logo

వైద్య కళాశాలకు అనుసంధాన ఆసుపత్రులు

హైదరాబాద్‌ నగరం సమీపంలో ప్రభుత్వ వైద్యకళాశాలల కొరత తీర్చేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించినా... వైద్య విద్యార్థులకు అవసరమైన ప్రభుత్వ ఆసుపత్రులు రెండు జిల్లాల్లోనూ లేవు.

Published : 22 Apr 2024 03:43 IST

మహేశ్వరం.. షాద్‌నగర్‌.. మల్కాజిగిరి ప్రాంతాల పరిశీలన
లోక్‌సభ ఎన్నికల అనంతరం ఖరారు

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం సమీపంలో ప్రభుత్వ వైద్యకళాశాలల కొరత తీర్చేందుకు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు గత ప్రభుత్వం నిర్ణయించినా... వైద్య విద్యార్థులకు అవసరమైన ప్రభుత్వ ఆసుపత్రులు రెండు జిల్లాల్లోనూ లేవు. దీంతో రెండు వైద్య కళాశాలలకు అనువైన ఆసుపత్రులను ఎంపిక చేసేందుకు అధికారులు 50, 100 పడకల ఆసుపత్రులు, వాటిలో సౌకర్యాలను పరిశీలిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా వైద్యకళాశాలను మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు, మేడ్చల్‌ జిల్లా వైద్య కళాశాలను కుత్బుల్లాపూర్‌ చింతల్‌లో నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధంచేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత వైద్యకళాశాలల విద్యార్థులకు అనుకూలంగా ఉండే ఆసుపత్రులను నిర్ణయించనున్నారు.

పేద, మధ్యతరగతికి వైద్యసేవలు: నగరం, శివారు ప్రాంతాలు పెరుగుతుండడంతో చుట్టుపక్కల 40 కి.మీ.లవరకు జనావాసాలు విస్తరించాయి. ఇక్కడ నివసిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలు చికిత్సలకు ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ ఆసుపత్రులకు రావాల్సిందే. లేదంటే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాలి. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో వంద సీట్ల ప్రభుత్వ వైద్యకళాశాలల ఏర్పాటుకు నిర్ణయించారు. వంద సీట్ల వైద్య కళాశాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. కందుకూరు పరిసర ప్రాంతాల్లో వంద పడకల ఆసుపత్రి కోసం మహేశ్వరం, షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలించారు. చింతల్‌లో నిర్మించనున్న వ్రైద్య కళాశాలకు మల్కాజిగిరి ఆసుపత్రిని అనుసంధానించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

ఉస్మానియా, గాంధీలపై ఒత్తిడి తగ్గించేందుకు..

ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల నుంచి వైద్యసేవల కోసం వస్తున్న రోగుల సంఖ్యను తగ్గించేందుకు, వైద్యసేవలపై ఒత్తిడి పడకుండా ఉండేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు కొత్త వైద్యకళాశాలల ఏర్పాటుకు నిర్ణయించారు. తద్వారా ఆ నాలుగు జిల్లాల్లోని ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందుతాయి. ఆయా ప్రాంతాలనుంచి అత్యవసర వైద్యచికిత్సలకు వచ్చేవారిని ఈ కొత్త ఆసుపత్రులకు తరలించనున్నారు. వైద్యకళాశాలల నిర్మాణం ఏడాదిన్నరలోపు పూర్తిచేయాలన్నది లక్ష్యం. ప్రభుత్వం బడ్జెట్‌ కూడా కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని