logo

పాలమూరు... ప్రచార హోరు

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్‌నగర్‌ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

Updated : 07 May 2024 05:48 IST

విజయంపై ఎవరి ధీమా వారిదే
న్యూస్‌టుడే, బొంరాస్‌పేట, కొడంగల్‌

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తుండటంతో ‘మహబూబ్‌నగర్‌ (పాలమూరు)’ బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రచారంహోరెత్తిస్తున్నారు. గెలుపు తమదేనంటూ ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

నేరుగా రంగంలోకి సీఎం..

వికారాబాద్‌ జిల్లాలోని  కొడంగల్‌ అసెంబ్లీ సెగ్మెంట్‌ మహబూబ్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది.  మహబూబ్‌నగర్‌ వాసిగా, కొడంగల్‌ ఎమ్మెల్యేగా ఎదిగిన రేవంత్‌రెడ్డి సీఎం పీఠాన్ని అధిరోహించారు. జిల్లాకు శక్తిమేరకు సాయం చేయాలని తరచూ స్థానిక నేతలతో మాట్లాడటమే కాదు తానే చొరవ తీసుకుని మహబూబ్‌నగర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా వంశీచంద్‌రెడ్డిని పోటీలో నిలబెట్టారు. ఆయన గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఇప్పటికి జిల్లాలో రెండుసార్లు ప్రచారం చేశారు. స్వయంగా ముఖ్యమంత్రే బాధ్యత తీసుకోవడంతో వంశీచంద్‌రెడ్డి విజయం కాంగ్రెస్‌ శ్రేణులుధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఏడుగురు ఎమ్మెల్యేలూ కాంగ్రెస్‌ వారే..: పాలమూరు లోక్‌సభ స్థానానికి సీˆఎం ఇన్‌ఛార్జిగా ఉండటంతో పాటు దీని పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. కొడంగల్‌ నియోజకవర్గం నుంచి కచ్చితంగా 50 వేల మెజార్టీ రావాలని సీఎంఆదేశించారు. ఇదే లక్ష్యంతో కార్యకర్తలు, నేతలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

కొడంగల్‌ నియోజకవర్గంలోని భారాస ముఖ్యనేతలు, పార్టీని వీడుతూ కాంగ్రెస్‌లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో నేతల్లో ఉత్సాహం రెట్టిపవుతోంది.  


కేసీఆర్‌ పథకాలే బలం.. నమ్మకం  

ముఖ్యమంత్రిగా కేసీˆఆర్‌ ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలు నేటికీ ప్రజల గుండెల్లో ఉన్నాయని అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి అంటున్నారు. వాటినే ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలు నిలబెట్టుకోలేదని విమర్శిస్తున్నారు. ఇటీవల కోస్గికి వచ్చిన మాజీ మంత్రి హరీశ్‌ రావు కూడా ఎల్‌ఈడీ తెరలపై కాంగ్రెస్‌ హామీలు ఎలా అమలు కాలేదో చూపించి ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని వివరించారు. కేసీˆఆర్‌ పదేళ్ల పాలనలో చేపట్టిన సంక్షేమ పథకాలు పేదలకు వివరించేలా అభ్యర్థి మన్నె శ్రీనివాస్‌రెడ్డి తగిన ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఇటీవలే మాజీ సీఎం కేసీఆర్‌ మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సభకు వేలాదిగా జనం రావడం  పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. ఇదే జోష్‌తో ప్రచారం కొనసాగిస్తున్నారు.


మోదీ పాలన చూపిస్తూ.. ఆశలు కల్పిస్తూ..

కేంద్రంలో పదేళ్ల మోదీ పాలనతో ప్రజలు సంతోషంగా ఉన్నారని పార్టీ అభ్యర్థి డీకే అరుణ ఎక్కడ ప్రచారం చేసినా  చెబుతున్నారు. కాంగ్రెస్‌ హామీలపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తాను గెలిస్తే కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని, పాలమూరు జిల్లాకు నిధులు తీసుకొచ్చి పూర్తిస్థాయిలో కేంద్ర పథకాలను అమలుచేస్తామంటూ స్వయంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో ప్రధానంగా కృష్ణా - వికారాబాద్‌ రైల్వేలైన్‌ పూర్తి చేస్తామని భరోసా ఇస్తున్నారు. ఆమె గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించడంతో ప్రతి గ్రామంలో కొంత పట్టు ఉండటం కలిసి వచ్చే అవకాశంగా శ్రేణులు పేర్కొంటున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు