logo

ఆగుతూ.. సాగుతూ..

ప్రకృతి అన్నదాతలతో దోబూచులాడుతోంది. వాస్తవానికి ఈనెల 15వ తేదీలోపు వివిధ రకాల విత్తనాలు విత్తుకోవడం పూర్తి చేసుకోవాలి. ఆశించిన వర్షాలు పడక పోవడంతోపాటు వాతావరణం అనుకూలించక రైతులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.

Published : 07 Jul 2022 02:06 IST

ఇప్పటివరకు విత్తింది 33 శాతమే
వరుణిడిపైనే అన్నదాతల భారం
న్యూస్‌టుడే, పరిగి

ప్రకృతి అన్నదాతలతో దోబూచులాడుతోంది. వాస్తవానికి ఈనెల 15వ తేదీలోపు వివిధ రకాల విత్తనాలు విత్తుకోవడం పూర్తి చేసుకోవాలి. ఆశించిన వర్షాలు పడక పోవడంతోపాటు వాతావరణం అనుకూలించక రైతులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం సాగు సమయం ముగిసేలోపు పూర్తి స్థాయిలో విత్తు సాధ్యమవుతుందా లేదా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితే ఇకముందూ కొనసాగితే ఏంచేయాలని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సాగు స్థితిగతులపై ‘న్యూస్‌టుడే’ కథనం.

అదను దాటితే ప్రభావం తప్పదు
జిల్లాలోని వికారాబాద్‌, తాండూరు, పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో చెప్పుకోదగ్గ ప్రాజెక్టులు గానీ నదీనదాలు కానీ లేకపోవడంతో వర్షాధార సేద్యమే జీవనాధారం. సమృద్ధి వర్షాలు కురిస్తేనే భూగర్భ జలాలు పెరిగి బోరు బావులు నీటిని అందిస్తాయి. ఈ పరిస్థితి లేని కారణంగా వరుణుడిపైనే ఆశలు పెట్టుకోవాల్సి వస్తోంది. అదను దాటాక విత్తనాలు విత్తుకుంటే దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుందని వాపోతున్నారు.  

కేవలం రెండు రోజుల్లో 56 మి.మీ
జిల్లాలోని 19 మండలాల్లో సాధారణ వర్షపాతం జూన్‌ మాసంలో 107 మి.మీ ఉంది. కురిసింది మాత్రం 90మి.మీటర్లు. ఇక్కడే ప్రధాన సమస్య ఏర్పడింది.

జులై మాసంలో 200 మి.మీ గాను ఇప్పటివరకు కేవలం 56 మి.మీ వర్షపాతం నమోదైంది. అది కూడా ఈ రెండు రోజుల్లోనే. ః వానాకాలం సాధారణ సాగు 5,31,500 ః  సాగులోకి వచ్చింది 1,79,350 ఎకరాలు (అంటే కేవలం 33 శాతం). ః జూన్‌లో చౌడాపూర్‌, కుల్కచర్ల, పరిగి, తాండూరు, యాలాల్‌ మండలాల్లో వర్షపాతం చాలా తక్కువగా నమోదైంది. చెరువులు, కుంటల కింద ఉన్న ఆయకట్టుదారులు అవి ఎప్పుడు నిండుతాయా అని ఎదురు చూస్తున్నారు. కొద్దోగొప్పో వాటిలోకి నీరు వస్తే వరి సాగుకు నారుమళ్లు పోసుకునేందుకు వీలవుతుందని ఆశపడుతున్నారు.

దండిగా వానలు పడితేనే..
వానలు బాగా కురిస్తేనే సాగు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.బరువు నేలలు కలిగిన చాలా మంది రైతులు సాగుకు ఇంకా ఉపక్రమించడం లేదు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి విత్తనాలు విత్తుకున్నాక వర్షాలు పడక పోతే నష్టపోతామని భావిస్తున్నారు. తెల్ల బంగారానికి, మొక్కజొన్న పంటలకు విపణిలో ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో ఈసారి చాలా మంది రైతులు వీటి సాగునే ప్రధానంగా ఎంచుకున్నారు.


చెరువుల్లో చుక్కనీరు లేదు
- జి.అనంతయ్య, కౌలు రైతు

నడి వానాకాలం అయినా చెరువులు, కుంటల్లో చుక్క నీరు చేరలేదు. వరుణిడిపైనే భారం వేసి సాగుకు ఉపక్రమించాం. రెండున్నర ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నా. ఎకరం పొలంలో వరి సాగు చేసేందుకు నారుమడిని సిద్ధం చేస్తున్నాం. చెంతనే చెరువు ఉన్నా బీడుగా కనిపిస్తోంది. ఇది నిండితేనే బోరులో నీరు పెరిగి సాగుకు మార్గం సుగమం అవుతుంది.


ఆందోళన వద్దు
- గోపాల్‌, జిల్లా వ్యవసాయాధికారి

వర్షాలపై అన్నదాతల ఆందోళన అనవసరం. సమృద్ధిగానే వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఒక భారీ వర్షం పడితే చాలు విత్తుకునేందుకు చక్కటి అదను వస్తుంది. అనంతరం అడపాదడపా వానలు పడినా పైరుకు సరిపోతుంది. కొన్ని పంటలను ఈనెల మూడో వారం వరకు కూడా వేసుకోవచ్చు. వాతావరణం అనుకూలకంగా లేకపోవడంతోనే సాగుపై ప్రభావం పడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని