logo

ఇదీ మా ఎజెండా

లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి.

Published : 07 May 2024 02:32 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం: లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది. ఆయా పార్టీలు మ్యానిఫెస్టోలు ప్రకటించి ఇప్పటికే జనంలోకి తీసుకెళ్లాయి. రాష్ట్రవ్యాప్త సమస్యలను, ప్రజల అవసరాలను అందులో చేర్చారు. కరీంనగర్‌ నియోజకవర్గంలో అభ్యర్థులు ఓ అడుగు ముందుకేసి స్థానిక అంశాలతో సొంత ప్రణాళిక తయారు చేసుకున్నారు. దాన్ని ఓటర్ల ముందుకు తీసుకెళ్తూ సమస్యల పరిష్కారంపై హామీ ఇస్తున్నారు. భాజపా, భారాస, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు రూపొందించిన ఎన్నికల ప్రణాళికను ఇప్పటికే ఓటర్ల వద్దకు చేర్చేందుకు ‘ఇంటింటి ప్రచారం’ పేరిట తెలుగులో ముద్రించిన మ్యానిఫెస్టో ప్రతులను పంపిణీ చేస్తున్నారు. మాజీ ఎంపీ, భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ తన హయాంలో ఉన్నపుడు నియోజకవర్గంలో చేసిన పనులు, మళ్లీ గెలిపిస్తే తన ప్రణాళికను వివరిస్తున్నారు. ప్రస్తుత ఎంపీ, భాజపా అభ్యర్థి బండి సంజయ్‌ తాను చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూనే ఆదరిస్తే ప్రజల మధ్య ఉంటానని చెబుతున్నారు. కాంగ్రెస్‌ నుంచి మొదటిసారి బరిలో దిగిన వెలిచాల రాజేందర్‌రావు కూడా తనదైన ప్రణాళికను రూపొందించుకొని ప్రచారంలో వివరిస్తున్నారు.


 ప్రజల గొంతుక.. ప్రగతి కాముక'

- భాజపా అభ్యర్థి బండి సంజయ్‌

‘నమస్కారం... మీ బండి సంజయ్‌కుమార్‌’ అన్న పిలుపుతో మొదలుపెట్టి తాను ఎంపీగా చేసిన అభివృద్ధి వివరాలను మ్యానిఫెస్టోలో వివరించారు. జాతీయ రహదారుల అభివృద్ధి, గ్రామీణ, పట్టణ రహదారుల నిర్మాణం, రైల్వే సమగ్రాభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల సాధన వంటి అంశాలను పేర్కొన్నారు. రుక్మాపూర్‌ సైనిక పాఠశాల, ఎస్సారార్‌ కళాశాల, పీజీ కళాశాలకు అటానమస్‌ హోదా, పాఠశాలలకు ల్యాబ్‌ల ఏర్పాటు వంటివి వివరించారు. నిరుద్యోగుల పక్షపాతిగా ప్రశ్నించే గొంతుక, కరోనాతో పోరాటం, రైతు దీక్ష, 317 జీవోపై దీక్ష వంటి పోరాటాలను ప్రస్తావించారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ అభివృద్ధే మంత్రంగా కరీంనగర్‌ లోక్‌సభ స్థానాన్ని ఆదర్శంగా నిలపాలన్నదే తన లక్ష్యమని వివరించారు.


చేసింది చెబుతా.. కొట్లాడి సాధిస్తా
- భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌

‘దిల్లీ గద్దె మీద ఎవరున్నా కొట్లాడి కరీంనగర్‌ అభివృద్ధిని సాధించడం నా లక్ష్యం.’ అంటూ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ మరోమారు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీ, హైద్రాబాద్‌, కరీంనగర్‌, మనోహరాబాద్‌, కొత్తపల్లి రైల్వే లైన్‌, ఎల్కతుర్తి నుంచి సిద్దిపేట 133 కిలోమీటర్లు, జగిత్యాల నుంచి కరీంనగర్‌ మీదుగా వరంగల్‌ వరకు 216 కిలోమీటర్ల జాతీయ రహదారుల మంజూరు, పనుల ప్రగతి, శాతవాహన విశ్వవిద్యాలయానికి సైన్స్‌ సెంటర్‌, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాలకు వైద్య కళాశాలలు, సింథటిక్‌ ట్రాక్‌ నిర్మాణం వంటివి గతంలో ఎంపీగా ఉన్నపుడు పూర్తి చేశానని వివరిస్తున్నారు. తనను గెలిపిస్తే ప్రతి జిల్లాకు నవోదయ కేంద్రం, ఐసీటీ, ఐఎస్‌ఈఆర్‌, ఐపీఎం, అంత్యోదయ స్కూల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌, పరిశ్రమల స్థాపన, అభివృద్ధికి కృషి చేస్తానని వినోద్‌కుమార్‌ వివరిస్తున్నారు.


సమస్య మీది.. పరిష్కారం మాది
- కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు

‘కోహినూర్‌ కరీంనగర్‌ వెలిచాల సహాయక్‌. సమస్య మీది సత్వర పరిష్కారం మాది.’ నినాదంతో కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు 25 అంశాలతో సొంత ప్రణాళికను రూపొందించారు. కరీంనగర్‌ సహాయక యాప్‌, ఇన్నోవేషన్‌ డెవలప్‌మెంట్‌, కుటీర యంత్ర చేయూత, చదువు, పోటీ పరీక్షలకు శిక్షణ, బోధన నిధి, స్కిల్‌ శిక్షణ, జీవనోపాధి, డ్రైవింగ్‌ స్కూల్‌, గ్రామీణ గ్రంథాలయాలు తదితర అంశాలతో రంగాల వారీగా చేసే పనులపై బుక్‌లెట్‌ ముద్రించారు. వాటిని ఇంటింటికీ పంపిణీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు మహిళల సంక్షేమం, యువతకు చేయూత వంటివి సాధించి అభివృద్ధిపరంగా నియోజకవర్గాన్ని ముందుంచుతానని చెబుతున్నారు.


తమరి రాక.. మాకెంతో సంతోషం

‘వివాహానికి ఆహ్వానిస్తే మంచి మనసుతో వెళ్లి ఆశీర్వదిస్తుంటాం.. అలాంటిది మన భవితను దిద్దుకొనే ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎందుకింత నిరాసక్తత కనబరుస్తున్నాం? అన్న ఆలోచనే ఈ సృజనాత్మక పిలుపునకు నాంది పలికింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఓటు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. అలాంటిదే ఈ పోలింగ్‌ ఆహ్వాన పత్రం. ‘ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ముహూర్తం.. వేదిక పోలింగ్‌ కేంద్రం.. విందు అయిదేళ్ల పాటు శక్తిమంతమైన ప్రజాస్వామ్య ఫలాలు..’ అంటూ ముద్రించిన ఆహ్వాన పత్రిక అందరినీ ఆలోచింపజేస్తోంది.
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌


అవిశ్రాంతంగా 26 ఉత్కంఠగా రోజులు

లోక్‌సభ ఎన్నికల్లో అభ్యర్థులకు మొత్తంగా ఒకటిన్నర నెలల పాటు పరీక్షా సమయమే. నామినేషన్లు వేసిన నాటి నుంచి ఫలితాలు వెల్లడయ్యే వరకు 48 రోజుల పాటు గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ విడుదలైంది. 25తో నామినేషను దాఖలు గడువు ముగిసింది. 26న పరిశీలన, 29న ఉపసంహరణ అనంతరం తుది జాబితాను ఖరారు చేశారు. అప్పటి నుంచి ప్రచారంలో మునిగిన అభ్యర్థులు ఓటరు నాడి పట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. ఓవైపు ఓటరును ఆకట్టుకొనే యత్నం, మరోవైపు అగ్ర నేతల పర్యటనలకు ఏర్పాట్లు, జన సమీకరణ, ఇంకోవైపు ద్వితీయ శ్రేణి నాయకులను సమన్వయం చేసుకోవడానికి తీరిక లేకుండా గడుపుతున్నారు. అంటే 26 రోజులు అవిశ్రాంతంగా కష్టపడాల్సిందే. ఈ నెల 13న పోలింగ్‌ జరగనుండగా 22 రోజుల తర్వాత జూన్‌ 4న ఫలితాలు వెల్లడవుతాయి. అప్పటివరకు అభ్యర్థులు ప్రతి రోజూ పోలింగ్‌ సరళిపై క్షేత్ర స్థాయి సమాచారం సేకరిస్తూ గెలుపు గెలుపోటములపై అంచనాలు వేసుకోక తప్పదు.
- న్యూస్‌టుడే, గోదావరిఖని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని