logo

కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి

కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి కోరారు.

Published : 24 Mar 2023 02:44 IST

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి

బొల్లినేని భాస్కర్‌రావుకు పురస్కారం అందజేస్తున్న కేవీ రమణాచారి, చిత్రంలో నంగునూరి చంద్రశేఖర్‌, రేలంగి నరసింహారావు, ఎం.నాగేశ్వరరావు, వంశీరామరాజు, 

గాంధీనగర్‌, న్యూస్‌టుడే: కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణాచారి కోరారు. వంశీ ఆర్ట్‌  థియేటర్స్‌-ఇంటర్నేషనల్‌, వంశీ కల్చరల్‌, ఎడ్యుకేషనల్‌ ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగరాయ గానసభలో వంశీ శుభోదయం శ్రీ శోభకృత్‌ నామ సంవత్సర ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా రామాయణ సుధానిధి డా.మైలవరపు శ్రీనివాసరావు, డా.మైలవరపు సుబ్బలక్ష్మిలకు వేద ఉగాది పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇందులో భాగంగా పది మంది ఆదర్శ దంపతులకు అవార్డులను అందజేశారు. కిమ్స్‌ ఆస్పత్రి మేనేజింగ్‌ డైరెక్టర్‌ బొల్లినేని భాస్కరరావుకు పద్మశ్రీ డా.కాకర్ల సుబ్బారావు పురస్కారం, ‘ఈనాడు’ దినపత్రిక ఏపీ సంపాదకులు ఎం.నాగేశ్వరరావుకు నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాన్ని, శంకరాభరణం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కుమారులు ఏడిద శ్రీరామ్‌, ఏడిద రాజాలకు కె.విశ్వనాథ్‌ పురస్కారం అందజేశారు. ప్రముఖ సాహితీవేత్త ఓలేటి పార్వతీశం అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎం.నాగేశ్వరరావు మాట్లాడుతూ ఏ నగర గొప్పదనమైనా ఎత్తయిన భవనాలు, విశాలమైన రహదారుల కంటే అక్కడ సంగీత, సాహిత్య, సాంస్కృతిక వైభవంలోనే బాగా తెలుస్తుందన్నారు. కళల వికాసానికి కృషి చేస్తున్న వంశీ సంస్థను ఆయన అభినందించారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌, కిమ్స్‌ ఛైర్మన్‌ బొల్లినేని కృష్ణయ్య, సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, తిరుమల బ్యాంక్‌ సీఎండీ నంగునూరి చంద్రశేఖర్‌, శుభోదయం గ్రూప్‌ సీఎండీ డా.లక్ష్మీప్రసాద్‌, వంశీ సంస్థల వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు, ప్రముఖులు వంశీ, తరంగిణి, చంద్రకాంతసాగర్‌, తెన్నేటి సుధాదేవి, కేతరపు రాజ్యశ్రీ, సుంకరపల్లి శైలజ, రాధిక తదితరులు పాల్గొన్నారు. డా.మైలవరపు శ్రీనివాసరావు పంచాంగ శ్రవణం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు