logo

పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు

వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు.

Updated : 25 Apr 2024 06:35 IST

జిల్లాలో 84,710 మందికే విద్యుత్తు జీరో బిల్లులు

న్యూస్‌టుడే, సిరిసిల్ల కలెక్టరేట్‌: వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. ప్రతి నెలా 15 లోపు సెస్‌ సిబ్బంది మీటర్‌ రీడింగ్‌ నమోదు చేసి జీరో బిల్లులతో పాటు ఇతర బిల్లులను జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి నెల బిల్లులను సెస్‌ అధికారులు జారీ చేశారు. సెస్‌ అధికారులు సేకరించిన వివరాల ప్రకారం ప్రజాపాలనలో గృహజ్యోతి పథకానికి దరఖాస్తు చేసుకున్నవారు 89,749 మంది ఉన్నారు. జీరో బిల్లుల జారీ పూర్తయిన రోజు నాటికి 87,703 మంది అర్హులుగా గుర్తించారు. వీరందరికీ ఫిబ్రవరి నెలకు సంబంధించిన జీరో బిల్లులు జారీ చేశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఆన్‌లైన్‌లో తప్పుల నమోదు కారణంగా కొందరికి జీరో బిల్లులు రాలేదు. దీంతో మున్సిపల్‌, మండల కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో సమగ్ర వివరాలతో దరఖాస్తు చేసుకోవడంతో వాటిని సరి చేశారు. దీంతో మార్చిలో మరో 1,949 మంది అర్హులుగా తేలారు. దీంతో వినియోగదారుల సంఖ్య పెరిగింది. వీరందరికీ ఫిబ్రవరితో పాటు మార్చి నెల జీరో బిల్లులను అందజేశారు.

వేసవి ఎండల ప్రభావంతో...

గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల లోపు విద్యుత్తు  వినియోగించిన వినియోగదారులను మాత్రమే లబ్ధిదారులుగా గుర్తిస్తారు. ప్రస్తుతం రోజు రోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతతో విద్యుత్తు  వినియోగం పెరిగింది. దీంతో చాలా మంది వినియోగదారులు మార్చి నెలలో గృహజ్యోతి పథకానికి అనర్హులుగా మారారు. మార్చి నెలలో మొత్తం 89,652 మంది గృహజ్యోతికి అర్హత సాధించగా, వారిలో 84,710 మందికి మాత్రమే జీరో బిల్లులు వచ్చాయి. మిగతా 4,942 మంది అర్హతను కోల్పోయారు. ఎండ తీవ్రతతో విద్యుత్‌ వినియోగం పెరగడంతో వీరంతా 200 యూనిట్లకు పైగా విద్యుత్తు  వాడారు. దీంతో వీరు మార్చి నెల బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. మళ్లీ ఎప్పుడైతే వీరు 200 యూనిట్ల లోపు విద్యుత్తు  వినియోగిస్తారో అప్పుడు మళ్లీ గృహజ్యోతికి అర్హులుగా గుర్తిస్తారు. మార్చిలో గృహజ్యోతికి సబ్సిడీ రూ.3,09,83,820లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరిలో రూ.2,90,77,737 చెల్లించగా, మార్చిలో రూ.19,06,820 పెరిగింది. ఎండల తీవ్రత పెరిగితే లబ్ధిదారుల సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఆన్‌లైన్‌ బిల్లుల చెల్లింపులో ఇబ్బందులు

సెస్‌ పరిధిలో జరగాల్సిన విద్యుత్తు  వినియోగదారుల బిల్లింగ్‌ను ఈఆర్‌సీ ఉత్తర్వుల మేరకు మార్చి నుంచి ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో ఎనర్జీ బిల్లింగ్‌ సిస్టం ద్వారా నిర్వహిస్తున్నారు. దీంతో ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలో సెస్‌ సంస్థలో నిర్వహిస్తున్న బిల్లింగ్‌ను ఎక్కడ నుంచైనా చూడవచ్చు. గతంలో సెస్‌ పరిధిలో బిల్లింగ్‌ నిర్వహించడంతో ఆన్‌లైన్‌ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తే అవి ఇక్కడి సర్వర్‌లో బిల్లులు చెల్లించినట్లు చూపించి మైనస్‌ అయ్యేవి. ప్రస్తుతం ఫిబ్రవరి నుంచి ఆన్‌లైన్‌ విధానం లేకపోవడంతో కొందరు వినియోగదారులు తెలియక ఆన్‌లైన్‌లో చెల్లించాలనే ఉద్దేశంతో వారి బిల్లు రసీదులోని యూఎన్‌వో నంబర్‌ను నమోదు చేయడంతో ఎన్‌పీడీసీఎల్‌లో బిల్లులు చూపించాయి. వాటిని వినియోగదారులు చెల్లించడంతో అవి ఎన్‌పీడీసీఎల్‌ ఖాతాలో జమ అవుతున్నాయి. సెస్‌ పరిధిలో ఆన్‌లైన్‌ లాగిన్‌లో బిల్లు చెల్లించినట్లు చూపకపోవడంతో మార్చి నెల బిల్లులో గత నెల చెల్లించలేనట్లు చూపి బిల్లులను జరిమానాతో అందజేశారు. అయితే ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించిన వినియోగదారుల వివరాలను ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు సెస్‌ కార్యాలయానికి పంపిస్తున్నారని, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సెస్‌ అధికారులు చెబుతున్నారు.

వారం రోజుల్లో ఏర్పాటు

సెస్‌ వినియోగదారులు గూగుల్‌ పే, ఫోన్‌పే ద్వారా ఆన్‌లైన్‌లో బిల్లులు చెల్లించడానికి వారం రోజుల్లో ఏర్పాట్లు చేస్తాం. గతంలో ఆన్‌లైన్‌లో కొందరు వినియోగదారులు తెలియక చెల్లించిన బిల్లులను ఎన్‌పీడీసీఎల్‌ నుంచి తిరిగి రప్పించి వాటిని సరిచేస్తాం. వినియోగదారులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దు.

సూర్యచంద్రరావు, సెస్‌ ఎండీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు