logo

ఒకటిన్నర ఎకరా మించితే.. టీడీఆర్‌ కష్టం

అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టి టీడీఆర్‌  (అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇచ్చే ప్రక్రియపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

Updated : 05 May 2024 06:18 IST

చెరువులు, ఇతరత్రా అభివృద్ధికి భూసేకరణపై ఆంక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: అభివృద్ధి పనుల కోసం భూసేకరణ చేపట్టి టీడీఆర్‌  (అభివృద్ధి బదలాయింపు హక్కు) ఇచ్చే ప్రక్రియపై గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మే 19, 2023న అప్పటి పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ ఆ ఉత్తర్వు జారీ చేశారు. నగరానికి కొత్త టీడీఆర్‌ విధానం అవసరమంటూ జీహెచ్‌ఎంసీ రాసిన లేఖతో నూతన నిబంధన తెచ్చినట్లు పేర్కొన్నారు. చెరువుల ఎఫ్‌టీఎల్‌ (పూర్తి స్థాయి నీటి మట్టం), బఫర్‌జోన్‌లో ఉన్న 1.5 ఎకరాలకు మించిన భూములకు టీడీఆర్‌ ఇవ్వొద్దని, అత్యవసరమైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ సంస్థలకు పురపాలకశాఖ స్పష్టం చేసింది.

అప్పట్నుంచి నిలిచిన ప్రక్రియ..

రాష్ట్ర పురపాలకశాఖ ఉత్తర్వు జారీ చేసిన రోజు నుంచి చెరువుల్లోని భూములకు టీడీఆర్‌ ఇచ్చే ప్రక్రియ నగరంలో దాదాపుగా నిలిచిపోయింది. అయితే, అప్పటికే మెజార్టీ చెరువులను జీహెచ్‌ఎంసీ టీడీఆర్‌ ద్వారా స్వాధీనం చేసుకుందని, వాటన్నింటినీలో సుందరీకరణ పనులు మొదలయ్యాయని అధికారులు చెబుతున్నారు.

సవరణ కోరిన బల్దియా..

నగరంలో టీడీఆర్‌ సర్టిఫికెట్లు కుప్పలుగా జారీ అయ్యాయి. వాటికి డిమాండ్‌ తగ్గడంతో.. బహుళ అంతస్తుల భవనాల్లో.. వాటితో పైఅంతస్తులను నిర్మించుకునే వెసులుబాటు కల్పించాలని, పలు ఇతర మార్గాల ద్వారా డిమాండ్‌ పెంచాల్సిన అవసరముందని అప్పట్లో జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి విన్నవించింది. ఎందుకంటే.. టీడీఆర్‌ జారీతో జీహెచ్‌ఎంసీపై భూసేకరణ భారం తగ్గుతోంది.  జీహెచ్‌ఎంసీ ఇప్పటికే రూ.10వేల కోట్ల విలువైన సర్టిఫికెట్లను జారీ చేసింది. దాని వల్ల మార్కెట్లో డిమాండ్‌ తగ్గింది. ఆదరణ పెంచేందుకు అప్పటి జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆకాశహర్మ్యాల్లో.. పై అంతస్తుల నిర్మాణానికి టీడీఆర్‌తో అనుమతి ఇవ్వాలని, ఇతరత్రా వెసులుబాట్లు కల్పించాలని కోరారు. ఈ నేపథ్యంలో ఎక్కువ విస్తీర్ణం ఉన్న భూములకు టీడీఆర్‌ ఇవ్వొద్దని గత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఏన్ని టీడీఆర్‌లు, ఏయే పనులకు..

నాలాల విస్తరణ 145
లింకు రోడ్లు 395
ప్రధాన  రహదారులు 850
ఎస్సార్డీపీ 227
శివారు రోడ్లు 14
చెరువుల సుందరీకరణ 345
మొత్తం 1976

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని