logo

మండుటెండల్లో.. ఠండా పానీ

చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్‌ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది.

Updated : 05 May 2024 04:01 IST

పలు ప్రాంతాల్లో జలమండలి ఉచిత తాగునీటి కేంద్రాలు

నాచారంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం  

ఈనాడు, హైదరాబాద్‌: చలివేంద్రం అంటే.. రెండు మట్టి కుండలు.. వాటిపైన ప్లాస్టిక్‌ గ్లాసు గుర్తుకొస్తుంది. తొలిసారి జలమండలి వినూత్న పద్ధతిలో చలివేంద్రాలను తీసుకొచ్చింది. మట్టికుండల స్థానంలో పెద్ద సైజు కూలింగ్‌ ఫిల్టర్లను పలు ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చింది. కొన్ని చోట్ల క్యాన్లతో చల్లని నీటిని సరఫరా చేస్తోంది. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తోంది. గతంలో మట్టికుండలు లేదా ప్లాస్టిక్‌ డ్రమ్ములు పెట్టి  నీళ్లు పోసేవారు. ప్లాస్టిక్‌ గ్లాసుతో అడిగిన వారికి  నీటిని అందించేవారు. పరిసరాల శుభ్రత పాటించకపోవడం, డ్రమ్ములను సక్రమంగా శుభ్రం చేయకపోవడంతో ఈ నీటిని తాగడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపేవారు కాదు. ఈ వేసవిలో జలమండలి అధికారులు  రెస్టారెంట్లు, హోటళ్లలో వాడే పెద్దపెద్ద కూలింగ్‌ ఫిల్టర్లను  అందుబాటులో ఉంచారు. వీటిలో నీళ్లు పోస్తే....ఫిల్టర్‌తో కూల్‌ అయి బయటకు సరఫరా అవుతాయి. అక్కడే డిస్పోజబుల్‌ గ్లాసులు  ఉంచారు. కొన్ని చోట్ల చిన్న చిన్న క్యాన్లలో శుభ్రమైన చల్లటి నీటిని పోసి ప్రజలకు అందిస్తున్నారు. మండుటెండల్లో దాహం వేసి నీళ్ల కోసం  చూసే వారికి ఈ కేంద్రాలు ఊరటనిస్తున్నాయి. రూ.20 పెట్టి చల్లని వాటర్‌ బాటిల్‌ కొనే కంటే ఈ నీటినే ఎక్కువ మంది వినియోగిస్తున్నారు. ఇప్పటివరకు బల్డియా పరిధిలో 55, అవుటర్‌ రింగ్‌ పరిధిలో మరో 70 ఈ వినూత్న చలివేంద్రాలను జలమండలి ఏర్పాటు చేసింది. బస్టాప్‌లు, బస్టాండ్లు, ఆసుపత్రులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో  నెలకొల్పుతున్నారు.   కూలీ పనులు చేసుకునే వారు, ఆటో డ్రైవర్లు, రోడ్లపై తోపుడు బళ్లపై వ్యాపారం చేసేవారు ఎండాకాలంలో చల్లటి తాగునీరు లేక విలవిలలాడుతుంటారు. ఇలాంటి వారు ఈ కేంద్రాల ద్వారా ఎంతో ఉపశమనం పొందుతున్నారు.  


ఇక అక్కడ అన్ని రోజుల్లో కొనసాగింపు

సూటేసుకుని టిప్‌టాప్‌గా రెడీ అయి తాగునీరు అందిస్తున్న ఇతడు బంజారాహిల్స్‌లోని ‘తాజ్‌కృష్ణ’ ఉద్యోగి. హోటల్‌ యాజమాన్యం ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఇలా విధులు నిర్వర్తిస్తున్నారు.

ఏప్రిల్‌, మే నెలల్లో మాత్రమే జలమండలి ప్రత్యేకంగా చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. మిగతా రోజుల్లో ప్రజల నుంచి పెద్దగా డిమాండ్‌ ఉండకపోవడంతో మూసేస్తుంది. ఇక నుంచి కీలక ప్రాంతాల్లో ఈ కియోస్కోలను కొనసాగించనుంది. రద్దీగా ఉండే కొన్ని ప్రభుత్వ, ట్రస్టు ఆసుపత్రులు, బస్టాండ్ల వద్ద నిరంతరం ఈ కేంద్రాలను కొనసాగించాలని నిర్ణయించింది. బస్టాప్‌ల వద్ద ప్రయాణికులకు, ఆసుపత్రుల వద్ద రోగులు, సహాయకులకు మంచినీటి కొరత లేకుండా చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేసవిలో చాలా స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తుంటాయి. ఇలాంటి వారికి జలమండలే ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయనుంది.  చలివేంద్రాలకు బల్క్‌గా తాగునీరు అవసరమయ్యే వారు 155313 ఫోన్‌ చేయాలని అధికారులు సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని