logo

లీజుకు హెచ్‌ఎండీఏ కాంప్లెక్స్‌లు

అమీర్‌పేటలోని హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రధాన కార్యాలయం తరలింపునకు రంగం సిద్ధమవుతోంది.

Updated : 22 Apr 2024 05:22 IST

ఐటీ సంస్థలు, మాల్స్‌కు ఇచ్చే యోచన
పైగా ప్యాలెస్‌కు తరలనున్న ప్రధాన కార్యాలయం

బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌

ఈనాడు, హైదరాబాద్‌: అమీర్‌పేటలోని హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) ప్రధాన కార్యాలయం తరలింపునకు రంగం సిద్ధమవుతోంది. ఎన్నికలు ముగిసిన వెంటనే తరలింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో ప్రారంభంకానుంది. గతంలో బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం కొనసాగేది. అప్పట్లో దీనిని అమెరికన్‌ కాన్సులేట్‌ జనరల్‌కు కేటాయించారు. హెచ్‌ఎండీఏను తార్నాకకు తరలించారు. నగరానికి దూరంగా ఉండటం, ట్రాఫిక్‌ సమస్యతో ప్రజల రాకపోకలకు అసౌకర్యంగా ఉండటంతో అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కార్యాలయానికి తిరిగి తరలించారు. 8 ఏళ్లుగా ఇక్కడే కొనసాగుతోంది. ఇటీవల అమెరికన్‌ కాన్సులేట్‌కు సొంతభవనం ఏర్పాటుకావడంతో పైగా ప్యాలెస్‌ ఖాళీ చేశారు. దీంతో పూర్వంలా హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయాన్ని పైగా ప్యాలెస్‌లో కొనసాగించనున్నారు. అమీర్‌పేటలోని కీలక ప్రాంతంలో స్వర్ణ జయంతి కాంప్లెక్స్‌ ఏడు అంతస్తుల్లో విస్తరించి ఉంది. హెచ్‌ఎండీఏకు ఇక్కడే మైత్రి వనం, మైత్రి విహార్‌ అనే మరో రెండు కాంప్లెక్స్‌లున్నాయి. వీటితో ఏటా రూ.12-15 కోట్ల వరకు అద్దె రూపంలో సమకూరుతోంది. ఇటీవల స్వర్ణ జయంతితో పాటు మైత్రీ వనంలను హెచ్‌ఎండీఏ కార్పొరేట్‌ స్థాయిలో ఆధునికీకరించింది. ఈ రెండు కార్యాలయాలను ఐటీ సంస్థలు లేదా మాల్స్‌కు లీజుకివ్వడంతో అధిక ఆదాయం పొందవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ముందుగా స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ను ఖాళీచేసి ఇవ్వనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని