logo

ఆ నాలుగు పార్టీలు నా గెలుపును అడ్డుకోలేవు

‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్‌ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు.

Updated : 07 May 2024 07:33 IST

హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీ లత
ఈనాడు, హైదరాబాద్‌, అబిడ్స్‌, న్యూస్‌టుడే

‘పాతబస్తీలో నివసిస్తున్న ముస్లింలకు తామే రక్షకులమంటూ మజ్లిస్‌ పార్టీ చెప్పుకుంటోంది. వాస్తవానికి ఇక్కడ వెనుకబాటుతనానికి వారే కారణం. ముస్లింల పేర్లు చెప్పుకొని పాతబస్తీలో భూ కబ్జాలు చేస్తున్నారు. చివరికి శ్మశానాలూ వదల్లేదు. ఐదు దశాబ్దాల నుంచి పాతబస్తీలో వేళ్లూనుకున్న ఎంఐఎం పార్టీని ఇంటికి పంపించేస్తా’ అని హైదరాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత అన్నారు. హైదరాబాద్‌ లోక్‌సభ పరిధిలో సమస్యలు, ముస్లిం మైనారిటీల స్థితిగతులు, విద్య, వైద్యం వంటి పలు అంశాలపై ఆమె ‘ఈనాడు’తో మాట్లాడారు.

ముఖ్యాంశాలు

  • చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేలు ఇస్తే.. ఇక్కడ ఒక్కరు కూడా తీసుకోకుండా మజ్లిస్‌ నాయకులు అడ్డుపడ్డారు.
  • ప్రజలకు సేవ చేయడానికి పాతబస్తీకి ఎవరు వెళ్లినా ఆ పార్టీ నాయకులు బురద చల్లుతారు. ముస్లింలంతా ఏకం కావాలంటూ మతతత్వ భావనను వారి మనసుల్లో చొప్పిస్తారు.
  • ఒవైసీ సోదరులు కాకుండా ఎవరైనా విద్యాసంస్థలు, ఆసుపత్రుల ఏర్పాటుకు యత్నిస్తే వాటిని మూసేయిస్తున్నారు.
  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వం చేపడతానని చెప్పింది.. చూద్దాం. కేంద్రం నుంచి సాయం కావాలంటే సహకరిస్తాం.

హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సమస్యలున్నాయి. దీనిపై మీ వైఖరి ఏంటి?

ఈ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో చాలా సమస్యలున్నాయి. హిందూ, ముస్లిం తేడా లేకుండా పేదరికంతో జీవిస్తున్నారు. పేదలు ఇంకా పేదరికంలోకి వెళ్లిపోతున్నారు. విద్య, వైద్యం చాలామందికి అందని ద్రాక్షలా మారింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో చార్మినార్‌ జోన్‌కు ఏటా అత్యధికంగా బడ్జెట్‌ కేటాయిస్తున్నారు. ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నాయ్‌? లెక్క చెప్పండి. ఇక్కడ ఉన్న సమస్యలన్నింటికీ కారణం మజ్లిస్‌ పార్టీ వైఖరే. వారు మాత్రమే ఎదగాలన్న అధికార కాంక్షతో పాతబస్తీ ఇంకా వెనక్కి వెళ్తోంది. ప్రజలు నిత్యం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు.

మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరని భావిస్తున్నారు?

మజ్లిస్‌, కాంగ్రెస్‌, ఎంబీటీ, భారాసలు కలిసి ఒక్కటిగా నన్ను ఓడించేందుకు సిద్ధమయ్యాయి. దేశవ్యాప్తంగా భాజపాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌ మాకు దీటైన అభ్యర్థిని ఎందుకు బరిలో దింపలేదు? నేను పోటీ చేస్తున్నానని తెలిసి ఇన్నాళ్లు ఎడమొహం పెడమొహంగా ఉన్న ఎంబీటీ, ఎంఐఎం పార్టీలు ఈ ఎన్నికల సందర్భంగా ఒక్కటయ్యాయి. అందుకే నాలుగు పార్టీలు కలిసిన మజ్లిస్‌ అభ్యర్థే నాకు ప్రధాన ప్రత్యర్థి.

పాతబస్తీలో ఇరుకు రహదారులు, పారిశుద్ధ్య సమస్యలున్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం నుంచి నిధులేమైనా తెప్పిస్తారా?

మజ్లిస్‌ ఎమ్మెల్యేలు, నాయకులు ప్రజలను గాలికి వదిలేయడం వల్లే పాతబస్తీలో ఇరుకు రహదారులు, నాలాల్లో మురుగునీటి సమస్య ఉంది. ప్రభుత్వ స్థలాలను, చెరువులను మజ్లిస్‌ పార్టీ నాయకులు ఆక్రమించుకుంటే రహదారులు, నాలాల విస్తరణ ఎలా జరుగుతుంది.

మీరు గెలిస్తే ప్రాధామ్యాలు ఏంటి?

రెండు అంశాలకు ప్రాధాన్యం ఇస్తాను. పాతబస్తీలో యువకులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తాం. ఇక్కడ కులమతాలకు అతీతంగా చెప్పులు కుట్టేవారున్నారు. వారందరి కోసం చెప్పుల తయారీ పరిశ్రమలు స్థాపిస్తాం. అత్యంత అద్భుతంగా బంగారు నగలు రూపొందించే కార్మికులున్నారు. అందుకే అక్కడ బంగారు ఆభరణాల తయారీ హబ్‌ను ఏర్పాటు చేస్తాం.

ఈ ఎన్నికల్లో ఏయే అంశాలు గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయి?

హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ అంశాలు, మజ్లిస్‌ పార్టీ మతతత్వ ధోరణి ప్రభావం చూపించనుంది.భాజపా అంటే హిందుత్వ అజెండా అంటూ దుష్ప్రచారం చేస్తారు. అందుకే ఎంఐఎం ప్రజలకు చేసిన అన్యాయాలు, అక్రమాలను వెలికి తీస్తున్నాం. ఇవన్నీ గెలుపోటములపై ప్రభావం చూపిస్తాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని