logo

ఇదీ అన్నదాత ఎజెండా!

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

Published : 20 Apr 2024 04:55 IST

భిన్న వ్యవసాయోత్పత్తులే నిజామాబాద్‌ ప్రత్యేకత
సమస్యల పరిష్కారంతోనే సాగుకు దన్ను

పసుపు పైరు

న్యూస్‌టుడే, జగిత్యాల వ్యవసాయం: నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం వ్యవసాయపరంగా అభివృద్ధి చెందిన ప్రాంతం. భిన్న వ్యవసాయ ఉత్పత్తులతో రాష్ట్రంలోనే ప్రత్యేకత చాటుకుంటోంది. దేశ విదేశాలకు ఎగుమతి చేసే పసుపు, మామిడి, మొక్కజొన్న, సన్న వరి, చెరకు, ఆవాలు, ఎర్రజొన్న, తెల్లజొన్న, సజ్జ తదితర పంటల దిగుబడిలో ఆదర్శంగా నిలుస్తున్నా అన్నదాతను సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. నిజామాబాద్‌ అర్బన్‌ మినహా అన్ని సెగ్మెంట్లలో రైతుల సంఖ్యే అధికం.

65 శాతం వ్యవసాయదారులే!

లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూర్‌, బోధన్‌, నిజామాబాద్‌ అర్బన్‌, నిజామాబాద్‌ రూరల్‌, బాల్కొండ ఉండగా, జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల ఉన్నాయి. అన్ని చోట్లా కలిపి మొత్తం 5.91 లక్షల మంది రైతులున్నారు. ఓటర్లలో దాదాపు 65 శాతం మంది రైతు, వ్యవసాయాధారిత కుటుంబాల వారే ఉంటారు.

ఎగుమతి అవకాశాలు పెంచితేనే మేలు

  • దేశంలోనే అత్యధికంగా నిజామాబాద్‌ పరిధిలో 75 వేల ఎకరాల్లో పసుపు సాగవుతోంది. మద్దతు ధర కల్పన, పసుపు బోర్డు ఏర్పాటు కోరుతూ 2019 ఎన్నికల్లో 176 మంది రైతులు పోటీ చేశారు.
  • పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించినా కార్యాచరణ చేపట్టలేదు. పడిగెల్‌ వద్ద తలపెట్టిన సుగంధద్రవ్యాల పార్కు నిర్మాణాన్ని పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
  • గోదావరి నీటి లభ్యతతో వరి సాగు విస్తీర్ణం 7 లక్షల ఎకరాలకు పెరిగింది. ఇక్కడి సన్న ధాన్యం మరాడించేందుకు మిల్లుల ఏర్పాటు, దేశ విదేశాలకు బియ్యం ఎగుమతికి కేంద్రం చొరవ చూపాలని అన్నదాతలు విన్నవిస్తున్నారు.
  • జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ఆర్మూర్‌ మీదుగా నిజామాబాద్‌కు రైల్వే లైను పూర్తయినందున పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేసేలా వ్యాగన్ల సదుపాయంతో పాటు పట్టణాల్లో రసాయన ఎరువుల స్టాక్‌పాయింట్లు ఏర్పాట్లు చేయాలని రైతులు కోరుతున్నారు.
  • దాదాపు 67 వేల హెక్టార్లలో మామిడి తోటలుండగా కాయల ఎగుమతికి అపెడ, కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డుల ద్వారా అవకాశాలను కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
  • ఎర్రజొన్నలు, తెల్లజొన్నలు, ఆవాలు, సంకర వరి విత్తనోత్పత్తిలో తాము మోసపోకుండా కంపెనీలు, ఉత్పత్తిదారుల మధ్య కేంద్రం అనుసంధానకర్తగా వ్యవహరించాలని రైతులు కోరుతున్నారు.
  • బోధన్‌, ముత్యంపేట చక్కెర కర్మాగారాల పునరుద్ధరణతో చెరకు రైతులకు పూర్తి స్థాయి భరోసా కలుగుతుంది. మొక్కజొన్న, సోయాబీన్‌ తదితర పంట ఉత్పత్తుల ఆధారంగా ఆహారశుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేయాలని విన్నవిస్తున్నారు.

పరిశోధనల విస్తరణే కీలకం

అంకాపూర్‌, అంక్సాపూర్‌, పడిగెల్‌, లక్ష్మీపూర్‌ తదితర 20 గ్రామాలు సాగుపరంగా రాష్ట్రంలోనే ముందువరుసలో ఉంటున్నాయి. ఎఫ్‌పీవోలతో పాటు సంఘటితంగా ముందుకు సాగుతున్న గ్రామాలకు పీకేవీవై, ఆర్‌కేవీవై పథకాల సామూహిక వర్తింపు, ఐసీఏఆర్‌, మేనేజ్‌ తదితర సంస్థల ద్వారా పరిశోధనలపరంగా సహకారాన్ని విస్తరించాలని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు.

పూడిక తొలగింపుతోనే పునరుజ్జీవం

రాష్ట్రంలోనే రెండవ పెద్ద ప్రాజెక్టు శ్రీరాంసాగర్‌. ఆరు నియోజకవర్గాలను ఆనుకొని గోదావరి ప్రవహిస్తోంది. నిజాంసాగర్‌, ఆలీసాగర్‌, గుత్ప ఎత్తిపోతలు, చౌట్‌పల్లి హన్మంతరెడ్డి ఎత్తిపోతలు, గంగనాల, రోళ్లవాగు, రాళ్లవాగు తదితర పథకాల ద్వారా 2.69 లక్షల హెక్టార్లకు సాగు నీరందుతోంది. రూ.1,950 కోట్లతో ఎస్సారెస్సీ పునరుజ్జీవ పథకాన్ని చేపట్టగా జలాశయంలో నిండిన పూడికను తొలగించి నీటి నిల్వను 112 టీఎంసీలకు పెంచేలా కేంద్రం సహకరించాల్సి ఉంది. మంజీర, గోదావరి నదులపై తలపెట్టిన చిన్నతరహా ప్రాజెక్టులు, ఎత్తిపోతలను పూర్తి చేస్తే సాగు రంగానికి మరింత ఊతమిస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

రెండు స్థానాలు.. నాలుగు సార్లు

ఒకే నాయకుడు నియోజకవర్గాలు మారినా విజయం వరించింది. ఉమ్మడి జిల్లాలోని రెండు స్థానాల నుంచి నాలుగు సార్లు గెలుపొందడం ద్వారా ఆయన అరుదైన ఘనత సాధించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన నాలుగు ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి రెండేసి సార్లు ఎంపీగా ఎం.ఆర్‌.కృష్ణ విజయం సాధించారు. పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గంతో పాటు కరీంనగర్‌ జనరల్‌ స్థానాల నుంచి ఆయన ఎంపీగా ఎన్నికయ్యారు. కరీంనగర్‌ ద్విసభ్య నియోజకవర్గం నుంచి 1952లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి టి.ఎన్‌.సదాలక్ష్మిపై గెలుపొందారు. 1957లో సీఎస్‌ఎఫ్‌ పార్టీ తరఫున నిలబడి పీడీఎఫ్‌ అభ్యర్థి పి.ఎల్‌.దాస్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. పెద్దపల్లి నుంచి 1962లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి పళనివేలుపై విజయం సాధించారు. 1967 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచిన ఎం.ఆర్‌.కృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పళనివేలుపై మరోసారి గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో 1952 నుంచి 1967 వరకు వరుసగా నాలుగు సార్లు జరిగిన ఎన్నికల్లో కరీంనగర్‌, పెద్దపల్లి స్థానాల నుంచి పోటీ చేసిన ఎం.ఆర్‌.కృష్ణ విజయం సాధించి తొలితరం రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. 1971లో పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఎం.ఆర్‌.కృష్ణ, టీపీఎఫ్‌ అభ్యర్థి వి.తులసీరాం చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో ఎక్కడా పోటీ చేయలేదు.

న్యూస్‌టుడే, గోదావరిఖని

అక్కడా.. ఇక్కడా హ్యాట్రిక్‌!

ఎన్నికల్లో గెలుపొందిన వారిలో కొందరు మాత్రమే అరుదైన రికార్డును సొంతం చేసుకుంటారు. పెద్దపల్లి లోక్‌సభ స్థానం నుంచి నాలుగు పర్యాయాలు విజయం సాధించిన గడ్డం వెంకటస్వామి(కాకా) కూడా అనితర సాధ్యమైన రికార్డును సాధించారు. పెద్దపల్లి, సిద్దిపేట లోక్‌సభ నియోజకవర్గాల్లో హ్యాట్రిక్‌ విజేతగా గుర్తింపు పొందారు. సిద్దిపేట నుంచి 1967, 1977లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా, 1971లో తెలంగాణ ప్రజా సమితి అభ్యర్థిగా గెలుపొందారు. పెద్దపల్లి నుంచి 1989, 1991, 1996లలో వరుసగా గెలిచి హ్యాట్రిక్‌ అందుకోగా 2004లో మరోసారి గెలిచి మొత్తమ్మీద ఏడు పర్యాయాలు రాష్ట్రం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1967లో పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ సభ్యుడిగా, 1973లో కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ మంత్రిగా పని చేశారు. 1978 నుంచి 1982 వరకు కార్మిక, సివిల్‌ సప్లయి మంత్రిగా వ్యవహరించారు. 1993లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, 1995లో టెక్స్‌టైల్స్‌, 1996లో కార్మిక శాఖ మంత్రిగా పని చేశారు. అనంతరం 2009 వరకు లోక్‌సభా ఉప నాయకుడిగా వ్యవహరించారు.

న్యూస్‌టుడే, పెద్దపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని