logo

కొండెక్కిన కోటా

ఆహారభద్రత కార్డు లబ్ధిదారులకు బియ్యం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రేషన్‌ దుకాణానికెళ్తే స్టాకు లేదని వెనక్కు పంపుతుండడంతో ఎప్పుడొస్తుందో తెలీక రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. స్టాకు పంపాలంటూ డీలర్లు అధికారులకు విన్నవిస్తున్నా స్పందన ఉండడం లేదు.

Published : 18 Aug 2022 03:05 IST

బియ్యం లేక ఖాళీగా రేషన్‌ దుకాణాలు

 పంపిణీ గడువు ముగుస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్‌

ఆహారభద్రత కార్డు లబ్ధిదారులకు బియ్యం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. రేషన్‌ దుకాణానికెళ్తే స్టాకు లేదని వెనక్కు పంపుతుండడంతో ఎప్పుడొస్తుందో తెలీక రోజూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. వారం రోజులుగా ఇదే పరిస్థితి. స్టాకు పంపాలంటూ డీలర్లు అధికారులకు విన్నవిస్తున్నా స్పందన ఉండడం లేదు. సాధారణంగా ప్రతి నెల 1 నుంచి 15 వరకు రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తుంటారు. కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్‌ బియ్యం కోటా పంపిణీ విషయంలో తర్జనభర్జనల అనంతరం ఆగస్టు 4 నుంచి ఒక్కొక్కరికీ 15 కేజీల చొప్పున అదనంగా పంపిణీ చేస్తామని పౌరసరఫరాలశాఖ ఆర్భాటంగా ప్రకటించింది. లోడింగ్‌ ఇతరత్రా సమస్యలతో స్టాకు పంపడంలో ఆలస్యం జరుగుతుండటం, పంపిణీ గడువు ముగుస్తుండటంతో లబ్ధిదారులు దుకాణాల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
70శాతం దుకాణాల్లో నో స్టాక్‌..
గ్రేటర్‌ పరిధిలో పోర్టబులిటీ, నెలవారీ కోటాతో కలిపి మూడు జిల్లాల్లో ప్రతినెలా సుమారు 50వేల మెట్రిక్‌ టన్నులకు పైగా బియ్యం పంపిణీ చేస్తుంటారు. ఆగస్టులో పెంచిన కోటాతో అది రెట్టింపు అయ్యింది. ఒక్కో దుకాణంలో సుమారు 200 క్వింటాళ్ల వరకు బియ్యం ఉండగా పంపిణీ చేశామని, అనంతరం పలుమార్లు విన్నవించగా 50 క్వింటాళ్ల చొప్పున పంపినా రెండు గంటల్లో అయిపోయే పరిస్థితి ఉందని డీలర్లు వాపోతున్నారు. వారం రోజులుగా 70శాతం రేషన్‌ దుకాణాల్లో స్టాకు లేదని చెబుతున్నారు.
తూకంలో తరుగు.. సాంకేతిక లోపాలు
స్టాకు లేక ఇబ్బంది పడుతున్న రేషన్‌ డీలర్లు తరుగు మరో సమస్యగా పరిణమించింది. ఒక్కో బస్తాలో 50 కేజీలకు బదులుగా 41 నుంచి 45 కేజీల వరకు బియ్యం వస్తోందని దీంతో వచ్చే కాస్తో కూస్తో కమిషన్‌ను నష్టపోవాల్సి వస్తోందని డీలర్లు వాపోతున్నారు. దీనికి తోడు రేషన్‌ పంపిణీలో హెచ్చుతగ్గులకు తావివ్వకుండా ప్రభుత్వం 4జీ సేవలను తీసుకొచ్చినా అవీ అప్పుడప్పుడు మొరాయిస్తున్నాయని డీలర్లు చెబుతున్నారు.


అధికంగా ఇవ్వాల్సి రావడంతోనే..:
శ్యామారాణి, డీఎంవో, రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో ఈసారి కోటా పెరగడంతోనే సమస్యలు ఉత్పన్నమయ్యాయి. షాపులు దూరంగా ఉండటం, లోడింగ్‌లో సమస్యలు, వర్షాలు, సెలవులతో స్టాక్‌ పంపడంలో ఆలస్యం అయిన మాట వాస్తవమే. మూడు రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.


నాలుగు రోజుల్లో పూర్తవుతుంది: తనూజ, డీఎంవో, హైదరాబాద్‌
స్టాకును ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తున్నాం. మరో నాలుగు రోజుల్లో పంపిణీ పూర్తవుతుంది. అవసరమైతే మరో నాలుగు రోజులు గడువు పొడిగించి లబ్ధిదారులకు అందరికీ కోటా అందేలా చూస్తాం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని