logo

Osmania University: పట్టాతో ఉద్యోగం.. ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త పంథా

విద్యాబోధనతో పాటు ప్రతిభగల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త పంథాతో ముందుకు వెళ్తోంది.

Updated : 04 May 2023 13:12 IST

ప్రైవేటు, కార్పొరేటు సంస్థలతో జాబ్‌మేళాలు
ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, ఉస్మానియా యూనివర్సిటీ

విద్యాబోధనతో పాటు ప్రతిభగల విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం కొత్త పంథాతో ముందుకు వెళ్తోంది. డిగ్రీ, పీజీ విద్యార్థులకు కోర్సులు పూర్తైన వెంటనే ఉద్యోగాలు లభించేలా వర్సిటీ అధికారులు.. ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల తరహాలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించారు. తొలిసారిగా గత అక్టోబరులో నిర్వహించిన ఉద్యోగమేళాలో 1600 మంది విద్యార్థులకు చదువు పూర్తయ్యాక ఉద్యోగాలిస్తామని కంపెనీలు ప్రకటించాయి. అప్పటికే పీజీ పూర్తి చేసిన కొందరు విద్యార్థులకు నియమాక పత్రాలు అందజేశాయి. విద్యా సంవత్సర క్యాలండర్‌ ఆధారంగా మరికొన్ని ఉద్యోగ మేళాలు నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

సంప్రదాయ కోర్సులు.. సాంకేతిక శిక్షణ..

ఉస్మానియ విశ్వవిద్యాలయంలో సంప్రదాయ కోర్సులతో పాటు సాంకేతిక శిక్షణకు వర్సిటీ అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నారు. పీజీ చదువుకుంటూనే అదనంగా కంప్యూటర్‌ సాంకేతిక పరిజ్ఞానం, కృత్రిమ మేధ, సైబర్‌ భద్రతలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. విద్యార్థుల్లో సమాచార నైపుణ్యాలు పెరిగేలా ప్రోత్సహిస్తున్నారు. క్యాంపస్‌లో 4వేల మందికిపైగా విద్యార్థులుండగా... వీరిలో 90శాతం మందికి చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానంపై పట్టుపెంచుకునేందుకు వీలుగా సెమిస్టర్లలో సైబర్‌ భద్రత, కృత్రిమ మేధలను ఒక సబ్జెక్టుగా బోధిస్తున్నారు. వీటిపై పట్టు సాధించిన విద్యార్థులకు బహుళజాతి సంస్థలు, కార్పొరేటు కంపెనీల్లో ఉద్యోగాలు లభించనున్నాయని ఆచార్యులు భావిస్తున్నారు. ముఖ్యంగా భౌతిక, రసాయన, వృక్ష శాస్త్రాలను అభ్యసిస్తున్న విద్యార్థులకు ప్రస్తుత, భవిష్యత్తులో పరిశ్రమలు, తయారీ సంస్థల్లో విధులు నిర్వహించేందుకు తప్పనిసరిగా వీరంతా అవసరమవుతారని అంచనా వేస్తున్నారు.

చదువు పూర్తి చేసినవెంటనే కొలువులు

ఉద్యోగమేళాల్లో పాల్గొనే ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలు, పరిశ్రమలు వేగంగా స్పందించి యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఉద్యోగమేళాలో పాల్గొన్న కంపెనీలు ప్రతిభగల విద్యార్థులను ఎంచుకున్నాయి. వర్సిటీలో చదువుతున్న వారిలో చాలామంది పేద, మధ్యతరగతి విద్యార్థులున్నారు. వారికి చదువు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు లభిస్తే కుటుంబానికి ఆర్థికంగా చేయూత ఇచ్చినట్లవుతుంది. ఈ నేపథ్యంలో జాబ్‌మేళాల నిర్వహణకు శ్రీకారం చుట్టామని ఆచార్యులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని