logo

ఎండుతున్న పంటలు.. ఆందోళనలో రైతులు

ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా గంగాధర, నారాయణపూర్‌ జలాశయాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది.

Published : 09 Feb 2023 05:24 IST

నారాయణపూర్‌ జలాశయంలో బోసిపోతున్న పంపులు

న్యూస్‌టుడే, గంగాధర: ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా గంగాధర, నారాయణపూర్‌ జలాశయాలతో యాసంగి పంటలు సాగు చేసిన రైతులకు కన్నీరే మిగిలింది. ఇప్పటికే సగం విస్తీర్ణంలో పంటలు సాగు చేయకుండా బీడుగా వదిలేసిన వారు, మిగిలిన పంటనైనా కాపాడుకోవాలని భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. లక్షలాది రూపాయల అప్పులు చేసి బావి లోతు తవ్వుతూ నీటిని అందించేందుకు ఆరాటపడుతున్నారు. మరో వైపు అరకొర సాగునీటితో వేసిన వరిపంటకు మొగిపురుగు, ఇతర తెగుళ్లతో పెట్టుబడులు గుదిబండగా మారాయి. పంట చేతికి రావాలంటే ఇంకెన్ని పాట్లు పడాలోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలంలో తెగిన చెరువు కట్టలు

వర్షాకాలంలో భారీ వరదలకు గంగాధర, నారాయణపూర్‌ చెరువుల కట్టలు తెగిపోగా నీరు లేక ఎడారిని తలపిస్తున్నాయి. రైతుల ఆందోళనతో ప్రభుత్వం రూ.90 లక్షల నిధులు మంజూరు చేయగా నారాయణపూర్‌ చెరువు కట్ట మరమ్మతులు పూర్తి చేశారు. అయితే తమకు రావాల్సిన పరిహారం చెల్లించాకే గంగాధర ఎల్లమ్మ చెరువు కట్ట మరమ్మతులు చేపట్టాలని మంగపేట గ్రామస్థులు పలుసార్లు అధికారులను అడ్డుకున్నారు.

నీరు విడుదల చేస్తేనే..

గడిచిన ఆరేళ్లుగా రెండు పంటలకు ఎల్లంపల్లి నీటిని గంగాధర, నారాయణపూర్‌ చెరువుల ద్వారా వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలకు ఎత్తిపోస్తున్నారు. దాదాపు లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తుండగా ఈ యాసంగిలో విడుదలపై సందిగ్ధంతో సగం విస్తీర్ణంలో పంటలు సాగు చేయకుండా వదిలేశారు. వానాకాలంలో పంటలకు తెగుళ్లతో పెట్టుబడులు భారమై దిగుబడులు అంతంత మాత్రమే వచ్చాయి. యాసంగి పంటలను నమ్ముకున్న రైతాంగానికి జల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. బోయినపల్లి, వేములవాడ వైపు కుడికాలువ పూర్తి కాకపోగా ఎగువ గ్రామాల్లో కేవలం ఆరుతడి పంటలు వేస్తుండగా ఇప్పుడు చెరువులకు గండ్లు పడి ఎడమ కాలువకు కూడా అందించలేని దుస్థితి నెలకొంది. గంగాధర, కొడిమ్యాల, మల్యాల, రామడుగు, చొప్పదండి మండలాల్లో ఈ ప్రాజెక్టు ఆధారంగా దాదాపు 20 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ నెలాఖరుతో ఎండలు ముదరనుండగా బావులు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే నారాయణపూర్‌ జలాశయాన్ని ఆనుకుని ఉన్న పొలాలు బీటలు వారాయి. పశువులకు మేతగా వదిలేశారు. నారాయణపూర్‌ చెరువును ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా నింపి పంటలు కాపాడాలని రైతులు కోరుతున్నారు.


పశువుల మేతకు...

 - పెద్దోళ్ల మల్లయ్య, చర్లపల్లి ఎన్‌

నారాయణపూర్‌ పంపుల పక్కనే అయిదు ఎకరాల్లో పంటలు వేయక బీడుగా వదిలేశా. నాలుగున్నర ఎకరాల్లో వేసిన పంటకు తెగుళ్లు సోకి పెట్టుబడులు భారంగా మారాయి. కూలీకి రూ.500, మందు బస్తాకు రూ.1800, వడ్ల బస్తాకు రూ.1000 పెట్టుబడులు వెచ్చిస్తే పైపులైన్లతో నీరు విడుదల చేయడం లేదు. ఎండిన పొలం పశువులకు మేతకు వదిలేశా. మా కుటుంబానికి వ్యవసాయమే ఆధారం. 


రూ.2 లక్షలతో బావి లోతు తవ్విన..

- గుంటి దేవయ్య

నాలుగున్నర ఎకరాల్లో వరి వేస్తే రెండెకరాలు ఎండిపోతోంది. ఇది పోయినా మరో పంటకైనా నీరు పారించుకోవాలని రూ.2 లక్షలతో బావిని ఆరు గజాల లోతు తవ్విన. రూ.1.50 లక్షల పెట్టుబడులు వెచ్చించిన. ఈ పంటలో రూ.3.50 లక్షల దిగుబడులైతే రావు. ఇప్పటికే పంటకు తెగుళ్లు సోకి రెండుసార్లు మందు పిచికారీ చేశా. పెట్టుబడులు పెరిగిపోగా నీరు లేక దిగుబడులు ప్రశ్నార్థకంగా మారింది. ఎల్లంపల్లి నీరు విడుదల చేసి పంటలు కాపాడాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు