logo

గెలుపు, ఓటమికి మధ్య నోటా దోబూచులాట!

ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఎన్నికల కమిషన్‌ కల్పించిన అవకాశం నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబౌవ్‌).

Published : 05 May 2024 03:44 IST

చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలపై ప్రభావం
బూత్‌ స్థాయి ఓటర్లే లక్ష్యంగా అభ్యర్థుల ప్రచారం
ఈనాడు, హైదరాబాద్‌

న్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే ఓటర్లు తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు ఎన్నికల కమిషన్‌ కల్పించిన అవకాశం నోటా (నన్‌ ఆఫ్‌ ది ఎబౌవ్‌). పదకొండేళ్ల క్రితం ఈవీఎంలోకి వచ్చిన నోటా కారణంగా దేశవ్యాప్తంగా 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కొన్నింటిలో నోటాకు వచ్చిన ఓట్లు ప్రభావం చూపించాయి. ఇందులో చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాలూ ఉన్నాయి. మల్కాజిగిరిలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచిన ఎ.రేవంత్‌రెడ్డికి 10వేల మెజారిటీ రాగా నోటాకు 17వేల ఓట్లు వచ్చాయి. చేవెళ్ల బరిలో భారాస అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి 14వేల మెజారిటీతో గెలుపొందగా నోటాకు 9 వేలకుపైగా  ఓట్లు వచ్చాయి. దీంతో తాజా ఎన్నికల్లో ఓటర్లు నోటాకు వేయకుండా తమకే వేసేలా ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు.

పోలింగ్‌శాతం పెరిగితేనే....

చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ఎన్నికల అధికారులు తాజాగా విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం చేవెళ్లలో 29.39 లక్షల మంది, మల్కాజిగిరిలో 37.80 లక్షల మంది ఓటర్లున్నారు. ఐదేళ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్లలో 26.23 లక్షల ఓట్లలో 53.23శాతం పోలింగ్‌ నమోదయింది. మల్కాజిగిరిలో 34.28 లక్షల ఓటర్లలో 49.63 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెరిగిన ఓటర్లతో పోలింగ్‌శాతం పెరగాల్సిన అవసరం ఉంది.

గ్రామీణ, మెట్రో ప్రాంతాల మధ్య వ్యత్యాసం..: గత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే... గ్రామీణ ప్రాంతాలు, మెట్రో ప్రాంతాల మధ్య తీవ్ర వ్యత్యాసం కనిపించింది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్‌, కుత్బుల్లాపూర్‌, ఉప్పల్‌ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్‌ 54 శాతం నమోదు కాగా.. కూకట్‌పల్లి, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, ఎల్బీనగర్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో 50 శాతంకంటే తక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. కూకట్‌పల్లి, ఉప్పల్‌ అసెంబ్లీ సెగ్మెంట్లలో 20 శాతం ఏపీ, నల్గొండ, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల ఓటర్లున్నారు. ఈసారి వీరంతా తమ సొంతూళ్లకు వెళ్లనున్నారు. దీంతో మళ్లీ పోలింగ్‌శాతం తగ్గే అవకాశాలున్నాయంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని