logo

45 వేల ప్లాట్లు.. రూ.1,000 కోట్లు

బల్దియాతోపాటు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు వివరాల సేకరణ, కసరత్తు దాదాపు పూర్తి చేసిన అధికార యంత్రాంగం....

Updated : 29 Sep 2022 09:21 IST

ఎల్‌ఆర్‌ఎస్‌పై హెచ్‌ఎండీఏ అంచనాలు

ఈనాడు, హైదరాబాద్‌: బల్దియాతోపాటు హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు వివరాల సేకరణ, కసరత్తు దాదాపు పూర్తి చేసిన అధికార యంత్రాంగం త్వరలో ఈ ప్రక్రియ ప్రారంభించనుంది. గతంలో అనధికార లేఅవుట్లలో ఎల్‌ఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకొని.. తర్వాత మధ్యలో ఆగిపోయిన ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు హెచ్‌ఎండీఏ, బల్దియా పరిధిలో అనధికారిక లేఅవుట్లలో దాదాపు 45 వేల ప్లాట్లు వరకు ఉన్నట్లు సమాచారం. వీటిని క్రమబద్ధీకరించడం ద్వారా తక్కువలో తక్కువ వేయి కోట్లు ఫీజులు కింద వస్తుందని హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఈ లేఅవుట్లలో ప్లాట్లు రిజిస్ట్రేషన్‌కు ఇప్పటికే ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. లేఅవుట్ల రిజిస్ట్రేషన్‌ స్కీం(ఎల్‌ఆర్‌ఎస్‌) నిబంధనలే వీటికి కొనసాగనున్నాయి. అయితే ఇలాంటి లేఅవుట్లలో ఎల్‌ఆర్‌ఎస్‌కు ఇప్పటికే దరఖాస్తు చేయడంతోపాటు.. కనీసం 10 శాతం ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఉండాలని అధికారులు తెలిపారు. అంతేకాక బల్దియా, హెచ్‌ఎండీఏ పరిధిలోని చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, ప్రభుత్వ స్థలాలు, పట్టణ భూగరిష్ఠ చట్టం మిగులు భూములు, దేవాదాయ భూముల్లో లేఅవుట్లు ఉంటే.. అలాంటి వాటిని అనుమతించరు. మహానగర పరిధిలోని అనధికారిక లేఅవుట్లలో రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉన్న ప్లాట్ల వివరాలను గ్రేటర్‌తోపాటు హెచ్‌ఎండీఏ పరిధిలోని జిల్లాల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు అందించినట్లు సమాచారం. రిజిస్ట్రేషన్లకు సంబంధించి హెచ్‌ఎండీఏ, బల్దియా నుంచి ప్రత్యేకమైన ఉత్తర్వులు ఏవీ లేకుండా.. అర్హులైన వారికి సమాచారం అందించడం ద్వారా ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని