logo

సెస్‌ పోరుకు సన్నాహాలు షురూ

సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్‌) జిల్లాలో అయిదు దశాబ్దాలకు పైగా వినియోగదారులకు సేవలందిస్తోంది. సెస్‌ పాలకవర్గం ఎన్నికలకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది.

Published : 06 Dec 2022 03:18 IST

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల

సిరిసిల్లలోని సెస్‌ ప్రధాన కార్యాలయం

సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్‌) జిల్లాలో అయిదు దశాబ్దాలకు పైగా వినియోగదారులకు సేవలందిస్తోంది. సెస్‌ పాలకవర్గం ఎన్నికలకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. సెస్‌ ప్రస్థానంలో ఈ ఎన్నికలు నాలుగోసారి. గతంలో 11 డైరెక్టర్‌ స్థానాలుండగా ఇటీవల న్యాయస్థానం తీర్పుతో కొత్త మండలాల వారీగా అదనంగా నాలుగు పెంచారు. 2021 ఫిబ్రవరిలోనే పాలకవర్గం పదవీకాలం ముగియడంతో కలెక్టర్‌ పర్సన్‌ ఇన్‌ఛార్జిగా ఏడాది పాటు కొనసాగించారు. తర్వాత ప్రభుత్వం నామినేటెడ్‌ పద్ధతిలో పాలకవర్గాన్ని నియమించింది. ఈ నియామకం సహకార స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ బోయినపల్లి మండలానికి చెందిన ఎనుగుల కనుకయ్య అనే వినియోగదారుడు హైకోర్టును ఆశ్రయించారు. పలుమార్లు వాదనలు జరిగాక నామినేటెడ్‌ పాలకవర్గాన్ని రద్దు చేసి ఎన్నికలు నిర్వహించాలని తీర్పునిచ్చింది. ఈ మేరకు అదనపు రిజిస్ట్రార్‌, రాష్ట్ర సహకార సంఘం ఎన్నికల అథారటీ అధికారిణి సుమిత్రను నియమించింది. వారి నేతృత్వంలో వినియోగదారుల వారీగా ఓటరు జాబితాను ఆధార్‌తో అనుసంధానం ప్రక్రియను పూర్తి చేశారు. సోమవారం ఎన్నికల అధికారిగా రాష్ట్ర సహకార సంఘం డిఫ్యూటీ రిజిస్ట్రార్‌ మమతను నియమించారు. ఈ మేరకు ఆమె ఎన్నికల ఉత్తర్వులను వెలువరిచారు. సిరిసిల్లలోని సెస్‌ ప్రధాన కార్యాలయంలో ఎన్నికల సెల్‌ను ఏర్పాటు చేశారు.

తొలిసారి రిజర్వేషన్లు

సెస్‌ పరిధిలో తొలిసారి రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 15 డైరెక్టర్‌ స్థానాలకు సిరిసిల్ల టౌన్‌-1, వేములవాడ టౌన్‌-1 (మహిళ), బోయినపల్లి (ఎస్సీ), సిరిసిల్ల టౌన్‌-2, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, గంభీరావుపేట, ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, వేములవాడ-2, వేములవాడ గ్రామీణం జనరల్‌కు కేటాయించారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలతో పాటు చొప్పదండి నియోజకవర్గంలో బోయినపల్లి, మానకొండూరు నియోజకవర్గంలో ఇల్లంతకుంట, కొడిమ్యాల మండలం నల్లగొండ, తిప్పాయపల్లి ఉన్నాయి. పార్టీ రహితంగా జరిగే ఈ ఎన్నికలకు బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తులను కేటాయిస్తారు. రహస్య బ్యాలెట్‌ విధానంలో ఎన్నికలు జరుగుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని