logo

కాసానిని ఆశీర్వదించండి: కేటీఆర్‌

చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి గత 20 ఏళ్లలో ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలపలేదని, అలాంటిది భారాస అధినేత కేసీఆర్‌ 93 బీసీ కులాలను ఏకం చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో ఉంచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.

Updated : 07 May 2024 05:57 IST

శంషాబాద్‌, బాలాపూర్‌, న్యూస్‌టుడే: చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గానికి గత 20 ఏళ్లలో ఏ పార్టీ బీసీ అభ్యర్థిని నిలపలేదని, అలాంటిది భారాస అధినేత కేసీఆర్‌ 93 బీసీ కులాలను ఏకం చేసిన కాసాని జ్ఞానేశ్వర్‌ను బరిలో ఉంచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. బీసీల అభ్యున్నతి కోసం కాసాని జ్ఞానేశ్వర్‌ను ఓటుతో ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు. సోమవారం శంషాబాద్‌లో రాజేంద్రనగర్‌ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో కేటీఆర్‌ పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో  10-12 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఆరు మాసాల్లో కేసీఆర్‌ రాజకీయాలను శాసిస్తారని అన్నారు.

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. ఈ నెల 13న జరిగే పోలింగ్‌లో కారు గుర్తుపై ఓట్లు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలన్నారు. భాజపా నాయకులు అయోధ్యలో రాముడి గుడి కట్టామని ఓట్లు అడుగుతున్నారు.. కేసీఆర్‌ యాదాద్రి కట్టిన విషయాన్ని ఓటర్లు  గుర్తుంచుకోవాలన్నారు. కాసాని జ్ఞానేశ్వర్‌ మాట్లాడుతూ.. మూడు నెలల్లోనే కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. కారు గుర్తుపై ఓట్లేసి గెలిపిస్తే రాజేంద్రనగర్‌ నియోజకవర్గం రూపురేఖలను మారుస్తానన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌ మాట్లాడుతూ..  పదేళ్ల కాలంలో అవసరం రాని గండిపేట్‌, హిమాయత్‌సాగర్‌ జలాలను నేడు విడుదల చేస్తున్నారంటే రేవంత్‌రెడ్డి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో శంషాబాద్‌ మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ కొలన్‌ సుష్మారెడ్డి, భారాస జడ్పీ ఫ్లోర్‌లీడర్‌ నీరటి తన్వీముదిరాజ్‌, కె.చంద్రారెడ్డి, డి.వెంకటేశ్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలాపూర్‌ సమావేశంలో..

మహేశ్వరం నియోజకవర్గానికి మంజూరైన మెడికల్‌ కళాశాలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొడంగల్‌కు తరలించుకపోయారని కేటీఆర్‌ విమర్శించారు. బడంగ్‌పేట కార్పొరేషన్‌ గాంధీనగర్‌లో సోమవారం రాత్రి ఏర్పాటు చేసిన కార్నర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహేశ్వరానికి సబితారెడ్డి కోరిక మేరకు అప్పటి సీఎం కేసీఆర్‌ రూ.170 కోట్లు మంజూరు చేశారని.. ఆ నిధులు విడుదల కాకుండా రేవంత్‌రెడ్డి ఇప్పుడు మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. పరిశ్రమలను కాపాడుకునే సోయి ఈ ప్రభుత్వానికి లేదని, రూ.వెయ్యి కోట్లతో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కార్వింగ్‌ అనే పరిశ్రమ చెన్నైకి తరలివెళ్లిందని, రూ.3700 కోట్లతో కేన్స్‌ టెక్నాలిజీ అనే కంపెనీ కొంగర్‌కలాన్‌లో పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చిందని.. ఈ ప్రభుత్వ తీరుతో అది గుజరాత్‌కు తరలి వెళ్లిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సబితారెడ్డి, నాయకులు పి.కార్తీక్‌రెడ్డి, ఆర్‌.రాంరెడ్డి, ఎస్‌.అర్జున్‌, కామేష్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని