logo
Updated : 05/12/2021 06:28 IST

శుద్ధ జలానికి దారి లేక... పల్లె జనానికి దాహం కేక! 

వరదలకు దెబ్బతిన్న తాగునీటి పథకాలు
కొట్టుకుపోయిన నీటి సేకరణ బావులు
తాగునీరందించే గొట్టాలు చిన్నాభిన్నం
పునరుద్ధరణకు రూ.12.14 కోట్లు కావాలి

అన్నమయ్య జలాశయం నుంచి రాజంపేట, పుల్లంపేట మండలాల్లో తొలి విడతలో 25 గ్రామాలకు రక్షిత జలాల సరఫరాకు నిర్మించిన పథకమిది. మొన్నటి వరకు 15 గ్రామాల్లోని 10,640 మందికి శుద్ధజలాలు సరఫరా చేశారు. గత నెల 19న అన్నమయ్య జలాశయంలోకి వరద పోటెత్తడంతో మట్టికట్ట తెగిపోయి నీరంతా దిగువకు తరలిపోతోంది. ఫలితంగా గత 15 రోజులుగా నిరుపయోగంగా మారింది. పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే రూ.20 లక్షలకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు.  

గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో రక్షిత మంచి నీటి పథకాలు దెబ్బతిన్నాయి... రక్షిత జలాల సేకరణ ఊట బావులు ధ్వంసమయ్యాయి... గొట్టపుబావుల్లో అమర్చిన మోటార్లు దెబ్బతిన్నాయి.... జళ ప్రళయంతో గొట్టాలు చెల్లాచెదురుగా కొట్టుకుపోయాయి.... విద్యుత్తు నియంత్రికలు, స్తంభాలు కూలిపోయాయి....కరెంటు తీగలు తెగిపోయాయి... తాగునీటి పంపు హౌస్‌లు నేలమట్టమయ్యాయి. ఫలితంగా గత 15 రోజులుగా గ్రామీణ ప్రజలకు శుద్ధ జలాలు సరఫరా కావడంలేదు. నీటిపాలైన పథకాల పునరుద్ధరణకు నిధుల కష్టమొచ్చింది.  గత్యంతరం లేక ప్రజలు స్థానికంగా అందుబాటులో ఉన్న ఉప్పు, జవుకుల నీటిని తాగుతున్న దయనీయ పరిస్థితి నెలకొంది. 

-న్యూస్‌టుడే, కడప, సిద్దవటం జిల్లాలో 25 సామూహిక రక్షిత తాగునీటి పథకాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ.25.09 కోట్లకు అనుమతిచ్చారు. జిల్లా వ్యాప్తంగా 940 పల్లెల్లోని 5,86,356 మందికి రక్షిత జలాలు సరఫరా చేయాల్సి ఉంది. వాస్తవంగా 646 పల్లెలకు తాగునీరందిస్తున్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం సాంకేతిక నిపుణులు పర్వవేక్షిస్తున్నారు. గత నెల 17, 18, 19వ తేదీల్లో భారీ వర్షాలు కురవడంతో పెన్నా, చిత్రావతి, పాపఘ్ని, చెయ్యేరు, గుంజనేరు, సగిలేరు, కుందూ నదులు ఉద్ధృతంగా ప్రవహించాయి. దీంతో నదీతీరాల్లోని 22 సీపీడబ్ల్యూఎస్‌ పథకాలు దెబ్బతిన్నాయి. నీటి సేకరణ బావులు వాలిపోవడంతోపాటు గొట్టాలు నీటిపాలయ్యాయి. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ.1.90 కోట్లు కావాలని అంచనా వేశారు. ప్రస్తుతం రూ.కోటి ఖర్చు చేసేందుకు పరిపాలనామోదం లభించింది. శాశ్వత పనులకు రూ.12.14 కోట్లు అవసరమని అంచనా వేశారు. 

సిద్దవటం మండలంలోని 5,977 మందికి నీరందించే సామూహిక రక్షిత తాగునీటి పథకానికి పెన్నా వరద గాయం తగిలింది. సుమారు 100 మీటర్ల మేర 150 మి.మీ వ్యాసం ఉన్న డీఐ పైపులైను నీటిలో కొట్టుకు పోయింది. దీని పునరుద్ధరణకు రూ.10 లక్షలు కావాలి.   

* ఒంటిమిట్ట మండలం పెన్నపేరూరు, రాచగుడిపల్లె, సాలాబాదు, గంగపేరూరు, ఒంటిమిట్ట పంచాయతీల్లో 29 గ్రామాల్లోని 16,178 మందికి తాగునీరందించే పథకం పెన్నానదిలో మునిగిపోయింది. సోమశిల వెనుక జలాలు పోటెత్తడంతో మూలకు చేరింది.  ప్రత్యామ్నాయంగా నరసన్నగారిపల్లె ఎగువన ఫిల్టర్లు తవ్వించి మోటార్లు, పంపులు, స్టార్టర్లు, పైపులు నూతనంగా ఏర్పాటు చేయాలంటే రూ.80 లక్షల నిధులు అవసరమని అధికారులు నివేదించారు. 
* చింతరాజుపల్లె, మంటపంపల్లె, కోనరాజుపల్లె పంచాయతీల్లోని గ్రామాల ప్రజలకు తాగునీరందించడానికి నందలూరు సమీపంలోని చెయ్యేరు నదిలో ఊటబావి తవ్వించారు. నీలిపల్లి వద్ద పంపుహౌస్‌ నిర్మించగా అది వరద పోటుకు కూలిపోయింది. 
* రాజంపేట మండలం మందపల్లి సమీపంలో చెయ్యేరు నదీతీరంలో నిర్మించిన ఆకేపాడు పథకం పంపుహౌస్‌ జలప్రళయంలో కొట్టుకుపోయింది. దీంతో 41 గ్రామాల్లోని 8,006 మందికి శుద్ధజలం అందడం లేదు. 
* నందలూరు సమీపంలో బాహుదా నది జోరుగా ప్రవహించడంతో హెచ్‌.చెర్లోపల్లి పథకం గొట్టాలు దెబ్బతిన్నాయి. గతేడాది నివర్‌ తుపాను ప్రభావంతో పాడైపోగా చాలా రోజుల విరామం అనంతరం వినియోగంలోకి తీసుకొచ్చేందుకు పనులు చేపట్టారు. తిరిగి వరద పోటెత్తడంతో ధ్వంసమైంది. 
* పెనగలూరు సీపీడబ్ల్యూఎస్‌ పథకం చెయ్యేరు జల హోరులో కలిసిపోయింది. సుమారు కిలోమీటరు మేర 140 ఎం.ఎం హెచ్‌డీపీ గొట్టాలు కనిపించడం లేదు. ఇక్కడే కాకుండా జిల్లాలో చాలా పథకాలు వరదార్పణం కావడంతో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా అందుబాటులో ఉన్న మోటార్ల ద్వారా తాగునీరందిస్తున్నారు. ఇవి కూడా పనిచేయని ప్రాంతంలో ట్యాంకర్లతో తాగునీరు అందిస్తూ దాహార్తి తీరుస్తున్నారు. 

ఒంటిమిట్ట మండలం నరసన్నగారిపల్లె శివారులో పెన్నానది ఒడ్డున దెబ్బతిన్న విద్యుత్తు నియంత్రిక ఇది. గొట్టపు బావుల్లో అమర్చిన మోటార్లు దెబ్బతిన్నాయి. దీంతో ఒంటిమిట్ట, సిద్ద వటం మండలాల్లోని 19 పల్లెల్లోని 16,874 మందికి శుద్ధ జలాలు సరఫరా చేసే పథకం గత రెండు వారాలుగా నిలిచిపోయింది. దీనిని బాగు చేయాలంటే రూ.10 లక్షలు అవసరమని నివేదించారు.  

ప్రతిపాదనలు పంపించాం
జిల్లాలో గత నెలలో కురిసిన భారీ వర్షాలు, వరదలకు 22 సీపీడబ్ల్యూఎస్‌ పథకాలు దెబ్బతిన్నాయి. నీటి సేకరణ బావులు, మోటార్లు, పంపులు, గొట్టాలు, పంపుహౌస్‌లు బాగా దెబ్బతిన్నాయి. వీటి తాత్కాలిక పునరుద్ధరణకు రూ.1.90 కోట్లు అవసరం. ఇప్పటికే ఉన్నతాధికారులు రూ.కోటి నిధులివ్వడంతో మరమ్మతులపై దృష్టిసారించాం. ఎక్కడా కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా స్థానికంగా ఉన్న బోర్ల ద్వారా తాగునీరందిస్తున్నాం. ఆయా ప్రాంతాల్లో ప్రజల అవసరాన్ని బట్టి ట్యాంకర్లతో నీరందిస్తున్నాం.   
- ఎంసీ వీరన్న, బాధ్య ఎస్‌ఈ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం  

Read latest Kadapa News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని