logo

చెరువుల పండుగ వివాదాస్పదం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పుట్టాపహాడ్‌ గ్రామ శివారులోని ఏటి చెరువు దగ్గర చెరువుల పండుగను జరపాలని మండల అధికారులు ఆదేశించడం వివాదాస్పదమైంది.

Published : 09 Jun 2023 02:10 IST

పుట్టాపహాడ్‌ చౌరస్తాలో ప్రజల ఆందోళన

కుల్కచర్ల గ్రామీణ, న్యూస్‌టుడే: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పుట్టాపహాడ్‌ గ్రామ శివారులోని ఏటి చెరువు దగ్గర చెరువుల పండుగను జరపాలని మండల అధికారులు ఆదేశించడం వివాదాస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే.. అధికారుల సూచన మేరకు పుట్టాపహాడ్‌ గ్రామ ప్రజలందరూ గురువారం ఏటి చెరువు దగ్గర ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ చెరువు సమస్య కోర్టు పరిధిలో ఉందని పండుగ చేస్తే గొడవ జరిగే అవకాశం ఉందని గాదిర్యాల్‌ సర్పంచి అభ్యంతరం తెలిపినట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. గ్రామంలో వేరొక చోట ఉన్న కుంట దగ్గర చేసుకోవాలని అధికారులు సూచించారు. దీంతో పుట్టాపహాడ్‌ గ్రామస్థులు ఇక్కడే ఎందుకు చేసుకోరాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి అండదండలతోనే గాదిర్యాల్‌ గ్రామస్థులు ఈ విధంగా ప్రయత్నాలు చేశారని వారు  ఆరోపించారు. అంతేకాదు ఆగ్రహంతో ఎమ్మెల్యే దిష్టి బొమ్మను ఊరేగింపుగా తీసుకువచ్చి పుట్టాపహాడ్‌ చౌరస్తాలో నిరసన తెలిపారు. దిష్టి బొమ్మ చుట్టూ మహిళలంతా చేరి బొడ్డెమ్మ వేశారు. ప్రజలకు డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు మద్దతు తెలిపారు. అనంతరం గ్రామస్థులంతా కలిసి ఎమ్మెల్యే దిష్టి బొమ్మను రోడ్డుపై దహనం చేశారు. సీఐ వెంకటరామయ్య, ఎస్సైలు శ్రీశైలం, విఠల్‌రెడ్డి, విశ్వజన్‌లు వారికి నచ్చజెప్పారు. అధికారులను పిలిపించి చర్చించేలా చూస్తామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది. దాదాపు మూడు గంటల పాటు రోడ్డుపై ధర్నా నిర్వహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని