logo

కేసీఆర్‌ రోడ్‌ షోతో భారాసలో హుషారు

భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్‌షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్‌ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్‌షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ నింపింది.

Published : 04 May 2024 05:01 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే : భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోడ్‌షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. పెద్దపల్లి లోక్‌సభ స్థానానికి భారాస అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని ప్రచారానికి వచ్చిన కేసీఆర్‌ బస్సు యాత్ర ద్వారా గోదావరిఖనిలో చేపట్టిన రోడ్‌షో పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్‌ నింపింది. జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్‌, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ కోలేటి దామోదర్‌లు ఆయన వెంట బస్సులో చౌరస్తాకు చేరుకున్నారు. అప్పటికే అంబేడ్కర్‌ జంక్షన్‌తోపాటు చౌరస్తాలో భారీగా కార్యకర్తలు నిండిపోయారు. రామగుండం నియోజకవర్గంలోని గ్రామాలు, పట్టణాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకుని కేసీఆర్‌కు స్వాగతం పలికారు. బస్సులోంచి కేసీఆర్‌ పైకి రాగానే ఒక్కసారిగా కార్యకర్తల నినాదాలు మిన్నంటాయి. ఆయన ప్రసంగం మొదలు పెట్టినప్పటి నుంచి ముగిసే వరకు నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కాంగ్రెస్‌, భాజపాలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్‌ ప్రసంగం సాగింది. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్న భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపించాలని ఆయన కోరారు. కేసీఆర్‌ రోడ్‌షో సందర్భంగా కోలాట బృందాలు, డప్పు కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఒగ్గు డోలు కళాకారులు రోడ్‌షో వెంట సాగారు.

విశేషాలు

  • 48 గంటల తర్వాత గొంతుతో మాట్లాడుతున్నా అంటు కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభించారు. తనపై 48 గంటల పాటు ప్రచారానికి నిషేధం విధించారు. ఎందుకు తనపై నిషేధం విధించారో ప్రజలు చూసుకుంటారని వెల్లడించారు.
  • కల్యాణలక్ష్మితోపాటు తులం బంగారం ఇస్తానన్నారు. ఇచ్చారా అంటూ.. ప్రజలను ప్రశ్నించారు.. లేదు 2 తులాలు ఇచ్చారట. లేదు ఇచ్చారట అంటూ రెండు సార్లు వ్యంగ్యంగా అన్నారు.
  • రూ.4000 పింఛను సంగతి ఏమైందని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు.
  • తన ప్రసంగంలో ప్రధాని మోదీ, సీఎం రేవంత్‌రెడ్డిలపై విమర్శలు చేశారు.
  • ఇక్కడికి 5 గంటలకే హెలికాప్టర్‌లో వచ్చినా. నిషేధం ఉండటంతో 8.30 గంటలకు బయటకు వచ్చిన అని ప్రజలకు వెల్లడించారు. చేనేత కార్మికుల సమస్యలపై మాట్లాడితే ఈసీ నిషేధం విధించింది. మరి ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలు మాట్లాడే మాటలు ఈసీకి వినిపించడం లేదా అని ప్రశ్నించారు.

రోడ్‌ షో సాగిందిలా..

  • రాత్రి 8.34 గంటలకు ఖని అంబేడ్కర్‌ టి జంక్షన్‌ వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు  నాయకులు ఘన స్వాగతం పలికారు.
  • రాత్రి 8.58 గంటలకు ఖని చౌరస్తాకు చేరుకోగా జై కేసీఆర్‌ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.  9.05 నిమిషాలకు కేసీఆర్‌ ప్రసంగం ప్రారంభించారు. 25 నిమిషాలపాటు ఆయన ప్రసంగం సాగింది. కొద్దిసేపు ఉర్దూలో మాట్లాడారు.
  • కేసీఆర్‌ ప్రసంగం అనంతరం పాటలకు జడ్పీ ఛైర్మన్‌ పుట్ట మధు నృత్యం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని