logo

ఓటు ఘనం.. పోటీ నామమాత్రం

చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది.

Updated : 03 May 2024 05:49 IST

లోక్‌సభ ఎన్నికల్లో అంతంతే ప్రాతినిధ్యం
ఈసారి ఆరుగురే మహిళా అభ్యర్థులు

ఈనాడు, కరీంనగర్‌, న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగాల్సిన సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే నారీమణుల సంఖ్య తగ్గుతోంది. ఓవైపు నారీ శక్తి అభియాన్‌ కింద భవిష్యత్తులో పాలనలో అతివల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఆ దిశగా అడుగులు పడలేదు. కొందరు నామమాత్రంగా నామినేషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. మూడు లోక్‌సభ స్థానాల పరిధిలో ప్రధాన పార్టీల తరఫున మహిళా అభ్యర్థులే లేరు. ఓటర్ల పరంగా దాదాపు 52 శాతం ఉన్న వీరికి పోటీపరంగా మాత్రం ప్రాధాన్యం తగ్గడం గమనార్హం.

1.52 లక్షల మంది అధికం

కరీంనగర్‌, పెద్దపల్లి, నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాల పరిధిలో మహిళా ఓటర్లే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. మూడు నియోజకవర్గాల పరిధిలో 24.61 లక్షల మంది పురుషులు, 26.13 లక్షల మంది మహిళలు ఉన్నారు. పురుషుల కంటే దాదాపు 1.52 లక్షల మంది అతివలు ఎక్కువగా ఉన్నారు.  ఓటేయడంలోనూ వీరే ముందుంటున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో నామినేషన్‌ వేసిన వారిలో విద్యావంతులే అధికంగా ఉండటం విశేషం. తమ ప్రాబల్యాన్ని చూపాలనే తపనతో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా, మరికొందరు రిజిస్టర్డు పార్టీల తరఫున బరిలో దిగడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఎంపీలుగా ఆ ఇద్దరే!

సుగుణకుమారి, కవిత

కరీంనగర్‌లో 1952 నుంచి నాలుగు ద్విసభ్య ఎన్నికలు, 16 సాధారణ ఎన్నికలతో కలిసి ఇప్పటివరకు 20 సార్లు ఎన్నికలు నిర్వహించగా  ఒక్క మహిళ కూడా ఎన్నికవలేదు. 1952లో టీఎన్‌ సదాలక్ష్మి(కాంగ్రెస్‌) పోటీ చేసి ఓడిపోయారు. పెద్దపల్లి నుంచి 1998లో తొలిసారిగా తెదేపా నుంచి బరిలోకి దిగిన చెలిమెల సుగుణకుమారి రాజకీయ కురువృద్ధుడు వెంకటస్వామిపై విజయం సాధించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎంపీగా ఆమె గుర్తింపు పొందారు. 1999లో వెంకటస్వామిపై రెండోసారి గెలుపొందారు. 2014లో నిజామాబాద్‌ స్థానంలో కల్వకుంట కవిత(తెరాస) పోటీ చేసి మధుయాస్కీగౌడ్‌ (కాంగ్రెస్‌)పై జయకేతనం ఎగురవేశారు. 2019లో ఆమె రెండోసారి పోటీ చేసి ఓటమి చవిచూశారు.

అడుగేస్తేనే కదా తెలిసేది

ఇప్పటికే స్థానిక సంస్థల్లో ఉమ్మడి జిల్లాలో 50 శాతానికి పైగా మహిళా భాగస్వామ్యం ఉంది. క్షేత్ర స్థాయి ప్రజాప్రతినిధులుగా వారే ముఖ్య భూమికను పోషిస్తున్నారు. 2029 నాటికి ‘నారీ శక్తి వందన్‌ అధినియమ్‌’ ద్వారా 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా బిల్లు కల సాకారమై, మహిళా ప్రజాప్రతినిధుల సంఖ్య పెరగనుంది. రాష్ట్రంలోని 17 లోక్‌సభ నియోజకవర్గాల్లో కచ్చితంగా ఏడు చోట్ల అతివలకే అవకాశం రానుంది. ఇప్పటి నుంచే నారీమణుల్లో నాయకత్వ పటిమ పెరిగితే వచ్చే అయిదేళ్ల నాటికి ఎన్నికల్లో పోటీకి అనుకూలంగా ఉంటుంది.


తేనీరు తయారు.. ఆదరించాలి మీరు

పెద్దపల్లి భాజపా అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌ గురువారం కమాన్‌పూర్‌లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ హోటల్‌లో టీ కాచి స్థానికులను ఆకట్టుకున్నారు.
-న్యూస్‌టుడే, కమాన్‌పూర్‌


నీ భవితకు నాదీ హామీ

కరీంనగర్‌ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ గురువారం తిమ్మాపూర్‌ మండలంలో ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మన్నెంపల్లిలో బాలుడితో ముచ్చటిస్తూ నడుస్తున్న దృశ్యమిది.

న్యూస్‌టుడే, తిమ్మాపూర్‌


అక్కలారా.. ఇదీ అభయ హస్తం

కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావుకు మద్దతుగా మంత్రి ప్రభాకర్‌ గురువారం జమ్మికుంట మండలంలో ప్రచారం చేశారు. కొత్తపల్లి-ధర్మారం రహదారిపై ట్రాలీ ఆటోలో వెళ్తున్న మహిళా కూలీలతో మాట్లాడారు.

న్యూస్‌టుడే, జమ్మికుంట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని