logo

కూరగాయం.. ప్రత్యామ్నాయమే తరుణోపాయం!

కొద్ది రోజులుగా పెరిగిన కూరగాయల ధరలతో నగరవాసులు అల్లాడుతున్నారు. జేబు నిండా డబ్బులున్నా, సంచి నిండా కూరగాయలు రాని పరిస్థితి. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కారణంగా రవాణా ఛార్జీలు పెరిగి.. ధరలు

Published : 27 Jun 2022 02:43 IST

శివారుల్లో సాగు విస్తీర్ణం పెంపుపై దృష్టి కరవు

ఈనాడు, హైదరాబాద్‌: కొద్ది రోజులుగా పెరిగిన కూరగాయల ధరలతో నగరవాసులు అల్లాడుతున్నారు. జేబు నిండా డబ్బులున్నా, సంచి నిండా కూరగాయలు రాని పరిస్థితి. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి కారణంగా రవాణా ఛార్జీలు పెరిగి.. ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అదే నగరానికి సమీపంలోని జిల్లాల్లో సాగును పెంచితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని ఆచరణలోకి తీసుకురావడంలో ప్రభుత్వం చొరవ చూపక నగరవాసులకు ధరాఘాతం తప్పడంలేదు. రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లో భారీగా సాగు విస్తీర్ణం ఉంది. అయినప్పటికీ.. పత్తి, వరి పంటలవైపే రైతులు ఆసక్తి చూపుతున్నారు. నగరానికి సమీపంలో ఉన్నప్పటికీ.. మంచి ధర పలుకుతున్నా.. కూరగాయల సాగుపై ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల మహానగరానికి సరిపడా కూరగాయల ఉత్పత్తి ఉండటం లేదు. ఏటా విస్తీర్ణం తగ్గిపోతుండటం మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

పత్తా లేని జోన్‌ ప్రతిపాదన
నగరానికి చేరువలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌ జిల్లాలను కలిపి కూరగాయల జోన్‌ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన ఏళ్ల తరబడిగా నానుతోంది. ప్రత్యేకంగా రాయితీపై విత్తనాలు, నారు, డ్రిప్‌ పరికరాలు అందించి కూరగాయల సాగును ప్రోత్సహించాలనేది ప్రతిపాదన. ఈ వ్యవహారంలో అడుగు ముందుకు పడలేదు. దీనికితోడు రవాణా సదుపాయాలు మెరుగుపరిచి శివారు రైతుల్లో భరోసా కల్పించాలి. రంగారెడ్డి జిల్లాలో 2020-21లో 37,580 ఎకరాల్లో కూరగాయలు సాగవ్వగా.. 2021-22లో 33 వేల ఎకరాలకే పరిమితమైంది. గతేడాది ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించాలని ప్రభుత్వం భావించింది. ఇందుకు అనుగుణంగా రంగారెడ్డి, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో వరికి బదులు కూరగాయలు సాగు చేపట్టాలని అధికారులు క్షేత్రస్థాయిలో ప్రచారం చేశారు. అయినా ప్రయోజనం శూన్యం.

ఏటా 7.23 లక్షల టన్నులు అవసరం

ప్రొ.జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం సర్వే ప్రకారం హైదరాబాద్‌లో ప్రతి వ్యక్తి సగటున రోజుకు 269 గ్రాముల కూరగాయలు తింటున్నాడని అంచనా.

హైదరాబాద్‌లో ఏటా 7.23 లక్షల మెట్రిక్‌ టన్నుల కూరగాయలు అవసరం. ఇందులో కేవలం 30-35 శాతమే నగర శివారు జిల్లాల నుంచి ఉత్పత్తి అవుతున్నాయి.


రాయితీలు ఇస్తే సిద్ధమే
-సురేందర్‌రెడ్డి, రైతు, నేదునూరు

కూరగాయల సాగుకు శివారు రైతులు సిద్ధంగా ఉన్నారు. ప్రభుత్వం రైతుబంధు సాయం ఇస్తూ.. మిగిలిన రాయితీలు నిలిపేసింది. రాయితీపై విత్తనాలు, డ్రిప్‌ అందిస్తే రైతులు పెద్ద సంఖ్యలో కూరగాయల సాగు వైపునకు మళ్లే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని