మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం

ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి..

Updated : 20 Apr 2024 06:04 IST

సినిమా సన్నివేశాలకు పేరడీలు.. వ్యంగ్యాస్త్రాలు
కంటెంట్‌ క్రియేటర్లు, గ్రాఫిక్స్‌, ఏఐ నిపుణులకు డిమాండ్‌

ఈనాడు- హైదరాబాద్‌: ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. క్రమంగా ట్రెండు మారుతోంది. సభలు, సమావేశాలతో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయడంతో పాటు కడుపుబ్బా నవ్వించే వీడియోలు.. వ్యంగ్యంగా రూపొందించిన మీమ్‌లతో ఆకట్టుకోవడం తప్పనిసరిగా మారుతోంది. ముఖ్యంగా 18- 25 ఏళ్ల మధ్య వయసుండే యువ ఓటర్లను ఆకట్టుకోవడానికి సామాజిక మాధ్యమ బృందాలు, మీమర్లతో లోక్‌సభ అభ్యర్థులు బరిలోకి దిగుతున్నారు. ఇంకా ఎన్నికల ప్రచారాన్ని పూర్తిస్థాయిలో మొదలుపెట్టని అభ్యర్థులు.. సామాజిక మాధ్యమాల్లో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పదునైన విమర్శలు, సినిమా సన్నివేశాలకు పేరడీలు, వ్యంగ్య వ్యాఖ్యలతో తమకు అనుకూలంగా వీడియోలు, కామెంట్లతో కూడిన ఫొటోలు తయారు చేయించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రావడంతో ఈ తరహా ప్రచారం మరింత ఊపందుకుంటోంది.

ఆకట్టుకునే రీతిలో..

ప్రధాన పార్టీల అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో మీమ్‌లతో ప్రచారం చేయడానికి ప్రధాన కారణం యువ ఓటర్లు. కొంత వయసు దాటిన వారితో పోలిస్తే యువ ఓటర్ల ప్రాథమ్యాలు విభిన్నంగా ఉంటాయి. అవినీతి, ఉద్యోగ నియామకాలు, విద్య, వైద్యానికి కేటాయింపులు వంటివి చూస్తుంటారు. ఉన్నత విద్య, ఉద్యోగాల వేటలో ఉన్నా.. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటారు. అవినీతి, తమ ప్రాంతానికి జరిగిన అభివృద్ధి, సమస్యలపై సోషల్‌ మీడియాలో ప్రశ్నిస్తుంటారు. యువ ఓటర్లు కుటుంబ సభ్యుల్ని ప్రభావితం చేస్తుంటారు. ఇలాంటి ఓటర్లను నేరుగా కలవడంతో పాటు తమ పార్టీ విధానాలు, ప్రత్యర్థుల లోపాల్ని ఆకట్టుకునే రీతిలో తెలియజేసేందుకే అన్ని పార్టీలు మీమ్‌లను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి. ఉదాహరణకు నగరంలోని హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ చేవెళ్ల, మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో శాసనసభ ఎన్నికల తర్వాత సగటున 8 శాతం ఓటర్లు పెరిగారు. వీరంతా 18-25 ఏళ్ల వారే. వీరేగాకుండా 30 ఏళ్లలోపు వారు లక్షల సంఖ్యలో ఉన్నారు. ఈ వర్గాన్ని ఆకట్టుకోవడానికి నగర పరిధిలో విస్తృత ప్రచారం జరుగుతోంది.

మీమర్లతో ప్రత్యేక బృందాలు

ఇప్పటికే అభ్యర్థులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారంకోసం బృందాలను ఏర్పాటుచేసుకున్నారు. ప్రధానంగా యువతను ఆకట్టుకోవడానికి ఫొటోలు, వ్యంగ్యమైన సంభాషణలు,  పేరడీ వీడియోలు రూపొందించేందుకు మరికొందర్ని నియమిస్తున్నారు. కంటెంట్‌ క్రియేటర్లు, గ్రాఫిక్స్‌, కృత్రిమ మేథపై  అవగాహన ఉన్నవారిని ఎంచుకుంటున్నారు. నెలరోజులకు ఒప్పందం కుదర్చుకుని రంగంలోకి దించుతున్నారు. వాట్సాప్‌, యూబ్యూట్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌, ఎక్స్‌ తదితరవేదికలపై వీటిని పోస్టుచేస్తుంటారు. అవసరమైతే ఛానెళ్లు, పేజీలు ఏర్పాటుచేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని