logo

ఇక నుంచి దుద్యాల మండలం

గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అడుగులు పడుతున్నాయి. పల్లెలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

Published : 03 Oct 2022 03:35 IST

నేడు కార్యాలయాలు ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి


తహసీల్దారు కార్యాలయంగా మారిన పంచాయతీ భవనం

న్యూస్‌టుడే, బొంరాస్‌పేట: గ్రామీణ ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు అడుగులు పడుతున్నాయి. పల్లెలను వేగంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. బొంరాస్‌పేట మండలంలోని దుద్యాలను కొత్త మండలం చేయాలని 2021 జులై 29న ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఆయా గ్రామాల ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు గడువు ఇచ్చారు. 2022 జులైౖ 22న దుద్యాలను మండలం చేస్తూ తుది నోటిఫికేషన్‌ జారీ చేయటంతో కార్యాలయాల ప్రారంభానికి అధికారులు కసరత్తు చేశారు. ఈనెల 3న విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితో తహసీల్దారు, మండల విద్యావనరుల కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. దీంతో ఇక్కడి ప్రజలకు పరిపాలన సౌలభ్యం, పాలనలో పారదర్శకత పెరగటంతో పాటుగా సేవలు మరింత త్వరగా పొందే అవకాశం ఏర్పడింది.

12 రెవెన్యూ గ్రామాలతో: జిల్లాల విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో కొడంగల్‌ నియోజకవర్గంలోని బొంరాస్‌పేట, కొడంగల్‌, దౌల్తాబాద్‌ మండలాలు వికారాబాద్‌ జిల్లాలోకి మారగా కోస్గి, మద్దూరు మండలాలు నారాయణపేట జిల్లాలోకి వెళ్లాయి. బొంరాస్‌పేట మండలంలోని హకీంపేట, పోలేపల్లి కోస్గి మండలానికి వెళ్లటంతో అక్కడి ప్రజలు వికారాబాద్‌ జిల్లాలోకి మార్చాలని ఎన్నికల సమయంలో డిమాండ్‌ చేశారు. మండలంలోని దుద్యాలను 12 రెవెన్యూ గ్రామాలతో కొత్త మండలం ఏర్పాటు చేస్తూ రెండు గ్రామాలను తిరిగి జిల్లాలోకి తీసుకొస్తున్నారు. శాసనసభ ఎన్నికల సమయంలో కొత్త మండలాల ఏర్పాటుకు ప్రజల నుంచి వినతులు రావటంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ముఖ్యమంత్రి అంగీకారంతో మండలానికి తొలి అడుగులు పడుతున్నాయి. రెవెన్యూ గ్రామాల వారీగా మండలంలోని దుద్యాల, లగచర్ల, ఈర్లపల్లి, గౌరారం, చిల్ముల్‌మైలారం, మాచన్‌పల్లి, నాజ్‌ఖాన్‌పల్లి, అంసాన్‌పల్లి గ్రామాలతో పాటుగా కోస్గి మండలంలోని హకీంపేట, పోలేపల్లి, దౌల్తాబాద్‌ మండలంలోని కుదురుమళ్ల, కొడంగల్‌ మండలంలోని ఆలేడు గ్రామాలతో దుద్యాల కొత్త మండలంగా ఏర్పాటు కావటంతో గ్రామాల అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని