logo

బియ్యమని తెలియకుండానే అక్రమ రవాణా

పేదల బియ్యం అక్రమ రవాణాలో నేరగాళ్లు తప్పించుకుంటుండగా అమాయకులైన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు పట్టుబడుతున్నారు.

Updated : 22 Apr 2024 05:26 IST

కూలీకి వచ్చి పట్టుబడుతున్న అమాయక డ్రైవర్లు

అత్తాపూర్‌లో ఓ గోదాములో బియ్యం

ఈనాడు, హైదరాబాద్‌: పేదల బియ్యం అక్రమ రవాణాలో నేరగాళ్లు తప్పించుకుంటుండగా అమాయకులైన వాహనాల డ్రైవర్లు, క్లీనర్లు పట్టుబడుతున్నారు. ఏం, ఎందుకు తరలిస్తున్నారో.. తెలియకుండానే లోడును రాష్ట్రాలు దాటించేస్తున్నారు. ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి గ్రేటర్‌లో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి 45కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు బియ్యాన్ని తరలిస్తున్న ఓ ట్రక్కును స్వాధీనం చేసుకుని విచారించగా తమకేమీ తెలియదని, రోజుకు రూ.2000 ఇస్తామంటే వచ్చానని, లోడును కర్ణాటకకు చేర్చాలని చెప్పారని తెలిపాడు. పట్టుబడిన వారిలో ఎక్కువ మంది యువకులే ఉన్నారని ఓ అధికారి తెలిపారు. నిత్యం టన్నుల కొద్దీ బియ్యం కర్ణాటక, మహారాష్ట్రకు తరలిపోతోంది. మరోవైపు వాహనాలు పట్టుబడగానే ‘సార్‌ బండి రిలీజ్‌ అవ్వాలి..? ఎంతవుతుంది? ఎన్ని రోజులు పడుతుంది?’ అంటూ కొందరు నేతలు అధికారులకు ఫోన్‌ చేస్తున్నారు.

పట్టుబడిన ఉదంతాలివి..

  • మహారాష్ట్రకు అక్రమంగా బియ్యాన్ని రవాణా చేస్తున్న ముఠాను రాజేంద్రనగర్‌ ఎస్‌వోటీ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు. రూ.3 లక్షల విలువైన సుమారు 15 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణలో సల్మాన్‌ అనే వ్యక్తి చాంద్రాయణగుట్ట గోదాము నుంచి ఉమర్గా (మహారాష్ట్ర)కు తరలిస్తున్నారని తెలిసింది.
  • కాటేదాన్‌ నుంచి కర్ణాటక రాష్ట్రానికి అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న ముఠాను సీసీఎస్‌ పోలీసులు గతనెల పట్టుకున్నారు. 36 టన్నుల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని డ్రైవర్‌, క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్నారు.  
  • సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు ఇటీవల రూ.95 వేల విలువైన 3,800 కేజీల బియ్యాన్ని పట్టుకున్నారు. బాలానగర్‌ బృందంతోపాటు జీడిమెట్ల పోలీసులు కలిసి జీడిమెట్లలోని సుభాష్‌నగర్‌లో ఓ ఇంట్లో సోదా చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఇంటి యజమానిని అదుపులోకి తీసుకున్నారు.్య వనస్థలిపురంలో అక్రమంగా బియ్యం నిల్వ ఉంచిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.  
  • అత్తాపూర్‌ పిల్లర్‌ నంబరు 162 సమీపంలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ గోదామును ఇటీవల అధికారులు గుర్తించారు. అక్కడ సుమారు 600 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని