logo

బరిలో 42 మంది.. 3 బ్యాలెట్‌ యూనిట్లు

లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ యూనిట్‌(బీయూ), కంట్రోల్‌ యూనిట్‌(సీయూ), వీవీప్యాట్‌ (ఓటర్‌ వెరీఫైడ్‌ పేపర్‌) యంత్రాలను వినియోగించనున్నారు.

Updated : 05 May 2024 04:49 IST

1,850 పోలింగ్‌ కేంద్రాలు..7,051 యంత్రాలు
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

ఈవీఎంలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు

లోక్‌సభ ఎన్నికల్లో వినియోగించే ఈవీఎంల జాబితా కొలిక్కి వచ్చింది. పెద్దపల్లి పార్లమెంట్‌ నియోజకవర్గంలో 42 మంది అభ్యర్థులు బరిలో నిలవడంతో అదనపు యంత్రాల అవసరం ఏర్పడింది. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో బ్యాలెట్‌ యూనిట్‌(బీయూ), కంట్రోల్‌ యూనిట్‌(సీయూ), వీవీప్యాట్‌ (ఓటర్‌ వెరీఫైడ్‌ పేపర్‌) యంత్రాలను వినియోగించనున్నారు. కొద్ది రోజుల క్రితం ఈవీఎంలను తనిఖీలు చేసిన అధికారులు నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్‌ రూంల్లో భద్రపరిచారు. 42 మంది పోటీ చేయడంతో నాలుగు రోజుల క్రితం జిల్లాలకు అదనపు యంత్రాలు వచ్చాయి. వీటిని సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో తనిఖీలు చేశారు. రాజకీయ పార్టీల ఆమోదంతో వీటిని కూడా నియోజకవర్గాలకు తీసుకెళ్లారు.

పెరిగిన పోటీ

పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి పోటీ చేసేందుకు అభ్యర్థులు ఉత్సాహం చూపారు. 2014, 2019 ఎన్నికల్లో 17 మంది పోటీ పడ్డారు. దీంతో రెండు ఈవీఎంలను వినియోగించారు. ప్రస్తుతం జాతీయ, ప్రాంతీయ ప్రధాన పార్టీలతో పాటు 26 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి మూడు బ్యాలెట్‌ యూనిట్‌లు వినియోగించనున్నారు. ఒక్కో బ్యాలెట్‌ యూనిట్‌లో 16 మంది అభ్యర్థులు ఉంటారు. ఈ లెక్కన రెండింటిలో 16 చొప్పున గుర్తులు ఉండగా మరో బీయూలో 10 మంది అభ్యర్థులతో పాటు ఒక నోటా మొత్తం కలుపుకొని 43 గుర్తులున్నాయి.

ఈవీఎంలు మొరాయించకుండా..

ఎన్నికల్లో వినియోగించే ప్రతి యంత్రాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పోలింగ్‌ సమయంలో మొరాయించకుండా సాంకేతిక సమస్యలను సవరించారు. యాదృచ్ఛికీకరణలో రాజకీయ పార్టీ నాయకుల సందేహాలను నివృత్తి చేశారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా సక్రమంగా పని చేసే విధంగా యంత్రాలను సిద్ధంగా ఉంచారు. లోక్‌సభ పరిధిలో 1,850 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి ఒక్క యంత్రం వినియోగిస్తారు. లోక్‌సభ ఎన్నికల్లో బ్యాలెట్‌ యూనిట్లు 7,051, కంట్రోల్‌ యూనిట్లు 2,481, వీవీప్యాట్లు 2,627ను నియోజకవర్గాలకు తరలించి పోలీసుల పహారా ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని