logo

కేంద్రంలో కాంగ్రెస్‌కు అధికారం అసాధ్యం

లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు.

Published : 04 May 2024 04:37 IST

హుజూరాబాద్‌ గ్రామీణం, పట్టణం, న్యూస్‌టుడే:  లోక్‌సభలో కాంగ్రెస్‌ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదానే లేదని, ప్రస్తుతం 300 సీట్లలోకూడా పోటీ చేయని పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం అసాధ్యమని భాజపా ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. శుక్రవారం రాత్రి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లోని బృందావన్‌ చౌరస్తాలో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రికి రేవంత్‌రెడ్డి తన పదవి పోతుందనే భయంతోనే ప్రధాని మోదీని తిడుతున్నారని దుయ్యబట్టారు. రిజర్వేషన్ల అమలుకు భాజపా వ్యతిరేకం కాదని, కేవలం మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే వ్యతిరేకమన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ డబ్బులతో కరీంనగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఓట్లను కొనుగోలు చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రూ.12 వేల కోట్లతో పార్లమెంటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని వెల్లడించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి రాజేందర్‌రావును ఆ పార్టీ నేతలే గుర్తు పట్టడం లేదన్నారు. మోదీ ప్రధానిగా లేని దేశాన్ని ఊహించుకోలేమని పేర్కొన్నారు. పదేళ్ల పాలనలో రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్లు ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. కరీంనగర్‌లో భాజపా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన శక్తి సమ్మేళనం కార్యక్రమంలోనూ బండి సంజయ్‌ మాట్లాడారు. నిరుద్యోగుల కోసం కొట్లాడితే పేపర్‌ లీక్‌ చేశారని తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. దయచేసి పది రోజులు నాకోసం కష్టపడండి.. అయిదేళ్లు మీకోసం కష్టపడతా అని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నాయకులు గౌతంరెడ్డి, రాజు, సంపత్‌రావు, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్‌, సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని