logo

Hyderabad: పెళ్లి పేరుతో భార్యాభర్తల మోసాలు.. అరెస్ట్‌

పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ అమాయక యువతులను మోసం చేస్తున్న వ్యక్తిని, సహకరిస్తున్న అతని భార్యను హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 14 Mar 2024 06:44 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: పెళ్లి చేసుకుంటానని నమ్మిస్తూ అమాయక యువతులను మోసం చేస్తున్న వ్యక్తిని, సహకరిస్తున్న అతని భార్యను హైదరాబాద్‌ సీసీఎస్‌ స్పెషల్‌ జోనల్‌ క్రైమ్‌ టీమ్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ జి.వెంకటేశ్వరరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ డి.భిక్షపతి తెలిపిన వివరాలివీ.. సిరిసిల్ల జిల్లా వెంకంపేట గ్రామానికి చెందిన యెలిగేటి రంజిత్‌ ఎలియాస్‌ యడ్ల శ్రీరాధాకృష్ణ ఎలియాస్‌ రాజేశ్‌ (35), భార్య సంధ్య పీర్జాదిగూడ  వినాయక్‌నగర్‌, రోడ్‌ నంబరు 4లోని ప్లాట్‌ 93లో అద్దెకుంటున్నారు. 2022లో రంజిత్‌ తన ఫోన్‌లో సామాజిక మాధ్యమ వేదికలను పరిశీలిస్తుండగా షాదీ డాట్‌ కామ్‌, తెలుగు మ్యాట్నిమోనీ వంటి వెబ్‌సైట్‌లలో చాలామంది అమ్మాయిలు వరుడి కోసం ప్రొఫైల్స్‌ పెట్టడం గమనించాడు. భార్యకు చెప్పి వధువు కావలెను అంటూ రంజిత్‌ ప్రొఫైల్‌ పెట్టాడు. అతడి వలలో పడిన అమ్మాయిలను వెంటనే పెళ్లి చేసుకోవాలి.. హనీమూన్‌ టికెట్లు బుక్‌ చేసుకోవాలి.. ఇంకా చాలా పనులు ఉన్నాయంటూ ఊహల ప్రపంచంలో విహరించేలా చేసేవాడు. బుట్టలో పడ్డాక కట్నకానుకల పేరుతో డబ్బులు దండుకున్నాడు. కొన్నిసార్లు అమ్మాయిల వాళ్ల ఇంటికి వెళ్లి మాట్లాడి వచ్చేవాడు. ఈ నాటకంలో భార్య సంధ్య సహకరించేది. ఓ యువతి తనకు జరిగిన మోసం గురించి సీసీఎస్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు మోసం చేశారు. అతనిపై ములుగు, కేపీహెచ్‌పీ ఠాణాల్లోనూ కేసులున్నాయి. నిందితుల నుంచి ఒక కారు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. బుధవారం భార్యాభర్తలను రిమాండ్‌కు తరలించారు. మరికొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని