logo

మన బడి.. కావాలి నూతన ఒరవడి!

ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత పాఠశాలలను బలోపేతం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది.

Updated : 01 Jun 2023 04:10 IST

3 నుంచి అవగాహన కార్యక్రమాలు  

శివారెడ్డిపల్లెలో కొత్త రూపు దిద్దుకున్న భవనం

న్యూస్‌టుడే, పరిగి, దోమ, తాండూరు గ్రామీణ, వికారాబాద్‌ మున్సిపాలిటీ, బొంరాస్‌పేట: ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ప్రభుత పాఠశాలలను బలోపేతం చేసేందుకు సర్కారు చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పించి విద్యార్థుల ఇబ్బందులను నివారించేందుకు ‘మన ఊరు -మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తద్వారా సర్కారు బడులు కొత్త అందాలను సంతరించుకుంటున్నాయి. ఈనెల 3 నుంచి ‘బడి బాట’ను కూడా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అధికారులు మరింత విస్తృత ప్రచారం కల్పించి పిల్లలను ఆకట్టుకోనున్నారు.

371 పాఠశాలల ఎంపిక

మన ఊరు -మనబడి కింద జిల్లా వ్యాప్తంగా 371 పాఠశాలలను ఎంపిక చేశారు. వీటిలో 265 స్కూళ్లలో పనులు మొదలు పెట్టారు. నమూనా కింద సత్వరం పూర్తిచేయడానికి తొలి విడతగా 38ని ఎంపికచేశారు. వీటిలో దాదాపు 25 ప్రారంభానికి సిద్ధమయ్యాయి.  

* పూర్తి స్థాయి సిద్ధమైన పాఠశాలల్లో తాగు నీరు, విద్యుత్తు కల్పన, డ్యుయల్‌ డెస్కుల పంపిణీ, రంగులు వేయడం, శౌచాలయాల ఏర్పాటు తదితర వసతులు కల్పించారు. అధునాతన ప్రయోగశాలలు, తెరపై పాఠాల బోధన అందుబాట్లోకి రానున్నాయి. రూ.30లక్షలకు పైబడి టెండర్లు కలిగిన పాఠశాలల పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. వీటిలో ప్రధానంగా ఉన్నత పాఠశాలలు ఉన్నాయి.

కలిసొచ్చిన రూర్బన్‌ పథకం

తాండూరు మండలం ప్రభుత్వ పాఠశాలల్లో రూర్బన్‌ పథకం ద్వారా సదుపాయాల్ని కల్పించి తీర్చిదిద్దారు. ఫలితంగా జిల్లాలోనే అత్యధికంగా తాండూరు మండల ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 11వేల మంది విద్యార్థులు నమోదయ్యారు. మండలంలోని 44 పాఠశాలలకు విగణిత సామగ్రిని సమకూర్చారు. మధ్యాహ్న భోజనం వండేందుకు గ్యాస్‌ సిలిండర్లను, పొయ్యి మంజూరు చేశారు. నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా సౌర విద్యుత్‌ పలకలను, మీటర్లను బిగించారు. రూ.1.62కోట్లతో అదనపు తరగతి గదులను నిర్మించారు.  

విద్యార్థులను చేర్పించేందుకే..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలని కోరుతూ ఏటా విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాటను నిర్వహిస్తున్నారు. ఈసారి జిల్లాలో జూన్‌ 3 నుంచి 17 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు ఉపాధ్యాయులు బ్యానర్లు, పోస్టర్లతో గ్రామాల్లో ప్రచారం చేస్తారు. విద్యార్థులను చేర్పించాలని కోరతారు. 12న పాఠశాలలను ప్రారంభించటంతో రోజు వారీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. జిల్లాలో ప్రాథమిక 771, ప్రాథమికోన్నత 116, ఉన్నత 176 పాఠశాలలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని