logo

అయిదు నెలలుగా అవస్థలు!

హామీలు అమలు పక్కన పెడితే విధుల నిర్వహణకు అవసరమైన చీపుర్లు, ఇతరత్రా పరికరాలను గత మూడేళ్లుగా అందించడంలేదు. చివరకు ఆరోగ్య భత్యం సైతం గత అయిదు నెలలుగా నిలిపి వేయడం గమనార్హం. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో

Published : 27 May 2022 06:07 IST

పారిశుద్ధ్య కార్మికులకు అందని ఆరోగ్య భత్యం

గత మూడేళ్లుగా సమకూరని శుభ్రత పరికరాలు

దయనీయ పరిస్థితుల్లో విధుల నిర్వహణ

- ఈనాడు డిజిటల్‌, కడప

 

విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు

నగర, పురపాలక సంఘాల్లోని పొరుగుసేవల, ఒప్పంద కార్మికులందరినీ పర్మినెంట్‌ చేస్తాం. సమాన పనికి సమాన వేతనం అందిస్తాం. - ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ

హామీలు అమలు పక్కన పెడితే విధుల నిర్వహణకు అవసరమైన చీపుర్లు, ఇతరత్రా పరికరాలను గత మూడేళ్లుగా అందించడంలేదు. చివరకు ఆరోగ్య భత్యం సైతం గత అయిదు నెలలుగా నిలిపి వేయడం గమనార్హం. కొవిడ్‌ మహమ్మారి విజృంభణ సమయంలో ప్రాణాలకు తెగించి పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఆరోగ్య భత్యం ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2020, ఆగస్టు నుంచి ప్రతినెలా ఆరోగ్య భత్యం కింద రూ.6 వేలు చెల్లిస్తుండగా, ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిగా నిలిపివేసింది. ఆరోగ్యపరంగా ఎదురయ్యే సమస్యల దృష్ట్యా ఖర్చుల నిమిత్తం ఈ మొత్తాన్ని మంజూరు చేస్తుండగా, ప్రస్తుతం నిలిపి వేయడంతో వైద్య ఖర్చులకు చిల్లిగవ్వ లేక పారిశుద్ధ్య కార్మికులు అవస్థలు వైయస్‌ఆర్‌, అన్నమయ్య జిల్లాల్లోని కార్మికులకు మొత్తం రూ.11 కోట్లు చెల్లించాల్సి ఉంది.

వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురంలో 50, పులివెందులలో 140, జమ్మలమడుగులో 170, ప్రొద్దుటూరులో 300, మైదుకూరులో 40, కడపలో 700, బద్వేలులో 73, ఎర్రగుంట్లలో 40, అన్నమయ్య జిల్లా రాయచోటిలో 140 మంది, రాజంపేటలో 90, మదనపల్లెలో 240 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరందరికీ ప్రతి మూడు నెలలకొకసారి శుభ్రత పరికరాలు అందించాల్సి ఉంది. ఒక్కో కార్మికునికి మూడేసి చొప్పున చీపుర్లు ఇవ్వాలి. ప్రస్తుతం కార్మికులే సొంత నిధులతో కొనుగోలు చేసుకుని వాడుతున్నారు. ఆటోలు, రిక్షాల మరమ్మతులకు నిధులివ్వడంలేదు. ప్రతి మూడు నెలలకొకసారి ఇవ్వాల్సిన నూనెలు, సబ్బులు, పాదరక్షలు, టవళ్లు, ఏకరూప దుస్తులు ఇవ్వడంలేదు. వీటన్నింటినీ సొంతంగా కొనుక్కొనే స్తోమత లేకపోవడంతో అనారోగ్యం బారిన పడుతున్నారు. సరఫరా లేకపోవడంతో చేతులకు గ్లౌజులు తొడుక్కునే పరిస్థితి లేకుండా పోయింది. వీరికిచ్చే జీతం రూ.13 వేల వరకే వస్తుండడంతో ఈ మొత్తాన్ని కుటుంబ పోషణ, వైద్యం కోసం వెచ్చించడం భారంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరిని ఉద్యోగులుగా పరిగణిస్తూ అమ్మఒడి, విద్యాదీవన, వసతి దీవెన వంటి సంక్షేమ పథకాలు వర్తింపజేయడంలేదు. వీరికి మొదటి విడతలో మంజూరు కాగా తదుపరి విడతలో నిలిపివేశారు. భవిష్యత్తులో తెల్ల రేషన్‌కార్డులు తొలగిస్తారనే భయం వారిలో నెలకొంది.

ఆప్కోస్‌తో తీవ్ర నష్టం

ఆప్కోస్‌ ప్రవేశించక ముందు గుత్తేదారు సంస్థలతో కార్మికులు పలు ప్రయోజనాలు పొందారు. కార్మికులు మృతిచెందితే వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం కల్పించారు. ఆప్కోస్‌ యజమాని ఎవరో తెలియకపోవడంతో జీతభత్యాలు గురించి అడిగే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో గుత్తేదారుపై ఒత్తిడి తీసుకొచ్చి తమ డిమాండ్లను సాధించుకునేవారు. ప్రస్తుతం ఆప్కోస్‌ జ్ఞతో అన్ని ప్రయోజనాలు కోల్పయినట్లు కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదో నియంతృత్వ సంస్థగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

చీపుర్లు కూడా ఇవ్వలేదంటూ నిరసన తెలుపుతున్న కార్మికులు

అనారోగ్యంతో మరణిస్తున్నారు

ధరలు పెరిగాయి. ఆ మేరకు జీతాలు పెరగడంలేదు. ఆఖరుకు నెలవారీగా చెల్లించే ఆరోగ్య భత్యం రూ.6 వేలు చెల్లించడం నిలిపివేశారు. పారిశుద్ధ్య పనులు చేస్తూ అనారోగ్యం పాలైతే వైద్య ఖర్చులకు నగదు లేక ఇబ్బందులు పడుతున్నాం. పలువురు అనారోగ్యంతో మరణిస్తున్నారు. - తారకరామారావు, కార్మికుడు, ప్రొద్దుటూరు

కార్మికులకు మోసం

ముఖ్యమంత్రి జగన్‌ పారిశుద్ధ్య కార్మికులకు ఎన్నో హామీలిచ్చారు. ఇప్పుడు ఒక్కటి కూడా అమలు కావడంలేదు. నడ్డి విరుస్తూ ఆప్కోస్‌ సంస్థను రంగంలోకి తీసుకొచ్చి వెట్టి చాకిరి చేయించుకుంటున్నారు. చివరకు సంక్షేమ పథకాలను వర్తింపజేయకుండా నిలిపివేశారు. కారుణ్య నియామకాలు చేపట్టకుండా కుటుంబాలను వీధిన పడేస్తున్నారు. - సుంకర రవి, నగర అధ్యక్షుడు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌, ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని