logo

Hyderabad: పోలీసు అధికారులు కావలెను!

రాజధానిలోని మూడు పోలీస్‌ కమిషనరేట్లలో కీలక విభాగాలు సారథుల్లేకుండానే కొనసాగుతున్నాయి. అదనపు, సంయుక్త కమిషనర్లు, డీసీపీ పోస్టులు నెలలపాటు ఖాళీగా ఉన్నాయి. ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పోస్టు దాదాపు నెలనుంచి ఖాళీగానే ఉంది.

Updated : 01 Apr 2024 08:27 IST

నగరంలో కీలక పోస్టులు నెలలుగా ఖాళీ

ఈనాడు- హైదరాబాద్‌: రాజధానిలోని మూడు పోలీస్‌ కమిషనరేట్లలో కీలక విభాగాలు సారథుల్లేకుండానే కొనసాగుతున్నాయి. అదనపు, సంయుక్త కమిషనర్లు, డీసీపీ పోస్టులు నెలలపాటు ఖాళీగా ఉన్నాయి. ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ పోస్టు దాదాపు నెలనుంచి ఖాళీగానే ఉంది. విశ్వప్రసాద్‌ బదిలీ తర్వాత ఎవరినీ నియమించలేదు. నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల ఆదేశించారు. ఇలాంటి సమయంలో ట్రాఫిక్‌ సారథి లేకపోవడం ఇబ్బందికరం. ఏడాదిలో ముగ్గురు సారథులు మారారు.

అదనపు కమిషనర్లు ఎక్కడ?

శాంతిభద్రతలు, పాలనాపరమైన వ్యవహారాల పర్యవేక్షణలో అదనపు/సంయుక్త కమిషనర్‌కు ప్రాధాన్యం ఉంటుంది. రాచకొండ, సైబరాబాద్‌ కమిషనరేట్లు 4 నెలలుగా అదనపు కమిషనర్లు లేకుండానే నెట్టుకొస్తున్నాయి. శాసనసభ ఎన్నికల తర్వాత సైబరాబాద్‌ సంయుక్త కమిషనర్‌ అవినాశ్‌ మహంతిని కమిషనర్‌గా నియమించింది. రాచకొండలో 2022 డిసెంబరులో అదనపు కమిషనర్‌ డి.సుధీర్‌బాబు హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు బదిలీ అయ్యారు. ఆ స్థానంలో కరీంనగర్‌ కమిషనర్‌ సత్యనారాయణ వచ్చారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక ఎన్నికల సంఘం సత్యనారాయణ స్థానంలో అంబర్‌ కిషోర్‌ ఝాను నియమించింది. రోజుల వ్యవధిలోనే ఈయన్ను బదిలీ చేసి ప్రభుత్వం తరుణ్‌ జోషిని నియమించినా కొద్దిరోజుల్లోనే మల్టీజోన్‌-2 ఐజీగా వెళ్లారు. మళ్లీ ఆయన్నే కమిషనర్‌గా నియమించింది. అదనపు కమిషనర్‌ పోస్టు మాత్రం నాలుగు నెలలుగా ఖాళీగానే ఉంది.

ప్రాధాన్య స్థానాల్లో ఇన్‌ఛార్జులు

సాధారణ సమయంతో పోలిస్తే ఎన్నికల వేళ స్పెషల్‌ బ్రాంచి విభాగానికి ప్రాధాన్యముంటుంది. పోలింగ్‌ కేంద్రాల మ్యాపింగ్‌, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు చేరవేస్తుంది. హైదరాబాద్‌ కమిషనరేట్‌ 3 నెలలకుపైగా ఇన్‌ఛార్జితో నెట్టుకొస్తోంది. ప్రస్తుతం వెస్ట్‌జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ ఇన్‌ఛార్జిగా కొనసాగుతున్నారు. రాచకొండ సైబర్‌క్రైమ్‌ డీసీపీ అనురాధ బదిలీపై వెళ్లాక ఇన్‌ఛార్జి డీసీపీతోనే కొనసాగుతోంది. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ డీసీపీగా శిల్పవల్లిని నియమించి కొద్దిరోజుల్లోనే మార్చారు. సైబరాబాద్‌ క్రైమ్‌ డీసీపీ కొత్తపల్లి నరసింహకు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. మాదాపూర్‌ ట్రాఫిక్‌ డీసీపీ హర్షవర్ధన్‌ ఎన్నికల వేళ బదిలీపై వెళ్లాక మేడ్చల్‌ ట్రాఫిక్‌ డీసీపీ డీవీ శ్రీనివాసరావును ఇన్‌ఛార్జిగా నియమించారు. తాజాగా లోక్‌సభ ఎన్నికల కోడ్‌తో వీటి భర్తీకి మరిన్ని నెలలు పట్టొచ్చని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని