logo

భానుడి భగభగలు!

భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు.

Published : 05 May 2024 04:41 IST

అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం సతమతం
న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌ క్యాంపు

భానుడి భగభగలు ఉమ్మడి జిల్లావాసులను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి.. ఉదయం 7 గంటల నుంచే ఉక్కపోతతో జనం సతమతమవుతున్నారు.. సాయంత్రం 6 గంటల వరకు తీవ్రత తగ్గడం లేదు. ఈ క్రమంలో ప్రతి రోజూ జనం వడదెబ్బతో మృతి చెందుతున్నారు.. శనివారం కూడా రాష్ట్రంలోని అత్యధిక గరిష్ఠ పగటి ఉష్ణోగ్రతలు ఉమ్మడి జిల్లాలో నమోదు కాగా ఈ సీజన్‌లో ఇదే అత్యధిక ఉష్ణోగ్రతగా రికార్డయింది. జగిత్యాల జిల్లా రాయికల్‌ మండలం అల్లీపూర్‌, ధర్మపురి మండలం జైన, కరీంనగర్‌ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల చొప్పున గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత నమోదైంది. జమ్మికుంట 46.7, పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఈసాతక్కళ్లపల్లి 46.1, సిరిసిల్లలో 44.4 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రతలు జనాన్ని ఇబ్బంది పెట్టాయి. కనిష్ఠ రాత్రి ఉష్ణోగ్రతలు కూడా 27- 37 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదు అవుతుండటం గమనార్హం. ఏప్రిల్‌లో ఉమ్మడి జిల్లాలో సాధారణంతో పోలిస్తే సగటు ఉష్ణోగ్రతలు 2-5 డిగ్రీలు పెరగగా మే మొదటివారంలో 2-6 డిగ్రీల సెల్సియస్‌ వరకు అధికంగా నమోదవుతున్నాయి. 45 డిగ్రీల సెల్సియస్‌కు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైతే రెడ్‌జోన్‌గా పేర్కొంటుండగా ఉమ్మడి జిల్లాలోని 50 శాతానికి పైగా మండలాలు రెడ్‌ జోన్‌లోనే ఉంటున్నాయి.


జాగ్రత్తలు పాటించాలి

- డాక్టర్‌ శ్రీనివాస్‌, ఉప వైద్యాధికారి, జగిత్యాల

40 డిగ్రీల సెల్సియస్‌ దాటిన ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు ఎండలో తిరిగితే శరీరంలో వేడిని నియంత్రించే వ్యవస్థ దెబ్బతిని ప్రాణాపాయ పరిస్థితి ఏర్పడుతుంది. ఎండదెబ్బకు గురైతే శరీర ఉష్ణోగ్రత పెరగటం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, వాంతులు, నాడి వేగంగా కొట్టుకోవటం, నాలుక ఎండిపోవటం, నీరసంగా ఉండటం, తడబడటం, అపస్మారక స్థితిలోకి వెళ్లటం జరుగుతుంది. వీరిని వెంటనే నీడకు తీసుకెళ్లి కాస్త ఉపశమనం పొందిన తరువాత ఆసుపత్రికి తీసుకెళ్లాలి.ఉదయం లేదా సాయంత్రం పూటనే ప్రయాణాలు సాగించాలి. ఎండలో తప్పనిసరి వెళ్తే నెత్తిన టోపీˆ, తువాలు వంటివి తప్పనిసరిగా ధరించాలి. చెవులు, ముక్కుకు వేడి గాలి తగలకుండా కప్పి ఉంచాలి. నూలు, వదులు, తెల్లటి లేతరంగు దుస్తులనే ధరించాలి. పాదచారులు గొడుగు నీడన వెళ్లాలి. ఎండలో తేలికైన పనులనే చేయాలి. నీరు అధికంగా తాగాలి. కొబ్బరి నీరు, ఉప్పు కలిపిన మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ద్రావణాన్ని తాగవచ్చు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణించవద్దు. కాళ్లకు చెప్పుల్లేకుండా నడవవద్దు. టీ, కాఫీˆ, ఆల్కహాల్‌, సీˆ్వట్లు, చల్లని కూల్‌డ్రింక్స్‌ను తీసుకోవద్దు.  


ఎండ నుంచి రక్షణగా..

ఎండదెబ్బ మనుషులకే కాదు వాహనాలను వదలడం లేదనేదానికి ఈ చిత్రమే నిదర్శనం. మండుతున్న ఎండలకు వాహనాలు వేడెక్కి సీట్లు మండిపోతున్నాయి. ప్రచండభానుడి ప్రతాపం నుంచి వాహనాలను రక్షించుకునేందుకు జగిత్యాల టవర్‌ ప్రాంతంలో ఇలా తట్టుసంచులతో కప్పారు.

చిత్రం: న్యూస్‌టుడే, జగిత్యాల

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని