logo

పోటీ త్రిముఖం.. ప్రచారం బహుముఖం

చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఈసారి పేరుకే 43 మంది బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్‌, భాజపా, భారాసల మధ్యే ‘త్రిముఖ’ పోటీ నెలకొంది.

Updated : 05 May 2024 06:21 IST

చేవెళ్లలో విజయానికి పార్టీల సకల యత్నాలు  

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: చేవెళ్ల పార్లమెంటు స్థానానికి ఈసారి పేరుకే 43 మంది బరిలో ఉన్నా ప్రధానంగా కాంగ్రెస్‌, భాజపా, భారాసల మధ్యే ‘త్రిముఖ’ పోటీ నెలకొంది.  తమదైన ముద్ర వేసి చేవెళ్లను కైవసం చేసుకోవాలని వీరు బహు విధాలుగా ప్రచారం చేస్తున్నారు.  గ్రామం నుంచి పట్టణం దాకా చుట్టేస్తున్నారు కాంగ్రెస్‌ నుంచి గడ్డం రంజిత్‌రెడ్డి, భాజపా నుంచి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, భారాస నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌లు తలపడుతున్నారు. లోక్‌సభ నియోజకవర్గానికి కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జిగా వేంనరేందర్‌రెడ్డి, భాజపా ఇన్‌ఛార్జిగా మల్లారెడ్డి, భారాస ఇన్‌ఛార్జిగా మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డిని  నియమించారు. ప్రస్తుతం మూడు పార్టీలు పల్లె, పట్టణం, తండా, వార్డు అనే తేడా లేకుండా ప్రచారం హోరెత్తిస్తున్నాయి. నియోజకవర్గ, మండల స్థాయిల్లో కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ కార్యాచరణపై చర్చిస్తున్నారు.

ఎండలు ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్నం వేళల్లో కల్యాణ మండపాల్లో, కాలనీల్లో నీడపట్టున సమావేశాలు నిర్వహించి గెలిస్తే తామేం చేస్తామో వివరిస్తున్నారు.


అసెంబ్లీకి ఒకలా.. పార్లమెంట్‌కు మరోలా..

  • 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో వికారాబాద్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో భారాస అభ్యర్థులే గెలుపొందినా, ఆరు మాసాలలోపే (2019) జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వికారాబాద్‌, పరిగి నియోజకవర్గాల్లో 27,192 ఓట్ల మెజార్టీ వచ్చింది. తాండూరులో భారాసకు 1,199 ఓట్ల స్వల్ప ఆధిక్యం లభించింది. ఈ మూడు నియోజకవర్గాల్లో భాజపాకు 37,009 ఓట్లు పోలయ్యాయి.
  • 2023 నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పరిగి, వికారాబాద్‌, తాండూరులలో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో గతంలో మాదిరిగానే ఓటింగ్‌ సరళి కొనసాగుతుందా..? అధికార పార్టీ వైపే మొగ్గుచూపుతారా? లేదా గతంలో మాదిరి ఆధిక్యతలు తారుమారు అవుతాయా..అనేది చర్చనీయాంశంగా మారింది.
  • చేవెళ్లలో ఎలాగైనా కాషాయ జెండా రెపరెప లాడాలని భాజపా క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆ పార్టీని వీడి భాజపాలో చేరి స్వయంగా ముందుండి నడుపుతున్నారు.
  • మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా రెడ్డి భారాసకు పునరుత్తేజం తెచ్చేందుకు విస్తృత ప్రచారం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని