logo

ఫ్లాట్ల క్రమబద్ధీకరణలో జాప్యం

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)లో తికమక వల్ల దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫీజులు చెల్లించి రోజులు గడుస్తున్నా ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు జారీ కావడం లేదని వాపోతున్నారు.

Published : 29 Nov 2022 04:37 IST

ఛార్జీలు చెల్లించినా జారీ కాని  ప్రొవిజినల్‌ సర్టిఫికెట్లు

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎస్‌)లో తికమక వల్ల దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఫీజులు చెల్లించి రోజులు గడుస్తున్నా ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు జారీ కావడం లేదని వాపోతున్నారు.

వారు సమాచారం ఇవ్వక..

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆగిపోయిన ఎల్‌ఆర్‌ఎస్‌ను తిరిగి కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో దరఖాస్తు చేసుకొని రూ.10 వేల ఫీజు చెల్లించిన లేఅవుట్లకు మాత్రమే దీనిని వర్తింపజేస్తున్నారు. ఇలాంటివి హెచ్‌ఎండీఏ పరిధిలో 1337 లేఅవుట్లలో లక్షన్నర ప్లాట్లు ఉండగా.. ఇందులో 40,389 రిజిస్ట్రేషన్‌ కానివిగా గుర్తించారు. తొలుత వీటికి మాత్రమే క్రమబద్ధీకరణకు అనుమతి ఇచ్చారు. దీంతో రియల్టర్లు ముందుకొచ్చి దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఫీజు కింద హెచ్‌ఎండీఏకు రూ.5 కోట్ల వరకు సమకూరింది. తదుపరి ప్రక్రియ కింద ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తే.. వాటి ఆధారంగా ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయనున్నారు. క్రమబద్ధీకరణ ఫీజులు సంబంధిత బ్యాంకు శాఖలో జమచేయాలని దరఖాస్తుదారులకు సూచించడంతో అలాగే చేశారు. కానీ ఆ సమాచారం హెచ్‌ఎండీఏ అధికారులకు చేరక ప్రొవిజనల్‌ సర్టిఫికెట్లు జారీ చేయట్లేదు.

త్వరలో వారికి కూడా..: ప్రస్తుతం లేఅవుట్లలో ఇంకా రిజిస్ట్రేషన్‌ కానీ ప్లాట్లకు మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు శంషాబాద్‌లో ఓ అనుమతి లేని లేఅవుట్‌లో 100 ప్లాట్లలో ఇప్పటికే 80 అమ్ముడుపోయాయి అనుకుందాం.  మిగిలిన 20 ప్లాట్లకే ఎల్‌ఆర్‌ఎస్‌ చేయడం వల్ల మిగతా వారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో అక్కడ ఏదైనా భవనం కట్టుకోవాలంటే ప్లాట్ల యజమానులపై భారీ ఎత్తున ఫీజుల భారం పడనుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుతోపాటు 33 శాతం అదనంగా కాంపౌండ్‌ ఛార్జీలు చెల్లించాలి. అంటే ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌కు రూ.లక్ష ఖర్చయితే.. ఇలాంటి వాటికి రూ.1.33లక్షలు అవుతుంది. ఈ నేపథ్యంలో తమకు కూడా ఎల్‌ఆర్‌ఎస్‌ వర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్లాట్లదారులు కోరుతున్నారు. అధికారులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తొలుత రిజిస్ట్రేషన్‌ కాని ప్లాట్లను క్రమబద్ధీకరించి తర్వాత వీటి సంగతి తేల్చనున్నట్లు ఓ అధికారి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని