logo

హామీలు మాత్రమే ఇచ్చేది కాంగ్రెస్‌.. అమలు చేసేది భాజపా

హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ అని, ఇచ్చిన హామీలను అమలుచేసిది భాజపా అని మెదక్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు.

Published : 22 Apr 2024 03:34 IST

మెదక్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు

అమీర్‌పేట, న్యూస్‌టుడే: హామీలను మాత్రమే ఇచ్చే పార్టీ కాంగ్రెస్‌ అని, ఇచ్చిన హామీలను అమలుచేసిది భాజపా అని మెదక్‌ పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. అమీర్‌పేటలోని ఆదిత్యా పార్క్‌ ఇన్‌ హోటల్‌లో ఆదివారం తెలంగాణ జర్నలిస్ట్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రఘునందన్‌రావుతో క్రాస్‌ టాక్‌ నిర్వహించగా ఆయన మాట్లాడుతూ.. పది సంవత్సరాల నరేంద్రమోదీ పాలన, అంతకుముందు కాంగ్రెస్‌ సారథ్యంలోని మన్మోహన్‌సింగ్‌ పాలనల్లో ప్రోగ్రెస్‌ కార్డు చూసుకున్న తరువాత ప్రజలు ఎవరికి ఓట్లెయ్యాలో నిర్ణయించుకోవాలని కోరారు.  

చర్చకు సిద్ధం

దుబ్బాక అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి ఎప్పుడు వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. దుబ్బాకలో ఓడిపోయిన రఘునందన్‌ మెదక్‌లో ఎలా పోటీ చేస్తాడని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారని, కొడంగల్‌లో ఓడిన రేవంత్‌రెడ్డి మల్కాజిగిరిలో పోటీ చేయలేదా అని ప్రశ్నించారు. కామారెడ్డిలో కేసీఆర్‌, రేవంత్‌రెడ్డిని ఓడించింది భాజపా కాదా అన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌, ఓటుకు నోటు వల్లే తాను దుబ్బాకలో ఓటమిపాలయ్యానన్నారు. పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ రేవంత్‌రెడ్డి తమకు మిత్రుడు కాదన్నారు. కవిత కంటే ముందు సోనియా, రాహుల్‌, వాద్రాలను ఈడీ విచారణ తరువాత సోనియాను అరెస్టు చేయలేదని, అప్పుడెందుకు కాంగ్రెస్‌-భాజపా ఒక్కటేనని అనలేదన్నారు. కవిత మాత్రం అరెస్టు కాకపోతే భాజపా, భారాస ఒక్కటేనని ప్రచారం చేశారన్నారు. మెదక్‌ అభివృద్ధిని సర్వనాశనం చేసిన వ్యక్తి వెంకట్రామిరెడ్డి అని, భారాసతో రేవంత్‌రెడ్డికి సంబంధాలు లేకపోతే ఆయనను ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. జర్నలిస్ట్‌ యూనియన్‌ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఏబీబీపీ పూర్వ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ మురళీ మనోహర్‌, టీజేయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయికృష్ణ, ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ ఉపాధ్యక్షుడు నర్సింహా, కపిలాయి రవీందర్‌, కనకారెడ్డి, బాబురావు, ఎల్లయ్య, శ్రీనివాస్‌, సిద్ధల రవి, సతీష్‌, వేముల సుదర్శన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని