logo

Transgenders: ట్రాన్స్‌ జెండర్లకు లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌.. హైదరాబాద్‌లో తొలిసారిగా ఏర్పాటు

తమ రోజువారీ జీవితంలో అవమానాలను ఎదుర్కొంటూ.. ప్రాథమిక హక్కులకు సైతం నోచుకోని ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల కోసం హైదరాబాద్‌ హబ్సిగూడలోని కాకతీయనగర్‌లో తొలిసారిగా లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభమైంది.

Updated : 06 May 2023 09:43 IST

సమస్యల వేళ అండగా హెల్ప్‌లైన్‌

హబ్సిగూడలో ఏర్పాటైన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: తమ రోజువారీ జీవితంలో అవమానాలను ఎదుర్కొంటూ.. ప్రాథమిక హక్కులకు సైతం నోచుకోని ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల కోసం హైదరాబాద్‌ హబ్సిగూడలోని కాకతీయనగర్‌లో తొలిసారిగా లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ ప్రారంభమైంది. నిత్యం వారికి ఎదురయ్యే సమస్యలు, కొరవడిన సామాజిక భద్రత, వివక్షపై న్యాయపోరాటానికి అవసరమైన ప్రోత్సాహం లభించేలా స్థానికంగా ఏర్పాట్లు చేశారు. వసతి, ఉపాధి, వైద్యం, వివక్షలపై పోరాటం చేసేలా ఇక్కడి పారాలీగల్‌ వాలంటీర్లు ఎప్పుడూ అందుబాటులో ఉంటారని లీగల్‌ ఎయిడ్‌ క్లినిక్‌ నిర్వాహకులు ‘తాషి’ తెలిపారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ(డీఎల్‌ఎస్‌ఏ) చొరవతో ఇటీవలే దీన్ని ప్రారంభించగా.. సమస్యల పరిష్కారం కోసం చాలామంది ఇక్కడికి వస్తున్నారని తెలిపారు.

సమస్యలివీ..  ఇల్లు కోసం వెతికితే ట్రాన్స్‌జెండర్లకు అద్దెకిచ్చేవారు కరవు.. ఒకవేళ ఇచ్చినా కాస్త ఎక్కువగానే అద్దె ముట్టజెప్పాలి. లైంగిక వేధింపులు, డబ్బు కోసం మోసాలు, చదువుకోవడానికి పాఠశాలలు, కళాశాలల్లో చేరినా తప్పని ర్యాగింగ్‌, ఆధార్‌కార్డులో లింగ మార్పిడిపై సవాలక్ష చిక్కులు, ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్న బాధితులు అనేకమంది ఉన్నారు. నగరంలో వేలాది మంది ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులున్నారని పారాలీగల్‌ వాలంటీర్‌ ‘తాషి’ తెలిపారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకొని అర్హులుగా ఎంపికవ్వని 150మంది, 65 ఏళ్లకు పైబడినా పింఛన్లు రావడం లేదంటూ 500 మంది వారి సమస్యలను తమ దృష్టికి తెచ్చారని వివరించారు. ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంత్రిత్వశాఖ ద్వారా న్యాయం అందేలా చూస్తామని తెలిపారు.

ఎల్‌జీబీటీ కమ్యూనిటికి క్యూటి సెంటర్‌: ఎల్‌జీబీటీ కమ్యూనిటీకి చెందినవారికి మానసిక ఉల్లాసం అందించడానికి ‘క్యూటి’ సెంటర్‌ (క్వియర్‌-ట్రాన్స్‌వెల్‌నెస్‌ అండ్‌ సపోర్ట్‌ సెంటర్‌) ఏర్పాటుచేసినట్లు ‘తాషి’ వివరించారు. డ్రాప్‌ఇన్‌ సెంటర్‌గా పిలుచుకుంటున్న ఈ కేంద్రానికి వచ్చినవారికి మినీ లైబ్రరీ, కంప్యూటర్‌, వైఫై సదుపాయాలు అందుబాటులో ఉంటాయన్నారు. కష్టాల్లో ఉన్నప్పుడు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్‌, మానసికంగా కుంగిపోయినప్పుడు సంప్రదిస్తే మానసిక ఆరోగ్యసేవలూ అందిస్తామన్నారు. న్యాయపరమైన సహాయం అందించడంతో పాటు వసతి దొరకనివారికి తాత్కాలిక నివాసం సైతం కల్పిస్తామని తెలిపారు. లీగల్‌ఎయిడ్‌ నిర్వహణకు డీఎల్‌ఎస్‌ఏ, క్యూటి సెంటర్‌ నిర్వహణకు దాతలు, కార్పొరేట్‌ కంపెనీలు విరాళాలు అందిస్తున్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని