logo

భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్‌.. ఆమె భర్తపై కేసు

కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు.

Updated : 25 Apr 2024 06:36 IST

నిందితుల్లో నాయకుడు కొత్త జయపాల్‌రెడ్డి
సహకరించిన నగరపాలక సిబ్బంది అరెస్ట్‌

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే : కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. కరీంనగర్‌ రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ కథనం ప్రకారం.. కరీంనగర్‌ బ్యాంక్‌ కాలనీకి చెందిన దొమ్మటి యుగేందర్‌ 2020లో రేకుర్తిలో 711 చదరపు గజాల స్థలాన్ని ప్రతిభ అనే మహిళ నుంచి కొనుగోలు చేశారు. ఆ భూమిలో రేకుల షెడ్డు వేసుకొని నగరపాలక సంస్థ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మ్యుటేషన్‌ ప్రకియలో ఉండగా 2021 మార్చి 17న 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ భర్త సుదగోని కృష్ణగౌడ్‌తోపాటు ఆయన అనుచరులు యుగేందర్‌ను పిలిచి ఆ భూమి తమ అధీనంలో ఉందని బెదిరించారు. రూ.2 లక్షలు ఇవ్వాలన్నారు. ఆయన డబ్బు ఇవ్వకపోవడంతో మరుసటి రోజు షెడ్డును కూల్చివేశారు. దాంతో యుగేందర్‌ కృష్ణగౌడ్‌ వద్దకు వెళ్లి రూ.1.50 లక్షలు ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి అనుమతి ఇప్పిస్తానని, ప్రస్తుతం కొనుగోలు చేసిన భూమి రేవోజు లక్ష్మీరాజంది అని ఆయన నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవలసి ఉంటుందని చెప్పిన కృష్ణగౌడ్‌ గ్రామ పంచాయతీ హయాంలోది ఇంటి నంబర్‌, మున్సిపల్‌ కార్యాలయంలో మ్యుటేషన్‌ చేసిన ఆస్తి పన్ను పత్రాన్ని ఇచ్చారు. కొన్ని రోజులకు యుగేందర్‌ తన స్థలంలో బేస్‌మేట్ కట్టేందుకు ప్రయత్నించగా కృష్ణగౌడ్‌, ఫిరోజ్‌ఖాన్‌లు వచ్చి అడ్డుకున్నారు. అక్కడ మొత్తం ఎకరం భూమి కృష్ణగౌడ్‌, రేవోజు లక్ష్మీరాజంకు చెందినదని కరీంనగర్‌కు చెందిన నాయకుడు కొత్త జయపాల్‌రెడ్డి రూ.1.20 కోట్లకు కొనుగోలుకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. జయపాల్‌రెడ్డి అనుచరుడు గుర్రం రాజిరెడ్డి పేరిట భూమి ఉందని, ఆ స్థలం కావాలంటే రూ.5 లక్షలు చెల్లించాలన్నారు. దాంతో యుగేందర్‌ వారికి రూ.5 లక్షలు చెల్లించారు. వారు ఇచ్చిన జిరాక్స్‌ పత్రాలు పరిశీలించగా రేవోజు లక్ష్మీరాజం పేరిట ఉంది నకిలీ పట్టా అని గుర్తించి మోసపోయినట్లు గ్రహించారు. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా వారు స్పందింకపోవడంతో బాధితుడు కోర్టులో పిటిషన్‌ వేయగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ వచ్చింది. దీంతో కృష్ణగౌడ్‌, కొత్త జయపాల్‌రెడ్డిలు 18వ డివిజన్‌ కార్పొరేటర్‌ సుధగోని మాధవి ద్వారా మున్సిపల్‌ కార్యాలయంలో దరఖాస్తు ఇప్పించి ఇంటి నంబర్‌ రద్దు చేయించారు. ఆ స్థలంలో ఎలాంటి గృహాలు లేకున్నా మున్సిపల్‌లో ఆర్‌ఐగా పని చేస్తున్న శ్రీకాంత్‌, బిల్‌ కలెక్టర్‌ కొత్తపల్లి రాజు ఎకరం భూమిలో షెడ్లు ఉన్నట్లు చూపించి రెవోజి లక్ష్మీరాజంకు అనుకూలంగా నివేదిక ఇచ్చి మున్సిపల్‌ నుంచి 14 ఇంటి నంబర్లు లక్ష్మీరాజం, కృష్ణగౌడ్‌, కొత్త జయపాల్‌రెడ్డి అనుచరులతోపాటు మరికొందరికి కేటాయించారు. ఈ పత్రాలతో రేవోజీ లక్ష్మీరాజం అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేశారు. ఇందులో లక్ష్మీరాజం కుమారులైన పరిపూర్ణచారి, రాఘవాచారి తప్పుడు సాక్షి సంతకాలు చేశారని బాధితుడు కొత్తపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రేకుర్తికి చెందిన మహమ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌, గట్టుబుత్కూర్‌కు చెందిన కాంపెల్లి రామాంజనేయులు, మున్సిపల్‌ ఆర్‌ఐ జంకే శ్రీకాంత్‌, సీతారాంపూర్‌కు చెందిన బిల్‌ కలెక్టర్‌ కొత్తపల్లి రాజులను బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు సీఐ తెలిపారు. ఇదే కేసులో రేవోజు లక్ష్మీరాజం, సుధగోని కృష్ణగౌడ్‌, కొత్త జయపాల్‌రెడ్డి, కార్పొరేటర్‌ సుధగోని మాధవి, గుడి రమణారెడ్డి, గుర్రం రాజిరెడ్డి, రేవోజు పరిపూర్ణచారి, రేవోజు రాఘవచారిలపై కేసు నమోదు చేశారు.

మాజీ సర్పంచి, పూర్వ కార్యదర్శిపై...

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే : సరైన పత్రాలు లేకున్నా ఇంటి నంబర్లు కేటాయించారని బొమ్మకల్‌ మాజీ సర్పంచి పురమల్ల శ్రీనివాస్‌, పూర్వ కార్యదర్శి వాజిద్‌లపై జిల్లా పంచాయితీ శాఖ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైనట్లు రూరల్‌ సీఐ ప్రదీప్‌కుమార్‌ తెలిపారు. 2016లో సర్పంచి శ్రీనివాస్‌, గ్రామ కార్యదర్శి వాజిద్‌ సహకారంతో బొమ్మకల్‌ గ్రామ పంచాయితీ పరిధిలో సరైన పత్రాలు లేకున్నా ఇంటి నంబర్లు కేటాయించారని పేర్కొంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు