logo

బియ్యం అమ్మకాల్లో గోల్‌మాల్‌

సన్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు.

Published : 04 May 2024 04:49 IST

తక్కువ తూకంతో విక్రయం
బ్రాండ్‌ల పేరుతో మాయ
న్యూస్‌టుడే, హుజూరాబాద్‌

న్న బియ్యం ధరలు బహిరంగ మార్కెట్‌లో పరుగులు పెడుతున్నాయి. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్య, మధ్య తరగతి, పేద ప్రజలకు భారంగా మారింది. మరోవైపు తక్కువ తూకంతో వినియోగదారులకు బియ్యం విక్రయిస్తూ కొత్త అక్రమానికి వ్యాపారులు తెరలేపారు. బియ్యం ప్యాకింగ్‌ అనుమతులు లేకుండా విక్రయిస్తూ తూకంలో మోసం చేస్తూ ప్రజలను నష్టపరిచి వ్యాపారులు లబ్ధి పొందుతున్నారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వెలిసిన రైస్‌డిపోలపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా వినియోగదారుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని బియ్యం అమ్మకాల్లో వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

అనుమతులు ఏవి..

రైస్‌డిపోల ఏర్పాటుకు ప్యాకేజ్డ్‌ కమోడిటిస్‌ యాక్టు కింద తప్పనిసరిగా తూనికలు, కొలతల శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. బియ్యం సంచులపై బ్రాండ్‌ పేరు, ఎన్ని కిలోలు, ఎంఆర్‌పీ, తయారీ సంస్థ, చిరునామా, ప్యాకింగ్‌ తేదీ, చరవాణి నంబరు తదితర వివరాలు తప్పనిసరిగా ముద్రించాలి. బియ్యం అమ్మకాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం పన్ను విధించిన నేపథ్యంలో తప్పనిసరిగా జీఎస్టీ లైసెన్స్‌ తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలేవి వ్యాపారులు పాటించడం లేదు. ఉమ్మడి జిల్లాలో కనీసం ఒక్క రైస్‌డిపోకు కూడా ప్యాకింగ్‌ అనుమతి లేకపోవడం గమనార్హం. హుజూరాబాద్‌లోని పలు రైస్‌డిపోల్లో నిబంధనలకు విరుద్ధంగా బ్రాండెడ్‌ పేర్లు ముద్రించి బియ్యం నింపేందుకు సిద్ధంగా ఉన్న వేల ఖాళీ సంచులను తూనికల, కొలతల శాఖ అధికారులు గుర్తించారు.

వినియోగదారుల కళ్లకు గంతలు

ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బీపీటీ, జైశ్రీరాం, సోనా, హెచ్‌ఎంటీ, ఆర్‌ఎన్‌ఆర్‌ తదితర సన్న రకం బియ్యాన్ని వినియోగదారులు కొనుగోలు చేస్తారు. కానీ తక్కువ నాణ్యత కల్గిన బియ్యాన్ని ఈ పేర్లతో ఎక్కువ ధరకు విక్రయిస్తూ వ్యాపారులు లాభం పొందుతున్నారు. స్థానికంగా పండించిన ధాన్యాన్ని మరపట్టించి వివిధ రకాల బ్రాండ్ల పేరుతో ముద్రించిన సంచుల్లో బియ్యాన్ని నింపి అమ్ముతున్నారు. ఎక్కువ ధర ఉన్న సన్నాల బియ్యంలో తక్కువ ధర బియ్యాన్ని కలిపి బ్రాండెడ్‌ అని నమ్మించి వినియోగదారులకు అంటగడుతున్నారు. ఆర్‌ఎన్‌ఆర్‌ బియ్యాన్ని జైశ్రీరాం బ్రాండ్‌ పేరిట సంచుల్లో ప్యాకింగ్‌ చేసి క్వింటాకు రూ.7,000 చొప్పున విక్రయిస్తున్నారు. దీనికితోడు బియ్యం తూకంలోనూ వ్యాపారులు మోసానికి పాల్పడుతున్నారు. నిజానికి ఖాళీ బియ్యం సంచి బరువు 100 గ్రాములు ఉంటుంది. 25, 26 కిలోల సంచులను తూకం వేస్తే 100 గ్రాములు అదనంగా ఉండాలి. కానీ 25 కిలోల సంచిని తూకం వేస్తే 700 గ్రాములు, అలానే 26 కిలోల సంచి కిలో 600 గ్రాములు తక్కువగా ఉంటుంది. ఈ నెల 8న, 24న తూనికలు, కొలతల శాఖ అధికారులు హుజూరాబాద్‌లోని నాలుగు రైస్‌డిపోల్లో దాడులు నిర్వహించగా ఈ తరహా మోసం బయట పడింది. సదరు దుకాణాలపై కేసులు నమోదు చేసి సుమారు రూ.3 లక్షల విలువైన 165 బియ్యం సంచులను సీజ్‌ చేశారు. ఉమ్మడి జిల్లాలో 12,35,810 కుటుంబాలు 70 శాతం సన్న బియ్యం వినియోగిస్తుండగా నెలకు 16 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఈ లెక్కన మిల్లర్లు, వ్యాపారుల దోపిడితో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వినియోగదారులు ఏ స్థాయిలో నష్టపోతున్నారో అర్థం చేసుకోవచ్చు.


నిర్భయంగా ఫిర్యాదు చేయాలి

-కె.విజయసారథి, ఏసీ, తూనికలు, కొలతల శాఖ, కరీంనగర్‌

ఉమ్మడి జిల్లాలో బియ్యం ప్యాకింగ్‌ అనుమతులు ఒక్క దుకాణానికి లేవు. వినియోగదారులు కచ్చితంగా తూకం వేసిన తర్వాతే బియ్యం కొనుగోలు చేయాలి. తూకం తక్కువ ఉంటే అంతే ధర చెల్లించాలి. ఇలాంటి మోసాలపై వినియోగదారులు నిర్భయంగా ఫిర్యాదు చేస్తే తనిఖీలు నిర్వహించి సంబంధిత వ్యాపారులపై కేసులు నమోదు చేస్తాం. ఇకపై తనిఖీలు ముమ్మరం చేస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని