logo

త్వరలో శంషాబాద్‌కు మెట్రో: రంజిత్‌రెడ్డి

చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్‌లలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు.

Updated : 06 May 2024 05:46 IST

తుక్కుగూడలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి, చిత్రంలో రంజిత్‌రెడ్డి తదితరులు.

మహేశ్వరం, శంషాబాద్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని తుక్కుగూడ, శంషాబాద్‌లలో ఆదివారం రాత్రి నిర్వహించిన సమావేశాల్లో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశం హస్తం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. తుక్కుగూడ బాహ్యవలయ రహదారి వద్ద సీఎంకు నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్నర్‌ మీటింగ్స్‌ వద్ద భారీ కటౌట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తుక్కుగూడ కాంగ్రెస్‌ పార్టీకి అడ్డా అని.. ఈ గడ్డ మీద నన్ను ఆశీర్వదించి పార్లమెంటుకు పంపించాలని చేవెళ్ల లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థి డా.రంజిత్‌రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలోని కార్నర్‌ మీటింగ్‌లో రంజిత్‌రెడ్డి మాట్లాడారు. త్వరలో శంషాబాద్‌కు మెట్రో తీసుకొస్తానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. భాజపాకు ఓటు వేస్తే కరెంటు మోటర్లకు మీటర్లు పెడతారని తెలిపారు. కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి ఓటు వేస్తే వృథా అవుతుందన్నారు. భాజపా ప్రభుత్వం వస్తే ఉచిత పథకాలను, రిజర్వేషన్లను రద్దు చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను పంచప్రాణాలుగా భావించి అమలు చేస్తోందన్నారు. చేవెళ్ల ఎంపీగా తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.

సమావేశానికి హాజరైన ప్రజలు, కార్యకర్తలు

రంజిత్‌రెడ్డి ఎంపీగా గెలవడం ఖాయమని మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ బాధ్యులు కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీఛైర్‌పర్సన్‌ తీగల అనితారెడ్డి, డీసీసీ అధ్యక్షులు  నర్సింహారెడ్డి, దేప భాస్కర్‌రెడ్డి, బొక్క జంగారెడ్డి, ఏనుగు జంగారెడ్డి, రఘుమారెడ్డి, సునీతా అంధ్యానాయక్‌, వెంకట్‌రెడ్డి, ఇస్రాయేల్‌, ప్రశాంత్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి పాల్గొన్నారు.

నవాబ్‌పేట: నవాబ్‌పేట మండల పరిధిలోని ఎక్మామిడి గ్రామానికి చెందిన పలువురు భారాస నాయకులు చేవెళ్ల  కాంగ్రెస్‌ అభ్యర్థి రంజిత్‌ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని