర్‌ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు.

Updated : 26 May 2024 09:18 IST

విదేశాల్లో ఉంటున్న వారి తల్లిదండ్రులకు ఫోన్‌కాల్స్‌
సైబర్‌ నేరగాళ్ల కొత్త పంథా
అప్రమత్తంగా ఉండాలని పోలీసుల సూచన

విదేశాల్లో ఉన్న మీ పిల్లలను కిడ్నాప్‌ చేశాం.. అడిగినంత ముట్టచెప్పండి.. లేకుంటే వారు మీకు మిగలరు.. అని బెదిరిస్తూ సైబర్‌ మోసగాళ్లు సరికొత్త పంథాలో ప్రజలను దోచుకుంటున్నారు. ఇలాంటి వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి ఫోన్‌కాల్స్‌ వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, తమ పిల్లలకు నేరుగా ఫోన్‌ చేయడం, వారు చదువుతున్న విద్యా సంస్థల ద్వారా వారి సమాచారాన్ని తెలుసుకుని వంచకుల మోసాలను తిప్పికొట్టాలని సైబరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు సూచిస్తున్నారు. 

- న్యూస్‌టుడే, రాయదుర్గం 

ఇటీవలి ఘటనలే ఆధారం.. 

అమెరికాలోని క్లీవ్‌ల్యాండ్‌లో మహ్మద్‌ అబ్దుల్‌ అర్భాత్‌ అనే భారతీయ విద్యార్థి మార్చి 7న కిడ్నాప్‌నకు గురయ్యాడు. పది రోజుల తర్వాత ఆయన్ను విడుదల చేయడానికి 1200 అమెరికన్‌ డాలర్లు డిమాండ్‌ చేస్తూ తల్లిదండ్రులకు ఫోన్‌కాల్‌ వచ్చింది. ఆ తర్వాత ఆ యువకుడు వారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ ఏడాది ఆరంభంలో విదేశాల్లో ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలోనూ ఈ తరహా రెండు ఘటనలు నమోదయ్యాయి. సైబర్‌ మోసగాళ్లు తల్లిదండ్రులకు వీఓఐపీ కాల్స్‌ చేసి భయభ్రాంతులకు గురిచేసి డబ్బులు లాగుతున్నారు. 

మోసం చేస్తారిలా..

తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న, విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లే పిల్లలు, వారి తల్లిదండ్రుల వివరాలను మోసగాళ్లు సేకరిస్తున్నారు. అంతర్జాతీయ నంబర్‌ (వీఓఐపీ)తో తల్లిదండ్రులకు ఫోన్‌ చేస్తున్నారు. మీ పిల్లలను కిడ్నాప్‌ చేశామని, తమ చెర నుంచి సురక్షితంగా బయటపడాలంటే అడిగినంత డబ్బులు పంపించాలని డిమాండ్‌ చేస్తుంటారు. అలా డబ్బులు ఇవ్వని పక్షంలో పిల్లలు దక్కరని బెదిరిస్తారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురై వారు చెప్పినట్లే చేస్తున్నారు. 

ఇలా చేయండి..

  • ఆ తరహా కాల్స్‌ వస్తే వెంటనే డయల్‌ 100, 1930కి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి.
  • తల్లిదండ్రులు తమ పిల్లలను, విద్యా సంస్థల అధికారులను సంప్రదించాలి. 
  • విచారణ ప్రక్రియలో సహాయం అందించేందుకు కేటుగాళ్ల కాల్‌ను రికార్డ్‌ చేయాలి. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు