logo

పోస్టల్‌ ఓట్లు..అభ్యర్థుల పాట్లు

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు.

Published : 03 May 2024 03:28 IST

రేపటి నుంచి ఓటింగ్‌కు అవకాశం

పెద్దపల్లి రిటర్నింగ్‌ కార్యాలయంలో తపాలా ఓటు వేయడానికి చేసిన ఏర్పాటు

ఈనాడు, కరీంనగర్‌: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల కోసం అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. ఓ వైపు సాధారణ ఓటర్ల మద్దతును కూడగట్టేందుకు ప్రచారాన్ని సాగిస్తూనే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులపై దృష్టి పెట్టారు. తెలిసిన వారికి పదే పదే మరోమారు తమకు ఓటు వేయాలని విన్నపాలు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టేలా చేస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాలతో 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఉద్యోగులు, సిబ్బందికి ఓటు వేసే అవకాశాన్ని జిల్లా ఎన్నికల అధికారులు కల్పించారు. ఫారం-12 తీసుకుని దరఖాస్తు చేసుకున్న వారికి ఈ అవకాశాన్ని అందిస్తున్నారు. శుక్రవారం అత్యవసర సేవల్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తుండగా.. శనివారం నుంచి మాత్రం ఉద్యోగులు వారి ఓటు ఉన్న నియోజకవర్గ పరిధిలో ఓటు వేసే వెసులుబాటు కల్పించారు. ఇలా కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 18 వేల మంది పోలింగ్‌ సిబ్బందితోపాటు మరో 8 వేల మంది పోలీసులు ముందే ఓటెయ్యబోతున్నారు. ఇందులో చాలామంది ఇక్కడి నియోజకవర్గాల్లో ఓటు హక్కు లేకపోవడంతో ఓటింగ్‌ పట్ల ఆసక్తిని చూపించడం లేదు. కొందరు ఉన్న చోటకు వెళ్లి ఈ అవకాశాన్ని వినియోగించుకోనున్నారు.

శాసనసభ నియోజకవర్గాల వారీగా..

ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునేందుకు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరీంనగర్‌, నిజామాబాద్‌లలో ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఇక్కడ మూడు, నాలుగు కేంద్రాలను అందుబాటులో ఉంచారు. రహస్య ఓటింగ్‌కు వీలుగా ఏర్పాట్లను పూర్తి చేశారు. ఇక గత లోక్‌సభ ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో దాదాపు 52 శాతం వరకు చెల్లకుండా పోయాయి. ఈసారైనా సరైన విధానంలో ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా ఉద్యోగులు పోస్టల్‌ ఓటు విషయంలోనూ అనుకున్న విధంగా పోలింగ్‌ శాతం పెరగడం లేదు.  

వృద్ధుల కోసం ఇళ్ల వద్దకు...

పీడబ్ల్యూడీ (పర్సన్స్‌ విత్‌ డిసేబుల్‌), సీనియర్‌ సిటిజన్లకు సంబంధించి ఓటు నమోదు కోసం శుక్రవారం నుంచి అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఎన్నికల ప్రిసైడింగ్‌ అధికారి పర్యవేక్షణలో వీడియోగ్రాఫర్‌ సహా ఓ పర్యవేక్షకుడు ఇతర సిబ్బంది అన్ని పోలింగ్‌ బూత్‌ల పరిధిలో దరఖాస్తు చేసుకున్న వారి ఓటు హక్కు రహస్యంగా వినియోగించుకునేలా చర్యలు చేపట్టనున్నారు. 85 ఏళ్లు పైబడిన వృద్ధులతోపాటు కదలని స్థితిలో ఉండి పోలింగ్‌ కేంద్రానికి రాని వారు ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో 700 నుంచి వెయ్యి మంది వరకు ఈ విధానంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు..

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని